Parenting Tips: తల్లిదండ్రులు.. మీకు తెలియకుండా ఈ 5 పొరపాట్లు చేస్తున్నారా.. పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది!
Parenting Tips: తల్లిదండ్రులు చేసే కొన్ని పనులు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అవి పొరపాట్లు అని కూడా చాలా మంది తల్లిదండ్రులకు తెలియదు. అలా పేరెంట్స్ చేసే కొన్ని విషయాల వల్ల పిల్లల ఆత్మవిశ్వాసం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది.
చిన్నతనంలో పిల్లల మనసు సున్నితంగా ఉంటుంది. శారీరంగా, మానసికంగా వారు ఎదుగుతుంటారు. పిల్లలు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని తల్లిదండ్రులు నిరంతరం ఆరాటపడుతుంటారు. ఇందుకోసం చిన్నతనం నుంచే వారిని తీర్చిదిద్దాలను ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అవి పొరపాట్లు అని కూడా చాలా మందికి తెలియదు. తమ పిల్లల కోసమే అలా చేస్తున్నామనుకుంటారు. అయితే, తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
ఇతర పిల్లలతో పోల్చడం
తమ పిల్లలను ఇతరులతో తల్లిదండ్రులు పోల్చడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. చదువులో మార్కుల నుంచి ప్రవర్తన వరకు ఇతర పిల్లలతో పోలుస్తుంటారు. చాలా మంది ఇలా చేస్తుంటారు. అయితే, తరచూ ఇలా ఇతరులతో పోల్చడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం బాగా దెబ్బతింటుంది. సున్నితంగా ఉండే వారి మనసు గాయపడుతుంది. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతరులతో పోల్చి ఎప్పటికీ తిట్టకూడదు. కావాలంటే నేరుగా సూచనలు, సలహాలు ఇవ్వొచ్చు. అవసరమైతే స్ఫూర్తిగా తీసుకోవాలనే చెప్పాలని కానీ.. పోలుస్తూ బాధపెట్టకూడదు.
అతి జాగ్రత్త
పిల్లల పట్ల ఉండాల్సిన దాని కంటే కొందరు తల్లిదండ్రులు అతి జాగ్రత్తతో ఉంటారు. పిల్లలను సొంతంగా ఏ చిన్న పని చేయనివ్వరు, ఏ నిర్ణయం తీసుకోనివ్వరు. ఇలా చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. సమస్యలను పరిష్కరించే గుణాన్ని త్వరగా నేర్చుకోలేరు. ఆ తర్వాత కూడా తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే వారి పరిధిలోని నిర్ణయాలను పిల్లలే తీసుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు వారి నిర్ణయాల పట్ల ఎప్పుడూ దృష్టి సారించాలి. ఏదైనా తప్పటడుగు వేస్తుంటే అప్పుడు వారికి దాని గురించి వివరించాలి. పొరపాటును సరిద్దిద్దుకునేలా వివరంగా చెప్పాలి.
పొరపాట్లను పెద్ద తప్పులుగా చూడడం
పిల్లలు ఏదైనా పనులు చేసే సమయంలో పొరపాట్లు చేస్తారు. అయితే ఆ విషయాల్లో కొందరు తల్లిదండ్రులు వారిపై కోప్పడుతుంటారు. ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా ఆగ్రహిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కొత్త పనులు చేసేందుకు పిల్లల్లో ఆత్మవిశ్వాసం దెబ్బ తింటుంది. పిల్లలు పొరపాటు చేస్తే సరి ఎలా చేసుకోవాలో తల్లిదండ్రులు ప్రశాంతం వివరించారు. పొరపాట్లు సహజమేనని, సరిగా చేసే ప్రయత్నించాలని ప్రోత్సహించాలి. ఇలా చేస్తే పిల్లల్లో ఉత్సాహం, సృజనాత్మకత, కొత్తగా ఏదో సాధించాలనే ఉత్సుకత పెరుగుతాయి.
మనసులో ఉన్నది చెప్పకపోవడం
కొందరు తల్లిదండ్రులు.. పిల్లలకు తమ మనసులో ఏముందో వివరంగా చెప్పరు. ఏదో దాస్తున్నట్టు సగం..సగం మాట్లాడుతుంటారు. ఇది కూడా పిల్లల ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. వారు కూడా మీతో పూర్తిగా ఏ విషయాన్ని చెప్పలేరు. మనసు విప్పి మాట్లాడలేరు. అందుకే పిల్లలు ఏ విషయంలో అయినా సందేహాలు అడిగితే కసురుకోకూడదు. వీలైనంత మేర వారి ప్రశ్నలకు స్పష్టమైన సలహాలు ఇవ్వాలి. ఇలా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం వల్ల పేరెంట్స్, పిల్లల మధ్య బంధం మరింత బలంగా ఉంటుంది.
ప్రశంసించకపోవడం
తాము విజయం సాధించిన సమయంలో తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు రాకపోతే పిల్లలు చిన్నబుచ్చుకుంటారు. దీంతో వారి ఆత్మవిశ్వాసంపై ఇది ప్రభావం చూపుతుంది. చిన్న విషయమైనా, పెద్దదైనా పిల్లలు సాధించే ప్రతీ విజయాన్ని తల్లిదండ్రులు గుర్తించి, ప్రశంసించాలి. ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా పిల్లలను పొగడాలి. దీంతో పిల్లల్లో గెలిచేందుకు, సాధించేందుకు ఉత్సాహం పెరుగుతుంది. ఒకవేళ ఓడినా తర్వాత గెలుస్తావనేలా ప్రోత్సాహం అందించాలి. దీనివల్ల ఓటమి పట్ల వారిలో ఉన్న భయం పోతుంది.