Wedding Invitation Scam : వాట్సాప్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ- సైబర్ కేటుగాళ్ల సరికొత్త మోసం
Wedding Invitation Scam : సైబర్ నేరగాళ్లు మరో సరికొత్త స్కామ్ కు తెరలేపారు. వాట్సాప్ లో పెళ్లి ఆహ్వానాల లింక్ లు పంపిస్తున్నారు. ఆ లింక్ ఓపెన్ చేయగానే మన వ్యక్తిగత, ఆర్థిక వివరాలు చోరీ చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ పోలీసులు సూచిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఓ సినిమాలో ఇన్సూరెన్స్ ఏజెంట్ల పేరిట ఎలా సైబర్ క్రైమ్ లకు పాల్పడ్డారో చూపించారు. రోజుకో కొత్త అవతారం, పూటకో కొత్త ఐడియాతో సామాన్యులనే కాదు చదువుకున్న వారిని సైతం బురిడీ కొట్టించి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో తాజాగా ఓ విషయంపై అవగాహన కల్పించారు.
వాట్సాప్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరుతో స్కాములకు తెరలేపారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ ద్వారా పెళ్లి ఆహ్వానాల పేరుతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయన ఏపీ పోలీసులు అంటున్నారు. నేరస్తులు నకిలీ లింకులతో APK ఫైళ్లు పంపి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని దోచేస్తున్నారని, ఇలాంటి లింక్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
స్కామ్ ఎలా జరుగుతుంది?
మీకు పెళ్లి ఆహ్వానం పంపినట్లు వాట్సాప్ లో ఒక మెసేజ్ వస్తుంది. ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ ను చూడడానికి ఒక లింక్ క్లిక్ చేయమని కోరుతారు. ఆ లింక్ ను క్లిక్ చేస్తే, అది మాల్వేర్ ను డౌన్లోడ్ చేస్తుంది. మీ ఫోన్ డేటాను చోరీ చేస్తుంది. మీ వ్యక్తిగత, ఆర్థిక వివరాలను సేకరించి, బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తారు సైబర్ నేరగాళ్లు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాట్సాప్, ఫోన్ మెసేజ్ లలో అనుమానస్పద లింక్ లను క్లిక్ చేయవద్దు. అనధికారిక APK ఫైళ్లు డౌన్లోడ్ చేయవద్దు. సెక్యూరిటి అప్డేట్స్ ఆన్ లో ఉంచండి. మీ వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ చెప్పవద్దు. అలాగే ఓటీపీ ఎవ్వరికి షేర్ చేయవద్దు. మీరు ఏదైనా స్కామ్ లో చిక్కుకున్నట్లు అనిపిస్తే వెంటనే మీ బ్యాంక్ లేదా సైబర్ క్రైమ్ 1930ను సంప్రదించండి.
మొదటి గంటలో ఫిర్యాదు కీలకం
సైబర్ నేరాల్లో ఎక్కువగా ఓటీపీ, తప్పుడు సమాచారం, మోసపూరిత హామీలతో జరిగే లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్ల బారిన పడ్డామని గుర్తించిన వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బు వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేరగాళ్లు వినియోగించిన బ్యాంకు ఖాతాలను గుర్తించి వాటిలో లావాదేవీలను నిలిపివేయడానికి వీలవుతుంది. బ్యాంకు ఖాతాల నుంచి మరో ఖాతాకు జరిగే లావాదేవీలను బ్యాంకులు అమోదించడానికి గంట వ్యవధి ఉంటుంది. నేరగాళ్లు డబ్బును మళ్లించినా, వాటిని నగదుగా మార్చుకున్నా తిరిగి రాబట్టడానికి తొలి గంటలో ఫిర్యాదు చేయడం కీలకం. మీ చిరునామా, స్థానం, ఫోన్, ఆధార్, పాన్, పుట్టిన తేదీ లేదా ఏదైనా వ్యక్తిగత వివరాలను ఫోన్ లేదా సందేశాల ద్వారా ఎవరితోనూ పంచుకోవద్దు. కాల్‌లో మీ పేరును గుర్తించడానికి కూడా నిరాకరించండి.
మీకు కాల్ చేసిన వారే మీ పేరు, నంబర్లను మీరు 'ధృవీకరించాలని' అడగండి. ఏవైనా వివరాలను తెలుసుకోవాలని వారికి చెప్పండి. వారు మీ వివరాలను కలిగి ఉన్నప్పటికీ, వాటిని నిర్ధారించకండి.అవసరం లేని సంభాషణ తిరస్కరించండి. కేవలం డిస్‌కనెక్ట్ చేసి బ్లాక్ చేయండి. ఎలాంటి అనుమానాస్పద సందర్భంలో అయినా మిమ్మల్ని మీరు రక్షించుకునే విధానం కాల్ కట్ చేయడమే. నంబర్‌ను నోట్ చేసి బ్లాక్ చేయండి. కాల్ సమయంలో ఎటువంటి నంబర్లను నొక్కవద్దు, వారి మాట వినవద్దు. వారు ఒత్తిడి తెచ్చినా, మిమ్మల్ని భయపెట్టినా, వెంటనే చెప్పినట్టు చేయాలని బలవంతం చేసినా అది సైబర్ క్రైమ్ అని గుర్తించండి. సైబర్ మోసగాళ్లు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తారు. సైబర్ నేరానికి గురైతే 1930 లేదా https://cybercrime.gov.in/ లో నేరుగా ఫిర్యాదు చేయండి.
సంబంధిత కథనం