IND vs AUS 1st Test: పెర్త్ టెస్టులో శతకం బాది భారత్ జట్టుని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టిన యశస్వి జైశ్వాల్
Yashasvi Jaiswal century: పెర్త్ టెస్టులో మూడో రోజే భారత్ జట్టు విజయానికి బాటలు వేసుకుంది. ఆస్ట్రేలియా బౌలర్లని వారి సొంతగడ్డపైనే ఉతికారేసిన యశస్వి జైశ్వాల్.. 161 పరుగులు చేశాడు. దాంతో..?
ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులోనే విజయానికి టీమిండియా బాటలు వేసుకుంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (161: 297 బంతుల్లో 15x4, 3x6) ఆదివారం భారీ సెంచరీ బాదేశాడు. దాంతో ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 410/6తో కొనసాగుతున్న టీమిండియా.. 456 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కి 46 పరుగుల ఆధిక్యం లభించిన విషయం తెలిసిందే.
రాహుల్ మిస్.. జైశ్వాల్ సెంచరీ
మ్యాచ్‌లో మూడో రోజైన ఆదివారం ఓవర్ నైట్ స్కోరు 90 పరుగులతో ఈరోజు బ్యాటింగ్ కొనసాగించిన యశస్వి జైశ్వాల్.. శనివారం నాటి దూకుడుని కొనసాగిస్తూ కెరీర్‌లో నాలుగో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై జైశ్వాల్‌కి ఇదే ఫస్ట్ సెంచరీ. ఇక 62 పరుగులతో ఈరోజు బ్యాటింగ్ కొనసాగించిన కేఎల్ రాహుల్ మరో 15 పరుగులు మాత్రమే జోడించి 77 పరుగుల వద్ద ఔటైపోగా.. అనంతరం వచ్చిన దేవదత్ పడిక్కల్ (25), రిషబ్ పంత్ (1), ధ్రువ్ జురెల్ (1), వాషింగ్టన్ సుందర్ (29) తక్కువ స్కోరుకే ఔటైపోయారు.
పట్టుదలతో క్రీజులో కోహ్లీ
కానీ.. విరాట్ కోహ్లీ (67 బ్యాటింగ్: 116 బంతుల్లో 4x4, 1x6) పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతనికి తోడుగా ప్రస్తుతం క్రీజులో విశాఖపట్నంకు చెందిన క్రికెటర్ నితీశ్ రెడ్డి 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈరోజు మొత్తం భారత్ జట్టు బ్యాటింగ్ చేసి.. కనీసం 500 పైచిలుకు లక్ష్యాన్ని ఆస్ట్రేలియాకి నిర్దేశించే అవకాశం ఉంది.
రెండు రోజులు ఆసీస్‌కి కష్టమే
మ్యాచ్‌లో ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా.. పిచ్ నెమ్మదిగా మళ్లీ బౌలర్లకి అనుకూలించే సంకేతాలు కనిపిస్తున్నాయి. దాంతో రెండు రోజుల్లో భారత్ బౌలర్లని ఎదుర్కొని ఆస్ట్రేలియా వికెట్లని కాపాడుకుంటూ ఆ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యం.
ఇప్పటి వరకు మ్యాచ్‌లో స్కోర్లు
శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా 104 పరుగులకే ఆలౌటవడంతో.. భారత్ జట్టుకి 46 పరుగుల ఆధిక్యం లభించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది.