Winter Tips: చలికాలంలో ఇన్ఫెక్షన్లు, వ్యాధుల రిస్క్ తగ్గించే 6 రకాల విటమిన్లు.. తప్పక తెలుసుకోండి!
Winter Tips: చలికాలంలో ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు ఉన్న ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి. ఇన్ఫెక్షన్లు, రోగాల రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో పోషకాహారాలు తినాలి.
కాలం మారుతున్న సమయంలో.. ముఖ్యంగా శీతాకాలం వచ్చేటప్పుడు ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చలికాలం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉండే కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశాలు పెరుగుతాయి. అందుకే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. కొన్ని రకాల విటమిన్లు శరీరంలో రోగ నిరోధక శక్తి అధికంగా చేస్తాయి. అందుకు కీలకమైన 6 విటమిన్లు ఏవో ఇక్కడ చూడండి.
విటమిన్-సీ
రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ)ని విటమిన్-సీ బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీకి ముఖ్యమైన మైక్రోన్యూట్రియంట్‍గా ఈ విటమిన్‍ను భావిస్తారు. తెల్లరక్తకణాల ఉత్పత్తి, పనితీరులో ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్‍గా విటమిన్ సీ ఉంటుంది. రోగాలు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని ఈ విటమిన్ తగ్గించగలదు. అందుకే శీతాకాలంలో విటమిన్ సీ ఎక్కువగా ఉండే నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లు, బెర్రీలు, బ్రకోలీ, బంగాళదుంప, టమాటాలు లాంటివి తీసుకోవాలి.
విటమిన్- ఈ
విటమిన్-ఈ కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. రోగ నిరధక కణాలను కాపాడడంలో, ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించడంలో ఈ విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇమ్యూన్ కణాల పనితీరు మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని విటమిన్ ఈ పెంచుతుంది. సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఆకుకూరలు, నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి, చేపలు లాంటి వాటిలో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది.
విటమిన్-డీ
విటమిన్-డీ కూడా రోగ నిరోధక శక్తిని శరీరంలో పెంచగలదు. తెల్ల రక్త కణాల రకాలైన మోనోసైటిస్, మాక్రోఫేజెస్‍ల సామర్థ్యాన్ని, వ్యాధులతో పోరాడే శక్తిని ఈ విటమిన్ అధికం చేస్తుంది. జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గించగలదు. పుట్టగొడుగులు, ఫ్యాటీ చేపలు, కోడిగుడ్డు సొన, సోయా మిల్క్ లాంటి వాటిలో విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది.
విటమిన్-బీ6
శరీరంలో రోగనిరోధక శక్తి కణాలను పెంచడంలో విటమిన్ బీ6 కీలకపాత్ర పోషిస్తుంది. ఇమ్యూనిటీని మెరుగుపరుస్తుంది. అప్పటికే ఏదైనా సీజనల్ వ్యాధి బారిన పడినా విటమిన్ బీ6 పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకుంటే త్వరగా కోలుకునేందుకు సహకరిస్తుంది. యాంటీబాడీల ఉత్పత్తిని కూడా ఈ విటమిన్ పెంచగలదు. కోడిగుడ్లు, బీన్స్, కాయధాన్యాలు, నట్స్, సోయా ఉత్పత్తులు, లీన్ మీట్స్, సాల్మోన్ చేపల్లో విటమిన్ బీ6 అధికంగా ఉంటుంది.
విటమిన్-ఏ
విటమిన్ ఏ కూడా శరీరంలో రోగ నిరోధక శక్తికి మేలు చేస్తుంది. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు రాకుండా ఈ విటమిన్ రక్షణ కల్పించగలదు. తెల్ల రక్త కణాల ఉత్పత్తిలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు ఇన్యూనిటీ వ్యవస్థకు ఉపకరిస్తుంది. క్యారెట్లు, చిలకడదుంపలు, పాలకూర, కేల్, పాలు, చీజ్, బీఫ్ లివర్, గుమ్మడి, క్యాప్సికం లాంటి వాటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది.
విటమిన్-బీ12
రోగ నిరోధక శక్తి పనితీరును విటమిన్ బీ-12 మెరుగుపరుస్తుంది. తెల్లరక్తకాణాల ఉత్పత్తికి కూడా తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థకు ఈ విటమిన్ ఎక్కువగా మేలు చేస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడేందుకు సహకరిస్తుంది. సాల్మోన్, టునా చేపలు, చికెన్, పాలు, కోడిగుడ్లు, యగర్డ్, పాలల్లో విటమిన్ బీ12 పుష్కలంగా దక్కుతుంది.