IPL Auction: ఆక్షనీర్ తప్పిదంతో భారత వికెట్ కీపర్‌కి చేజారబోయిన రూ. 4 కోట్లు.. క్షమాపణలు చెప్పడంతో ఆఖరికి రూ.11 కోట్లు
RCB IPL 2025 Auction: భారత వికెట్ కీపర్ జితేశ్ శర్మని నాలుగు ఫ్రాంఛైజీలతో పోటీపడి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. అయితే.. ఆఖర్లో పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం కార్డుని వాడగా.. బెంగళూరు ధరని అమాంతం పెంచాల్సి వచ్చింది. కానీ.. ఐపీఎల్ ఆక్షనీర్ ఇక్కడ చిన్న తప్పిదం చేసింది.
IPL 2025 Auctioneer Mallika Sagar: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆక్షనీర్‌గా వ్యవహిస్తున్న మల్లికా సాగర్ చిన్న తప్పిదం చేసింది. దాంతో భారత వికెట్ కీపర్ జితేశ్ శర్మ రూ.4 కోట్ల వరకూ నష్టపోబోయడు. అయితే.. వెంటనే తప్పిదాన్ని గ్రహించిన మల్లికా సాగర్ క్షమాపణలు చెప్పగా.. చివరికి జితేశ్ శర్మ రూ.11 కోట్లకి అమ్ముడుపోయాడు.
అసలు ఏం జరిగిందంటే?
భారత్‌కి చెందిన వికెట్ కీపర్ జితేశ్ శర్మ రూ.1 కోటి కనీస ధరతో ఆదివారం వేలానికి వచ్చాడు. గత మూడు సీజన్లుగా పంజాబ్ కింగ్స్‌కి ఆడుతున్న ఈ వికెట్ కీపర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బిడ్ వేసింది. వెంటనే లక్నో సూపర్ జెయింట్స్ పోటీకి వచ్చింది. ఈ రెండు ఫ్రాంఛైజీలు రూ.3.40 కోట్ల వరకూ పోటీపడ్డాయి. ఈ దశలో ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఎంట్రీ ఇచ్చింది.
ధరని పెంచేసిన ఢిల్లీ క్యాపిటల్స్
రిషబ్ పంత్ స్థానంలో వికెట్ కీపర్ కావాల్సి ఉండటంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ గట్టిగా పోటీపడింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఎంట్రీ ఇవ్వడంతో.. జితేశ్ శర్మ ధర రూ.7 కోట్లకి తాకింది. కానీ.. ఆఖర్లో అతని పాత జట్టు పంజాబ్ కింగ్స్ ఎంట్రీ ఇచ్చి రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కార్డుని ప్రయోగించింది.
కార్తీక్‌కి రిప్లేస్ కోసం బెంగళూరు పట్టు
కానీ.. దినేశ్ కార్తీక్ లేకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ వికెట్ కీపర్ కోసం చూస్తోంది. ఈ నేపథ్యంలో.. రూ.7 కోట్లకే ఆర్టీఎం కార్డు కారణంగా జితేశ్ శర్మకి ఇచ్చేందుకు బెంగళూరు ఇష్టపడలేదు. దాంతో రూ.11 కోట్ల ధరని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెప్పింది. ఆ మాటలు విన్న ఆక్షనీర్ మల్లికా సాగర్.. పొరపాటున రూ.11 కోట్లకి బదులుగా రూ.7 కోట్లకే జితేశ్ శర్మ బెంగళూరుకి అమ్ముడుపోయినట్లు ప్రకటించింది.
కానీ.. క్షణాల వ్యవధిలోనే తన తప్పిదాన్ని గ్రహించిన మల్లికా సాగర్.. క్షమాపణలు చెప్తూ రూ.11 కోట్లకి జితేశ్ శర్మ అమ్ముడుపోయినట్లు ప్రకటించింది.
ఎవరు ఈ మల్లికా సాగర్
మల్లికా సాగర్‌కి గతంలో ఆక్షన్ నిర్వహించిన అనుభవం ఉంది. అమెరికాలో ఆర్ట్ హిస్టరీ డిగ్రీ పూర్తిచేసిన ఈ 48 ఏళ్ల ఆక్షనీర్.. గత మూడేళ్ల నుంచి స్పోర్ట్స్‌కి సంబంధించిన ఆక్షన్స్‌ను నిర్వహిస్తోంది. 2008 నుంచి ఐపీఎల్ వేలం నిర్వహించిన హ్యూగ్ ఎడ్మీడ్స్, రిచర్డ్ మ్యాడ్లీ, చారు శర్మ తదితరులు వయసురిత్యా ఇప్పుడు వేలం నిర్వహించే స్థితిలో లేరు. దాంతో.. ముంబయికి చెందిన మల్లికా సాగర్‌కి అవకాశం లభించింది.