South Central Railway : ఈ రైళ్లలో ప్రయాణం నరకం.. పైగా ఎక్కువ ఛార్జీలు! ఎందుకిలా?
South Central Railway : ఎక్కువ దూరం సౌకర్యవంతంగా ప్రయాణించడానికి చాలామంది రైళ్లను ఆశ్రయిస్తున్నారు. రెగ్యులర్ సర్వీసులు లేకపోతే.. ఎక్కువ డబ్బులు పెట్టి స్పెషల్ ట్రైన్స్‌లో వెళ్తున్నారు. కానీ.. వారికి నరకం కనిపిస్తోంది. ప్రత్యేక రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి.
వివిధ పండగలు, యాత్రల సమయంలో సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. వీటి ద్వారా రద్దీని తగ్గిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. కానీ.. ప్రయాణికులు మాత్రం నరకం చూస్తున్నారు. ఏవో కొన్ని సందర్భాల్లో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయంటే ఏమోగానీ.. కొన్ని ట్రైన్స్ మాత్రం ఎప్పుడూ లేట్‌గానే రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రత్యేక రైళ్ల విషయం అయితే చెప్పాల్సిన పనిలేదు.
ఈ రైళ్లు మరీ దారుణం..
07098 నంబర్ రైలు విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య నడుస్తోంది. ఇది ఏకంగా 6 గంటల పైనే ఆలస్యంగా నడుస్తోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ రైళ్లో ఛార్జీలు కూడా ఎక్కువే. స్లీపర్ క్లాస్‌కు రూ.385, థర్డ్ ఏసీకి రూ.1050, సెకండ్ ఏసీకి రూ.1440 వసూలు చేస్తున్నారు. అయినా పర్లేదని బుక్ చేసుకున్న ప్రయాణికులు నరకం చూస్తున్నారు. 07132 నబంర్ రైలు కొట్టాయం- కాచిగూడ మధ్య నడుస్తోంది. ఈ రైలు కూడా 5 గంటలకు పైనే ఆలస్యంగా నడుస్తోంది. దీంట్లో కూడా స్లీపర్ క్లాస్‌కు రూ.385, థర్డ్ ఏసీకి రూ.1050, సెకండ్ ఏసీకి రూ.1440 వసూలు చేస్తున్నారు.
రెగ్యులర్ కూడా అంతే..
12733 నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ కూడా ఎప్పుడూ ఆలస్యంగా నడుస్తోంది. 2 గంటలకు పైగా ఆలస్యంగా నడుస్తుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ రైళ్లో స్లీపర్ క్లాస్‌కు రూ.175, థర్డ్ ఏసీకి రూ.555, సెకండ్ ఏసీకి రూ.760 వసూలు చేస్తున్నారు. 12703 నబంర్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ ట్రైన్. ఇది కూడా నిత్యం ఆలస్యంగా నడుస్తోంది. దాదాపు 3 గంటల కంటే ఎక్కువే లేట్‌గా నడుస్తోంది. దీంట్లో కూడా స్లీపర్ క్లాస్‌కు రూ.175, థర్డ్ ఏసీకి రూ.555, సెకండ్ ఏసీకి రూ.760 వసూలు చేస్తున్నారు.
స్పెషల్ బాదుడు..
ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నారు. అదే సమయంలో స్పెషల్‌గా బాదుతున్నారు. ఒక్కో టికెట్‌పై కనిష్ఠంగా రూ.100, గరిష్ఠంగా రూ.680 పైనే వసూలు చేస్తున్నారు. స్లీపర్ క్లాసుకు స్పెషల్ ట్రైన్లలో తక్కువలో తక్కువ రూ.100 ఎక్కువగా ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ 200 రూపాయల పైనే ఉంటుంది. థర్డ్ ఏసీ టికెట్లకు అయితే.. కనిష్ఠంగా రూ.300, గరిష్ఠంగా రూ.500 పైనే వసూలు చేస్తున్నారు. ఇక సెకండ్ ఏసీ టికెట్లకు రూ.300 నుంచి రూ.680 పైనే వసూలు చేస్తున్నారు.