పెళ్లి తర్వాత జీవితం మారిపోతుంది. లైఫ్‍ను పంచుకునేందుకు ఓ వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెడతారు. జీవితాంతం వరకు ఒకరికొకరుగా ముందుకు సాగాలనే ఆకాంక్షలతో వివాహం చేసుకుంటారు. అయితే, పెళ్లయిన కొత్తలో త్వరగా ఒకరితో ఒకరికి ఎమోషనల్ బాండింగ్ అంత బలంగా ఉండదు. లవ్ మ్యారేజ్ అయితే ముందుగానే ఒకరి గురించి ఒకరికి ఎక్కువ తెలిసి ఉంటుంది. అయితే, పెద్దలు కుదిర్చిన వివాహమైతే జీవిత భాగస్వాములకు పరస్పర ఇష్టాలు, అభిప్రాయాలు, కోరికలు పెద్దగా తెలియవు. వీరి మధ్య బంధం బలపడేందకు కాస్త సమయం పడుతుంది. అయితే, కొన్ని చిన్నచిన్న పనులు చేయడం ద్వారా జీవిత భాగస్వాముల మధ్య ఎమోషనల్ బంధం బలపడుతుంది. అవేవో ఇక్కడ తెలుసుకోండి.
కొత్తగా వివాహమైన జీవిత భాగస్వాములు ఒకరు చెప్పే మాటలు మరొకరు శ్రద్ధగా వినాలి. ఏ చిన్న విషయమైనా ఇంట్రెస్టింగ్‍గా ఆలకించాలి. దీనివల్ల ఒకరి ఇష్టాలు ఒకరు త్వరగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. శ్రద్ధగా వింటుంటూ ముచ్చట్లు కూడా ఎక్కువగా.. చాలా సేపు సాగుతాయి. దీంతో ఎమోషనల్‍గా త్వరగా కనెక్ట్ అవుతారు. చాలా అంశాలపై పరస్పరం అభిప్రాయాలను తెలుసుకోగలుగుతారు. అందుకు తగ్గట్టుగా ముందుకు సాగేందుకు, సర్దుబాట్లు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏదైనా నిజాయితీతో మాట్లాడాలి
కొత్త జంట కలిసి నడవడం అనేది కూడా చాలా ముఖ్యం. ఏదైనా ప్రశాంతమైన ప్రాంతంలో చేతులు పట్టుకొని కలిసి నడవాలి. మొబైళ్లు లాంటివి పక్కనపెట్టి.. ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకు సాగాలి. సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ లాంగ్ వాక్ చేయాలి. నడుచుకుంటూ మాట్లాడే సమయంలో మనసులోని విషయాలు బాగా వ్యక్తం అవుతాయి. మొహమాటం కూడా అంతగా ఉండదు. ఇలా ఒకరి ఫీలింగ్స్ ఒకరు బాగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఎమోషనల్‍గా బంధం బాగా బలపడుతుంది.
దగ్గరిగానే ఉన్నా ఒకరికి ఒకరు లెటర్స్ రాసుకోవడం కూడా బాగుంటుంది. ఇది క్రియేటివ్‍గా ఉంటుంది. రాయడం వల్ల మీ ఎమోషన్లను, అభిప్రాయాలను బాగా వ్యక్తం చేయవచ్చు. మీ క్రియేటివిటీని చూపించవచ్చు. సరదా మాటలు కూడా రాయవచ్చు. ఏవైనా నేరుగా చెప్పుకోలేని విషయాలు ఉంటే రాయడం ద్వారా కమ్యూనికేట్ చేయవచ్చు. ఇలా సరదాగా ఒకరికొకరు లెటర్స్ రాసుకొని చదువుకుంటే ఎమోషనల్‍గా త్వరగా బలంగా కనెక్ట్ అవుతారు.
జీవిత భాగస్వామి చేసే చిన్న విషయాలైనా ప్రశంసించాలి. గతంలో వారు సాధించిన విజయాల గురించి చెప్పినా.. పొగడాలి. మీకోసం ఏదైనా కొత్తగా ట్రై చేసి.. అది అనుకున్నస్థాయిలో లేకపోయినా నిరాశవ్యక్తం చేయకూడదు. అలాగే, ఇద్దరి మధ్య ఏ విషయంలో అయినా అభిప్రాయాలు భిన్నంగా ఉన్నా అంగీకరించాలి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించాలి. అభ్యంతరం అనిపిస్తే స్పష్టంగా.. అర్థమయ్యేలా చెప్పాలి. ఎవరి అభిప్రాయాన్ని కూడా తేలిగ్గా కొట్టేయకూడదు. ఇలా పరస్పర గౌరవం చూపించడం వల్ల ప్రేమ అమితంగా పెరుగుతుంది.
జీవిత భాగస్వాములు ఒకరి లక్ష్యాలను ఒకరు కూడా తెలుసుకోవాలి. వాటిని సాధించేందుకు మీరు ఏదైనా చేయూతనందించేందుకు ప్రయత్నించాలి. ధ్యేయాన్ని సాధించేందుకు మద్దతుగా ఉంటాననే నమ్మకాన్ని ఇవ్వాలి. ఇది కూడా బంధం త్వరగా బలపడేందుకు తోడ్పాడునందిస్తుంది.
టాపిక్