Karimnagar : కరీంనగర్‌లో నకిలీ ధ్రువపత్రాల కలకలం.. నలుగురిపై కేసు.. ముగ్గురు అరెస్టు
Karimnagar : కరీంనగర్‌లో ఆక్రమణలకు పాల్పడే వారిపై అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. తప్పుదారుల్లో భూములను ఆక్రమించుకునేందుకు స్కెచ్ వేసిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూమి ఆక్రమించిన నలుగురిపై కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు.
కరీంనగర్ టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. కరీంనగర్ లోని ఫతేపురాలో నివాసం ఉంటున్న షేక్ అబూబాకర్.. 1992లో రేకుర్తి శివార్లలోని సర్వే నంబర్ 79/2లో 8.12 ఎకరాల భూమిని సాలెహ్ బీ వద్ద కొనుగోలు చేశారు. 1996లో ఈ భూమిని ప్లాట్లుగా మార్చారు. పలువురికి విక్రయించగా ప్లాట్ నంబర్ 311లోని 200 గజాల స్థలాన్ని గొర్ల లక్ష్మికి విక్రయించారు. ఆ స్థలాన్ని 2010లో మేడిశెట్టి లచ్చయ్యకు విక్రయించగా ఆయన 2011లో గుర్రం బాలనరేందర్ కు అమ్ముకున్నారు.
అయితే ఈ ప్లాట్ ను ఆనుకుని ఉన్న 312, 313 ప్లాట్లలోని 400 గజాల స్థలాన్ని షేక్ అబూబకర్ ఎవరికీ విక్రయించకుండా తన పేరిటనే అట్టిపెట్టుకున్నారు. ఈ 400 గజాల స్థలాన్ని కాజేయాలన్న దురుద్దేశ్యంతో 311 ప్లాట్ యజమానిగా ఉన్న బాల నరేందర్, గుర్రం రాజయ్య, ఉప్పు శ్రీనివాస్, చీటి ఉపేందర్ రావులు పథకం పన్నారు.
సంతకం ఫోర్జరీ చేసి..
రేకుర్తి గ్రామ పంచాయితీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ చేశారు. తప్పుడు ఇంటి నంబర్ సృష్టించి 2022లో గంగాధర సబ్ రిజిస్టర్ కార్యాలయం ద్వారా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేసుకున్నారు. ఆ తరువాత సప్లిమెంట్ డీడ్ ద్వారా 312, 313 ప్లాట్లను రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు చేయించారు. 312 ప్లాట్ ను చీటి ఉపేందర్ రావు పేరిట, 313 ప్లాట్ ను ఉప్పు శ్రీనివాస్ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ భూమికి సంబంధించిన రికార్డులను తారుమారు చేసి.. యజమాని అబూబాకర్ ను చంపుతామని బెదిరించారు. ఆయన కరీంనగర్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులు గుర్రం బాల నరేందర్, ఉప్పు శ్రీనివాస్, చీటి ఉపేందర్ రావు, గుర్రం రాజయ్యలపై 420, 467, 468, 471, 120-B, 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏ1 కరీంనగర్ విద్యానగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన గుర్రం బాలనరేందర్ (37), ఏ3 విద్యానగర్ కి చెందిన ఉప్పు శ్రీనివాస్ (47), ఏ4 మెహర్ నగర్ కి చెందిన చీటీ ఉపేందర్ రావు (38)ను అరెస్ట్ చేశారు. ఏ2 గుర్రం రాజయ్య పరారీలో ఉన్నారు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ టీమ్ ఏర్పాటు చేశారు. అరెస్టు అయిన ముగ్గురిని కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్ విధించారు. వారిని జిల్లా జైలుకు తరలించారు.
(రిపోర్టింగ్- కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)