TG MLCs Oath: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్.. మండలిలో ప్రమాణం చేయించిన ఛైర్మన్ గుత్తా
TG MLCs Oath: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం , అమీర్ అలీఖాన్‌లు ప్రమాణం చేశారు. శాసన మండలిలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్ కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్సీల ప్రమాణంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టైంది.
TG MLCs Oath: తెలంగాణలో గత కొద్ది నెలలుగా వివాదాస్పదంగా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై నెలకొన్న వివాదం ముగిసింది. ఇటీవల గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై జోక్యానికి సుప్రీం కోర్టు నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ సిఫార్సులకు అమోద ముద్ర లభించింది.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్‌లను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు హైకోర్టులో సవాలు చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ నియామకాలను నిలిపివేసి మరోసారి నియామక ప్రక్రియ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు గతంలో తీర్పునిచ్చింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరోసారి అవే పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేశారు.
తెలంగాణలో గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రతిపాదిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. నాటి గవర్నర్ తమిళ సై వారి నియామకాలను తిరస్కరించారు. గవర్నర్ కోటాకు తగిన అర్హతలు వారికి లేవని అభ్యంతరం తెలిపారు. ఈ లోపు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆ నియామకాలు నిలిచిపోయాయి.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు అమీర్ అలీఖాన్‌లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. న్యాయపరమైన వివాదాలు తలెత్తాయి. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో కొంత జాప్యం జరిగింది. హైకోర్టు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ నియమకాలను రద్దు చేసిన కొత్తగా ప్రక్రియ చేపట్టాలని సూచించింది.
ఈ నేపథ్యంలో మరోమారు అవే పేర్లను ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేశారు. తాజాగా శుక్రవారం మండలిలో వారితో ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు పాల్గొన్నారు. మరోవైపు శాసనసభ ఎన్నికల సందర్భంగా కుదిరిన ఒప్పందం మేరకు కోదండరామ్ నేతృత్వంలోని పార్టీకి కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నారు.