Ginger at Home: ఇంట్లోనే సింపుల్‍గా అల్లాన్ని పెంచుకోండి ఇలా.. ఈ టిప్స్ పాటించండి
How to Grow Ginger at Home: ఇంట్లోనే అల్లాన్ని పెంచుకోవచ్చు. ఈ తీరు సులభంగానూ ఉంటుంది. దీనివల్ల తాజాగా అల్లాన్ని ఇంట్లోనే పొందవచ్చు. ఇంట్లో అల్లాన్ని ఎలా పెంచుకోవాలో ఇక్కడ చూడండి.
నిత్యం చాలా వంటకాల్లో అల్లాన్ని వాడుతూనే ఉంటాం. అల్లంతో పానియాలు కూడా చేసుకోవచ్చు. అల్లం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు జరుగుతుంది. అందుకే దాదాపు అందరూ అల్లాన్ని ఎప్పుడూ కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే, అల్లాన్ని ఇంట్లోనే సింపుల్‍గా పెంచుకోవచ్చు. ఇలా చేస్తే ఎప్పటికప్పుడు తాజా అల్లం ఇంట్లోనే దక్కుతుంది. ఇందుకోసం కొన్ని టిప్స్ పాటించాలి. ఇంట్లో అల్లాన్ని ఎలా పెంచుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
అల్లం ఎంపిక ఇలా..
ముందుగా కాస్త ముదురుగా ఉన్న అల్లాన్ని తెచ్చుకోవాలి. అల్లం మరీ పెద్దగా ఉంటే కట్ చేసుకోవాలి. అల్లం ముక్కలు సుమారు ఒకటి నుంచి ఒకటిన్నర ఇంచులుగా ఉంటే మేలు. ఆ అల్లం ముక్కలను రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి.
మట్టి.. నాటడం ఇలా..
అల్లం ముక్కలను నాటేందుకు కాస్త పెద్దగా ఉండే కుండీని తీసుకోవాలి. ఇందులో సారవంతమైన మట్టిని వేయాలి. మట్టి కాస్త వదులుగా ఉండాలి. నదిలోని మట్టి అయితే ఇంకా బాగుంటుంది. కుండీలో మట్టిని పోసి దానిపై నీళ్లు చల్లాలి. ఆ తర్వాత ఓ గంట తర్వాత అల్లం ముక్కలను అందులో నాటాలి.
వెలుతురు, నీరు పోయడం ఇలా..
అల్లం నాటిన కుండీని వెలుతురుగా ఉండే చోట పెట్టాలి. కాస్త ఉదయపు సూర్యరశ్మి తగిలేలా ఉంటే బాగుంటుంది. అయితే, నేరుగా ఎక్కువ ఎండ మాత్రం తగలకూడదు. కాస్త వెలుతురు తగిలేలా ఈ కుండీలను కిటికీల వద్ద లేకపోతే పెడితే బాగుంటుంది. మట్టిని పొడిగా కాకుండా జాగ్రత్త పడాలి. మట్టిలో తేమ ఆరుతుందనిపించినప్పుడు నీటిని పోయాలి.
మొక్కను నాటడం
నాటిన అల్లం ముక్కల నుంచి సుమారు 3 నుంచి 8 వారాల మధ్య మొలకలు వస్తాయి. మొక్కలా కాస్త పెరగనివ్వాలి. ఆ తర్వాత అల్లం మొక్కలను పీకి.. మళ్లీ వేర్వేరు కుండీల్లో సారవంతమైన మట్టిలో నాటుకోవాలి. వాటిని పెంచుకోవాలి.
అల్లం మొక్కలను నాటిన కుండీలకు వెలుతురు తగిలేలా పెట్టాలి. వీటికి కాస్త ఎండ తరిగినా మంచిదే. రెగ్యులర్‌గా నీరు పోస్తూ ఉండాలి. అవసరమైతే ద్రవంగా ఉన్న సేంద్రియ ఫెర్టిలైజర్ వాడాలి. సుమారు 8 నెలలకు పూర్తిస్థాయిలో అల్లం సాగు పూర్తవుతుంది. కుండీలోని మట్టిలో పెరిగిన అల్లాన్ని తీసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే అల్లాన్ని పెంచుకోవచ్చు.
అల్లం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. విటమిన్ సీ, బీ6, మెగ్నియం, ఐరన్, ఫైబర్ సహా మరిన్ని పోషకాలు అల్లంలో ఉంటాయి. అల్లం తీసుకుంటే జీర్ణ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు తగ్గేందుకు ఉపకరిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
టాపిక్