Train Reservation : సంక్రాంతికి నాలుగు నెలల ముందే.. గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో రిగ్రెట్‌!-reservation in trains are full four months before sankranti festival ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Train Reservation : సంక్రాంతికి నాలుగు నెలల ముందే.. గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో రిగ్రెట్‌!

Train Reservation : సంక్రాంతికి నాలుగు నెలల ముందే.. గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్, దురంతో ఎక్స్‌ప్రెస్‌లలో రిగ్రెట్‌!

Basani Shiva Kumar HT Telugu
Sep 16, 2024 10:36 AM IST

Train Reservation : తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగకు హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు సొంతూళ్లకు తరలి వెళతారు. ఎక్కువగా రైళ్లలో ప్రయాణాలు సాగిస్తారు. ఫలితంగా రైలు టికెట్లకు భారీగా డిమాండ్ ఎర్పడింది. దీంతో 4 నెలల ముందే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.

సౌత్ సెంట్రల్ రైల్వే
సౌత్ సెంట్రల్ రైల్వే

సంక్రాంతికి నాలుగు నెలల ముందే.. రైలు ప్రయాణం దడ పుట్టిస్తోంది. దసరా, దీపావళి పండగలు రాకముందే సంక్రాంతికి రైలు టిక్కెట్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. జనవరిలో హైదరాబాద్‌ నుంచి బయలుదేరే రైళ్ల టిక్కెట్లన్నీ అయిపోయాయి. కనీసం వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లయినా బుక్ చేద్దాం.. పండగ నాటికి రిజర్వేషన్‌ ఖరారు కాకపోదా? అని ఆశపడేవారికీ ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది.

జనవరి 10, 11, 12 తేదీల్లో విశాఖ, ఫలక్‌నుమా, గరీబ్‌రథ్ వంటి రైళ్లన్నీ రిగ్రెట్‌ చూపుతున్నాయి. 120 రోజుల ముందు రైళ్లకు టిక్కెట్‌ రిజర్వేషన్‌ చేయించుకునే వెసులుబాటు ఉంది. జనవరి 10 నుంచి మొదలయ్యే సంక్రాంతి పండగ ప్రయాణానికి సెప్టెంబరు 11వ తేదీ నుంచే లక్షల మంది ప్రయత్నించారు. దీంతో హైదరాబాద్, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయ్యాయి.

సాధారణ రైళ్లతో పోలిస్తే ఎక్కువ ఛార్జీలు ఉండే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లోనూ ఖాళీల్లేవు. ఒక్కో రైల్లో వందల సంఖ్యలో వెయిటింగ్‌ లిస్టు ఉంది. జనవరి 11న ప్రయాణానికి విశాఖ ఏసీ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్‌ ఏసీలో 341, జన్మభూమిలో 238, ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో 197 వెయిటింగ్‌ లిస్టు చూపిస్తోంది. జనవరి 10వ తేదీన ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో 160, జన్మభూమిలో 100 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు.

12వ తేదీన రెండు వందేభారత్‌ రైళ్లలో 255 మంది వెయింటింగ్ లిస్టు ఉంది. ఈస్ట్‌కోస్ట్‌లో అన్ని తరగతుల్లో 221 మంది వెయిటింగ్‌లిస్టు జాబితాలో ఉన్నారు. పద్మావతి, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో 10-12 తేదీల్లో పెద్ద ఎత్తున వెయిటింగ్‌ లిస్టు ఉంది. సికింద్రాబాద్‌ నుంచి వరంగల్, ఖమ్మం వెళ్లేవారికీ విశాఖ గరీబ్‌రథ్, కోకనాడ, ఈస్ట్‌కోస్ట్, గోదావరి, చార్మినార్, సింహపురి ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లలో రిజర్వేషన్‌ దొరకట్లేదు. కేవలం శాతవాహన, గుంటూరు ఇంటర్‌సిటీ, కృష్ణా ఎక్స్‌ప్రెస్‌, గోల్కొండలలో మాత్రం 10, 11, 12 తేదీల్లో తక్కువ సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అటు ఆర్టీసీ బస్సుల్లోనూ సీట్లు దొరకడం కష్టంగా మారింది. దీంతో చాలామంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. నాలుగు నెలల ముందే ట్రై చేసినా టికెట్లు దొరక్కపోవడంపై ప్రయాణం ప్లాన్ చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.