Kissing Babies: శిశువుకు ముద్దులు పెడుతున్నారా? హెచ్చరించిన అధ్యయనం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Kissing Babies: శిశువులకు చాలా మంది ముద్దులు ఎక్కువగా పెడుతుంటారు. నుదుటిపై, ముఖంపై ఎక్కువగా ముద్దాడుతుంటారు. అయితే, ఇలా చేయడం మంచిది కాదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.
పిల్లలను చూడగానే ఎక్కువ మంది చేసే పని వారి చెంపలపై ముద్దు పెట్టడం. పిల్లలు క్యూట్‍గా కనిపించడంతో పెద్దలు వారిని ముద్దాడేందుకు ఇష్టపడతారు. చూడడానికి కూడా ఇది చాలా అపురూపంగా అనిపిస్తుంది. అప్యాయతను వ్యక్తం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే, శిశువులను ఎక్కువగా ముద్దు పెట్టుకోకూడదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది.
ఇన్ఫెక్షన్ల రిస్క్
శిశువులకు ముద్దులు పెట్టే అంశంపై లీస్టర్ యూనివర్సిటీ బృందం అధ్యయనం చేసింది. దాని ప్రకారం, శిశువుల్లో అప్పుడప్పుడే రోగ నిరోధక వ్యవస్థ వృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే, ఎవరైనా ముద్దుపెట్టినప్పుడు వారి ద్వారా పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకే రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఆ స్టడీ హెచ్చరించింది. పెద్దలతో పోలిస్తే.. మూడు నెలల వయసులోపు శిశువులకు రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే చిన్న ఇన్ఫెక్షన్లు అయినా వారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.
కాస్త పెద్ద అయిన పిల్లలు, పెద్దల కంటే శిశువుల్లో.. ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా ముద్దు పెట్టినప్పుడు వారి పెదాలు, చేతుల ద్వారా వారి శరీరంలోకి బ్యాక్టీరియా వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్ల రిస్క్ పెరుగుతుంది. ఇది శిశువుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. రకరకాల అనారోగ్యాలకు కారణయ్యే అవకాశం ఉంటుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
శుభ్రత పాటించాలి: శిశువులను ముట్టుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. శిశువుల ముఖంపై ముద్దు పెట్టడం బదులు.. వారి పాదాలు, తల వెనుక భాగంలో ముద్దుపెట్టవచ్చు. దీనివల్ల ఇన్ఫెక్షన్ల రిస్క్ తక్కువగా ఉంటుంది.
ఇతరులకు తల్లిదండ్రులు చెప్పాలి: తమ శిశువును ముద్దు పెట్టుకోవద్దని ఇతరులకు తల్లిదండ్రులు చెప్పాలి. ఈ విషయంలో మొహమాటం వద్దు. ముందుగా చిన్నారి ఆరోగ్యమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లో శిశువు ముఖంపై ముద్దు పెట్టవద్దని చెప్పాలి.
ఇన్ఫెక్షన్స్ ఉంటే: ఒకవేళ ఇప్పటికీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే శిశువును పట్టుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా శిశువుకు ఒక నెల నిండే వరకు దగ్గరికి వెళ్లకూడదు. ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారు ఉంటే.. శిశువులు దగ్గరగా ఉంటే మాస్కులు, గ్లౌజ్ లాంటివి ధరించడం మేలు.
టాపిక్