TG Samagra Kutumba Survey : 'కోటి' దాటిన సమగ్ర కుటుంబ సర్వే - ప్రారంభమైన డేటా ఎంట్రీ
Telangana Samagra Kutumba Survey : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తుది దశకు చేరింది. మరోవైపు శనివారం నుంచి వివరాల కంప్యూటరీకరణ కూడా షురూ అయింది. ఈ నెలఖారులోపు ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే తుది దశకు చేరింది. చాలా జిల్లాల్లో సర్వే ప్రక్రియ పూర్తి కాగా… మరికొన్నిచోట్ల 90 శాతం దాటింది. ఇప్పటి వరకు కోటికిపైగా నివాసాల్లో సర్వే పూర్తి అయింది. మరో పది శాతం ఇళ్లల్లో సర్వే పూర్తి అయితే వంద శాతం చేరుకుంటుంది.
ఓవైపు సర్వేలో భాగంగా వివరాల సేకరణ ప్రక్రియ పూర్తి కావటంతో మరోవైపు డేటా ఎంట్రీపై అధికారులు దృష్టి పెట్టారు. పలు జిల్లాల్లో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం నుంచి వివరాలను కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఎంపీడీవోతో పాటు పలు కార్యాలయాల్లో ప్రత్యేకంగా డేటాను ఎంట్రీ చేస్తున్నారు. నవంబర్ 30వ తేదీలోపు డేటా ఎంట్రీ పని పూర్తి అయ్యే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో డిసెంబర్ మొదటి వారంలోపు ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.
మొత్తం 33 జిల్లాల్లో దాదాపు ఎనిమిది నుంచి 9 జిల్లాల్లో సర్వే పూర్తి కావొచ్చింది. ములుగు, జనగాం, వరంగల్ జిల్లాల్లో వంద శాతం వరకు చేరుకుంది. ఈ జిల్లాల్లో డేటా ఎంట్రీ పనులు ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లాల్లో 99.9 శాతం, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99 శాతం సర్వే పూర్తి కావొచ్చింది.
డేటా ఎంట్రీ చాలా కీలకం - డిప్యూటీ సీఎం భట్టి
సర్వే ప్రక్రియ, డేటా ఎంట్రీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుందని… డేటా ఎంట్రీ దశ చాలా ముఖ్యమైనదని చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దన్నారు.
ఇవాళ ఉదయం జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లుకు పలు సూచనలు చేశారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయని.. కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయాలని సూచించారు. ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సర్వే చాలా కీలకమని మరోసారి గుర్తు చేశారు.