Sunrisers Hyderabad IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ చాలా తెలివిగా పేస్ గుర్రం మహ్మద్ షమీని కొనుగోలు చేసింది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్‌ను రూ.18 కోట్లతో రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ.. ఆదివారం ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతనికి జోడీగా భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని కొనుగోలు చేసింది.
రూ.2 కోట్ల కనీస ధరతో వేలానికి వచ్చిన మహ్మద్ షమీ కోసం తొలుత కోల్‌కతా నైట్‌రైడర్స్ బిడ్ వేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ పోటీకి వచ్చింది. దాంతో ఈ రెండు ఫ్రాంఛైజీలు షమీ కోసం రూ.8.25 కోట్ల వరకూ పోటీపడగా.. ఈ దశలో లక్నో సూపర్ జెయింట్స్ రేసులోకి వచ్చింది.
ఈ మూడు ఫ్రాంఛైజీలు రూ.9.75 వరకూ పోటీపడగా.. ఆఖర్లో అనూహ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.10 కోట్లకి బిడ్ వేసింది. అయితే.. ఏ ఫ్రాంఛైజీ ఆపై ధరకి బిడ్ వేయకపోవడంతో.. షమీ ఎవరూ ఊహించని రీతిలో రూ.10 కోట్లకే సన్‌రైజర్స్ సొంతమయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్ కోసం రూ.6.25 కోట్లని మాత్రమే గుజరాత్ టైటాన్స్ ఇవ్వడం గమనార్హం.
ఇప్పటి వరకు 110 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన మహ్మద్ షమీ.. 127 వికెట్లు పడగొట్టాడు. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ సమర్థంగా బౌలింగ్ చేయగల.. మహ్మద్ షమీ.. పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టడంలో ఎక్స్‌ఫర్ట్. కమిన్స్, షమీ జోడితో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ దళం పదునెక్కిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మహ్మద్ షమీ గాయాల కారణంగా.. గత ఏడాది నుంచి భారత్ జట్టుకి దూరంగా ఉంటున్నాడు. అయితే.. ఇటీవల అతను ఫిట్‌నెస్ సాధించాడు. అయితే.. ఐపీఎల్ 2025కి పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్‌తో ఉంటాడా? అనేది ఇప్పుడు పెద్ద సందేహం.