Breastfeeding: శిశువుకు పాలు పట్టేటప్పుడు కొరికితే.. ఈ చిట్కాలు పనిచేస్తాయి-does your child bites while breast feeding try these tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Breastfeeding: శిశువుకు పాలు పట్టేటప్పుడు కొరికితే.. ఈ చిట్కాలు పనిచేస్తాయి

Breastfeeding: శిశువుకు పాలు పట్టేటప్పుడు కొరికితే.. ఈ చిట్కాలు పనిచేస్తాయి

Koutik Pranaya Sree HT Telugu
Oct 02, 2024 07:00 PM IST

Breastfeeding: పిల్లలు పాలు తాగేటప్పుడు కొరుకుతుంటారు. దీంతో తల్లి చాలా బాధను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని వెనుక ఉన్న కారణం, దీన్ని నివారించడానికి కొన్ని చిట్కాలను తెల్సుకోండి

తల్లిపాలు పట్టడం
తల్లిపాలు పట్టడం (Shutterstock)

శిశువుకు తల్లిపాలివ్వడం మధురమైన అనుభూతి. ఇది శిశువుకు, తల్లికీ మద్య బంధాన్ని పెంచుతుంది. తల్లి పాలివ్వడం బిడ్డ ఆరోగ్యానికి మాత్రమే కాదు, తల్లి ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు పిల్లలు పాలు తాగే సమయంలో కొరికినట్లు చేస్తారు. ఇది దాదాపు ప్రతి తల్లి ఎదుర్కొనే చాలా సాధారణ సమస్య. దీంతో నొప్పిని భరించాల్సి వస్తుంది. మీరు కూడా కొత్త తల్లిగా ఈ పరిస్థితిని ఎదుర్కొంటుంటే, మీ కోసం ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి.

కారణాలు:

తల్లి పాలిచ్చేటప్పుడు పిల్లలు కొరకడం వెనక అనేక కారణాలు ఉండొచ్చు. పిల్లలు పాలు తాగుతున్నప్పుడు వాళ్లకు సరిపడా పాలు రాకపోయినా వాళ్లు కొరకడం మొదలుపెట్టొచ్చు. లేదా ఒక్కోసారి తల్లి దృష్టిని ఆకర్షించడానికీ చనుమొనను కొరకడం మొదలు పెడతారు. అలాగే దంతాలు వచ్చేముందు చిగుళ్లలో ఉండే దురద పోగొట్టుకోడానికి ఇలా చేయొచ్చు. అయితే దీన్ని అలాగే భరించాల్సిన పనిలేదు. కొన్ని చిట్కాలు చక్కగా పనిచేస్తాయి.

కూర్చునే స్థితి:

సరైన స్థితిలో కూర్చుని లేదా పడుకుని పాలివ్వండి. దీంతో పాలు సరిగ్గా అందుతాయి. ఒకవేళ పాల ఉత్పత్తి తగ్గిందేమో చూడండి. దానికోసం నీళ్లు ఎక్కువగా తాగండి. పోషకాలున్న ఆహారం తీసుకోండి. పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినండి. పాల ఉత్పత్తి సరిగ్గా ఉంటే శిశువుకు పాలు అంది కొరకడం మానేస్తారు. 

అలాగే కొరికిన వెంటనే దూరంగా జరగితే గాటు పడొచ్చు. నొప్పి రావచ్చు. అలాకాకుండా మీరు శిశువు నోటి దగ్గరికి వీలైనంత జరగండి. లేదా మీవైపుకు పాపను తెచ్చుకోండి. వెంటనే కొరకడం కాస్త మానేస్తారు. 

దృష్టి పెట్టండి.

చాలాసార్లు తల్లులు పిల్లలకు పాలిచ్చేటప్పుడు మొబైల్, లేదా టీవీ చూడటం, ఏదైనా పుస్తకం చదవడంలో బిజీగా ఉంటారు. పిల్లలు తల్లి దృష్టిని తమ వైపు ఆకర్షించడానికి కొరకడం ప్రారంభిస్తారు. కాబట్టి మీ పూర్తి శ్రద్ధ పిల్లలపై మాత్రమే ఉంచండి. మాట్లాడటం లేదా జోలపాటలు పాడటం చేయండి.

దంతాలు రావడం:

శిశువు దంతాలు బయటకు వచ్చినప్పుడు లేదా వచ్చేముందు చిగుళ్లలో దురద ఉంటుంది. అందుకే ఉపశమనం కోసం పాలు తాగేటప్పుడు కొరకడం మొదలెడతారు. ఈ సమస్య కోసం బయటపడటానికి వాళ్ల చిగుళ్లపై కాస్త మసాజ్ చేయొచ్చు. మీ చేతి వేలిని ఇవ్వొచ్చు. లేదంటే టీతర్లు వాడొచ్చు. పచ్చి కూరగాయలు క్యారట్ లాంటివి పొడవాటి ముక్కలుగా కట్ చేసి ఇస్తే వాటిని కొరుకుతారు. దాంతో దురద తగ్గుతుంది.

టాపిక్