Minister Sridhar: కరీంనగర్‌లో మరో లక్ష ఎకరాలకు సాగునీరిస్తామన్న శ్రీధర్‌బాబు, పత్తిపాక రిజర్వాయర్ స్థల పరిశీలన
Minister Sridhar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు కసరత్తు చేస్తుంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించేలో పనిలో నిమగ్నమయింది.
Minister Sridhar: తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులపై డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో పర్యటించే సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 4న పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనలో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్ లపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
అందులో భాగంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణారావు, ఎంఎస్ రాజ్ ఠాకూర్ తో కలిసి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పత్తిపాక రిజర్వాయర్ స్థల పరిశీలన చేశారు. మూడు గుట్టల మధ్యన 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించి వారం పది రోజుల్లో డిపిఆర్ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
శ్రీపాదఎల్లంపల్లి, మిడ్ మానేర్, వరద కాలువ నిర్మించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. గత పదేళ్ళు పాలించిన బిఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలో అదనంగా ఒక్క ఎకరానికి సాగునీరు అందించలేదన్నారు. వచ్చే నాలుగేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తిచేసి అదనంగా లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు. కెసిఆర్ మాదిరిగా తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ప్రత్తిపాక రిజర్వాయర్ తో నాలుగు నియోజకవర్గాలకు మేలు
పత్తిపాక రిజర్వాయర్ తో నాలుగు నియోజకవర్గాలకు ఎంత మేలు జరుగుతుంది. మూడు టీఎంసీల సామర్థ్యంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చే విధంగా నిర్మించే రిజర్వాయర్ తో పెద్దపల్లి మంథని రామగుండం ధర్మపురి నియోజకవర్గాల్లో ప్రత్యక్షంగా పదివేల ఎకరాలకు, పరోక్షంగా రెండు లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.
అనేక సంవత్సరాలు వేచి చూస్తున్న ఈ ప్రాంత ప్రజలు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రత్తిపాక రిజర్వాయర్ ను ప్రాధాన్యత గల ప్రాజెక్టు గా చేపడుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వారం పది రోజుల్లో ల్యాండ్ అక్వేషన్ పై నిర్ణయం తీసుకుంటామని నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇచ్చేలా కృషి చేస్తున్నామని తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేర్, వరద కాలువ కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమని, ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు.
బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం...
ప్రజలకు మేలు చేయడానికి తాము ప్రయత్నిస్తుంటే బిఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం బిఆర్ఎస్ చేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బిఆర్ఎస్ ఆరాటం ఆందోళనతో ప్రజల్ని తప్పు దారి పట్టించే ప్రయత్నం తప్ప మరొకటి లేదన్నారు. పదేళ్ళు పని చేయలేక.. సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళలేక నిర్లక్ష్యం చేసిన బిఆర్ఎస్ ఇప్పుడు తాము చేస్తున్న పనులను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.
గోదావరి పక్కనే ఉన్నా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయకట్టును పెంచే ప్రయత్నం చేయలేదని ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్ళడాన్ని వ్యతిరేకించడం లేదు..కానీ ఇక్కడి ప్రజల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా స్థానికంగా నీళ్ళు ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో మార్పు కనిపించాలని తరుగు లేకుండా చేశామని తెలిపారు. మద్దతు ధర తోపాటు సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నామని స్పష్టం చేశారు.
20 ఏళ్ళ పోరాటం ఫలిస్తున్న వేళ...
పత్తిపాక రిజర్వాయర్ తో పాతికేళ్ళ పోరాటం ఫలించి, కళ నెరవేరబోతుందని పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేలు విజయరామారావు ఎంఎస్ రాజ్ ఠాకూర్ తెలిపారు. కేసిఆర్ గోదావరి నుంచి నీళ్ళు మల్లన్న సాగర్ కు వరకు తీసుకెళ్ళారు...కానీ తలాపున గోదావరి ఉన్నా ఇక్కడి ప్రజలకు నీళ్ళు ఇవ్వలేదని ఆరోపించారు.
గత ప్రభుత్వం ఏరోజు కూడా పత్తిపాక రిజర్వాయర్ గురించి ఆలోచించలేదని విమర్శించారు. టిఆర్ఎస్ నేతలు కేసిఆర్ ఒక అబద్దం ఆడి వంద అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పత్తిపాక రిజర్వాయర్ అంకురార్పణ చేయబోతున్నామని తెలిపారు.
రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.