Virat Kohli Century: పెర్త్ టెస్టులో శతకం బాదిన విరాట్ కోహ్లీ.. ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్, ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
Australia Target in 1st Test vs India: విరాట్ కోహ్లీ, యశస్వి జైశ్వాల్ సెంచరీలు బాదడంతో సొంతగడ్డపై ఆస్ట్రేలియాకి ఫస్ట్ టెస్టులోనే టీమిండియా ఊహించని సవాల్ విసిరింది. పెర్త్ టెస్టులో కొండంత లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు నిలిపింది.
ఆస్ట్రేలియా గడ్డపై సగర్వంగా తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ను భారత్ జట్టు కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఆదివారం డిక్లేర్ చేశాడు. మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం ఓవర్ నైట్ స్కోరు 172/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టులో యశస్వి జైశ్వాల్ (161: 297 బంతుల్లో 15x4, 3x6), విరాట్ కోహ్లీ (100 నాటౌట్: 143 బంతుల్లో 8x4, 2x6) సెంచరీలు బాదేశారు. దాంతో భారత్ జట్టు 487/6తో రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 46 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని ఓవరాల్‌గా ఆస్ట్రేలియా ముందు 534 పరుగుల టార్గెట్‌ని టీమిండియా నిలిపింది.
ఆస్ట్రేలియా బౌలర్లకి యశస్వి చుక్కలు
ఆదివారం మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆటే ఇప్పటి వరకూ హైలైట్‌గా నిలిచింది. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఆస్ట్రేలియాలో ఆడుతున్న యశస్వి.. ఏమాత్రం బెరుకు లేకుండా ఆస్ట్రేలియా బౌలర్లని ఉతికారేశాడు.
ఒకానొక దశలో ఈ యంగ్ ఓపెనర్‌ను నిలువరించలేక అసాధారణ రికార్డులున్న ఆస్ట్రేలియా బౌలర్లు సైతం తలలు పట్టుకున్నారు. ఏ స్థాయిలో వారిపై యశస్వి జైశ్వాల్ ఆధిపత్యం చెలాయించాడంటే.. వ్యక్తిగత స్కోరు 95 పరుగుల వద్ద హేజిల్‌వుడ్ ప్రమాదకర బౌన్సర్‌ని సంధిస్తే ఏమాత్రం బెరుకు లేకుండా కీపర్ తలమీదుగా దాన్ని సిక్స్‌గా తరలించేశాడు. దెబ్బకి నోరెళ్లబెట్టడం ఆస్ట్రేలియా వంతైంది.
ఎట్టకేలకి 2024లో కోహ్లీ సెంచరీ
కేఎల్ రాహుల్ (77) హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించినా.. దేవదత్ పడిక్కల్ (25), రిషబ్ పంత్ (1), ధ్రువ్ జురెల్ (1), వాషింగ్టన్ సుందర్ (29) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. ఒక ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. విరాట్ కోహ్లీ అసాధారణ పట్టుదలని ప్రదర్శించాడు. ఈ ఏడాది టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయిన విరాట్ కోహ్లీ ఎట్టకేలకి మూడంకెల స్కోరుని అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో విరాట్ కోహ్లీకి ఇది 30వ సెంచరీకాగా.. ఓవరాల్‌గా అతని సెంచరీల రికార్డ్ 81కి చేరింది.
లాస్ట్‌లో మెరిసిన తెలుగు క్రికెటర్
తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి (38 నాటౌట్: 27 బంతుల్లో 3x4, 2x6) ఒకవైపు విరాట్ కోహ్లీకి సెంచరీ అవకాశం కల్పిస్తూ గతి తప్పిన బంతుల్ని బౌండరీకి తరలిస్తూ వచ్చాడు. విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోగా.. భారత్ ఇన్నింగ్స్‌ను కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా డిక్లేర్ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ నితీశ్ కుమార్ రెడ్డి 41 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
3 రోజులు ఆట సాగిందిలా
నవంబరు 22 (శుక్రవారం) ప్రారంభమైన ఈ పెర్త్ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో టీమిండియాకి 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఈరోజు రెండో ఇన్నింగ్స్‌ను 487/6తో డిక్లేర్ చేసింది. మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. 534 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమే. కాబట్టి.. భారత్ గెలుపు లాంఛనమే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి.