Weight loss With Rice: అన్నం మానేయకుండా బరువు తగ్గొచా? ఈ టిప్స్ పాటించండి
Weight loss: బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేయాలనే వాదన ఎక్కువగా వినిపిస్తుంటుంది. వెయిట్ లాస్ డైట్‍లో వైట్ రైస్ ఉండకూడదని అంటుంటారు. అయితే, అన్నం పూర్తిగా మానేయడం చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే అన్నం తింటూనే బరువు తగ్గొచ్చు.
బరువు తగ్గేందుకు పోషకాలతో కూడిన ఆహారంతో డైట్ పాటించడం చాలా ముఖ్యం. బరువు తగ్గాలంటే అన్నం పూర్తిగా మానేయాలని చాలా మంది చెబుతుంటారు. అన్నంలో క్యాలరీలు, కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, ఇది తింటే బరువు పెరుగుతారని అంటుంటారు. ఇది వాస్తవమే. అయితే, తెలుగు వారికి అన్నం అనేది మొదటి నుంచి అలవాటు ఉంటుంది. ఒక్కసారిగా పూర్తిగా మానేయాలంటే మనసు రాదు. అందుకే చాలా మంది అన్నం లేకుండా వెయిట్ లాస్ డైట్ చేసేందుకు ఇష్టపడరు. అయితే, అన్నం తింటూ కూడా బరువు తగ్గొచ్చు. ఇందుకు కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది.
పరిమితంగా.. అరకప్పు
బరువు తగ్గే ప్రయత్నం చేసే వారు అన్నం తినొచ్చు. కానీ ఇది పరిమితంగా ఉండాలి. సాధారణంగా వండిన కప్పు అన్నంలో సుమారు 240 క్యాలరీలు ఉంటాయి. భోజనంలో అన్నం అరకప్పు మాత్రమే ఉండాలి. అంతకు మించి తినకూడదు. అలా అయితే సుమారు 120 క్యాలరీలు తీసుకున్నట్టు అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు ఓ మీల్‍లో అరకప్పుకు మించి అన్నం తీసుకోకూడదు. కూరగాయలు సహా ఇతర పోషకాహారాలు భోజనంలో ఉండాలి.
ప్రోటీన్ ఫుడ్స్ ఉండాలి
పరిమితంగా అన్నం తీసుకున్నా.. భోజనంలో ప్రోటీన్ ఫుడ్ కచ్చితంగా ఉండాలి. ప్రోటీన్ ఫుడ్స్ తినడం వల్ల చాలాసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. తరచూ తినకుండా క్యాలరీలు ఎక్కువ తీసుకోవడాన్ని ప్రోటీన్ తగ్గిస్తుంది. కాయధాన్యాలు, పప్పులు, బీన్స్, గుడ్లు, చికెన్, పన్నీర్, లీన్ మీట్‍లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
కూరగాయలు ఎక్కువగా..
భోజనంలో కూరగాయలు ఎక్కువగా ఉండాలి. అన్నం కంటే భోజనంలో వీటిని అధికంగా తీసుకోవాలి. కూరగాయల్లో ఫైబర్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీంతో కూరగాయలు తింటే కడుపు నిండటంతో పాటు క్యాలరీలు తక్కువగా తీసుకోవచ్చు. బరువు తగ్గేందుకు ఫైబర్ ఉపకరిస్తుంది. కూరగాయల్లోని విటమిన్లు, మినరల్స్ ఓవరాల్ ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
వండే విధానం
అన్నం వండే విధానంపై కూడా దృష్టి పెట్టాలి. నూనె, వెన్నెతో ఫ్రై చేసిన ఫ్రైడ్ రైస్ తీసుకోకూడదు. ఇవి తింటే క్యాలరీల సంఖ్య మరింత పెరుగుతుంది. అందుకే సాధారణంగా ఉడికించిన, స్ట్రీమ్ చేసిన అన్నాన్ని పరిమితి మేర తినాలి.
ఒకవేళ, వైట్ రైస్ కాకుండా ఇతర ధాన్యాలతో అన్నం తినగలమని అనుకుంటే ఇతర ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్‍తో చేసిన అన్నం తింటే మరింత మేలు. వైట్ రైస్‍తో పోలిస్తే వీటిలో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువు తగ్గేందుకు ఎక్కువ తోడ్పడతాయి. అయితే, వీటితో చేసిన అన్నమైనా పరిమితి మేరనే తీసుకోవాలి.