సినీ నటుడు, కమెడియన్ అలీకి లీగల్ నోటీసులు పంపారు అధికారులు. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట మండలం ఎక్‌మామిడి గ్రామ పంచాయతీ అలీకి నోటీసులు ఇచ్చింది. పంచాయతీ అనుమతి లేకుండా ఫామ్‌హౌస్‌లో నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొంది. ఎక్ మామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి శోభారాణి...ఈ మేరకు సినీనటుడు అలీకి నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్ లోని నిర్మాణాలను వెంటనే ఆపివేయాలని ఆదేశించారు. ఎక్‌మామిడి పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 345లోని ఫామ్‌హౌస్‌లో నూతన నిర్మాణాలకు సంబంధించి తగిన పత్రాలు సమర్పించి, అనుమతులు పొందాలంటూ గతంలోనే అలీకి నోటీసులు ఇచ్చారు.
ఈ నోటీసులపై అలీ స్పందించకపోడంతో తాజాగా రెండోసారి ఎక్ మామిడి పంచాయతీ కార్యదర్శి శోభారాణి మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫామ్ హౌస్ నిర్మాణాలకు సంబంధించిన పత్రాలు సమర్పించి అనుమతులు పొందాలని కోరారు. లేని పక్షంలో పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఈ నెల 5న మెుదటిసారి నోటీసు ఇవ్వగా అలీ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో ఈనెల 22న మరోసారి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌లో పని చేస్తున్న వారికి నోటీసులు అందించామని పంచాయతీ సెక్రటరీ తెలిపారు.
కొద్ది సంవత్సరాల క్రితం కమెడియన్ అలీ ఎక్ మామిడి గ్రామ పంచాయతీ పరిధిలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని అలీ వ్యవసాయానికి వినియోగించేవారు. స్థానిక కూలీల సహాయంతో ఈ భూమిలో పంటలు, పండ్ల తోటలు వేశారు. అయితే తన ఫామ్ కు వెళ్లేటప్పుడు ఉండడానికి ఫామ్ హౌస్ నిర్మించుకోవాలని నిర్ణయించి నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటికే ఫామ్ హౌస్ నిర్మాణం పూర్తవ్వగా... ఈ నిర్మాణాలు అక్రమంగా నిర్మించారని ఆరోపణలు వచ్చాయి.
గ్రామ పంచాయతీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపించారు. దీంతో గ్రామ పంచాయతీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తమ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టినట్లు తేలడంతో అధికారులు అలీకి నోటీసులు జారీ చేశారు. దీనిపై అలీ నుంచి ఎలాంటి వివరణ వస్తుందో చూడాలి. ఇటీవల వరకు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్న అలీ... వైసీపీ ఘోర పరాభవంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.