Balineni Vs Chevireddy : పదవి కోసం జగన్ పై అభాండాలు, బహిరంగ చర్చకు సిద్ధమా?- బాలినేని వర్సెస్ చెవిరెడ్డి, సవాళ్ల పర్వం
Balineni Vs Chevireddy : విద్యుత్ ఒప్పందాల లంచం వ్యవహారం బాలినేని వర్సెస్ చెవిరెడ్డిగా మారింది. అర్ధరాత్రి నిద్ర లేపి విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు చేయమన్నారని మాజీ మంత్రి బాలినేని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం జగన్ పై అభాండాలు వేస్తున్నారని బాలినేనిపై చెవిరెడ్డి ఫైర్ అయ్యారు.
పారిశ్రామికవేత్త అదానీపై అమెరికాలో కేసు నమోదైన విషయం తెలిసింది. విద్యుత్ ఒప్పందాలకు అదానీ ప్రభుత్వాధినేతలకు లంచాలు ఇచ్చారని ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం జగన్ పేరు బయటకు వచ్చింది. వైసీపీ హయాంలో ఏపీ ప్రభుత్వం, అదానీతో విద్యుత్ ఒప్పందాలకు..వైఎస్ జగన్ కు లంచం ఇచ్చారనే వార్తలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యవహారంపై జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
తాను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కేంద్రం పరిధిలోని సెకీతో ఒప్పందం తన ప్రమేయం లేకుండా జరిగిందని బాలినేని అన్నారు. సెకీతో ఒప్పందం సమయంలో తనను అర్ధరాత్రి నిద్ర లేపి సంతకం చేయమన్నారన్నారు. ఆ తర్వాతి రోజు కేబినెట్ సమావేశం ఉండగా...అప్పటి ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి సెకీతో ఒప్పందం ఫైల్ పైన సంతకం చేయాలని కోరారన్నారు. అయితే తాను సంతకం చేయటానికి నిరాకరించానన్నారు. ఆ తర్వాతి రోజు కేబినెట్ భేటీలో సెకీ ఒప్పందాన్ని ఆమోదించారని పేర్కొన్నారు.
బాలినేనిపై చెవిరెడ్డి ఫైర్
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పందించారు. విద్యుత్ ఒప్పందాలపై బాలినేని చేసిన వ్యాఖ్యలు ఎవరూ హర్షించరన్నారు. బాలినేని మాటలు చూస్తుంటే అబద్ధాలు ఇంత గొప్పగా మాట్లాడగలరా అనిపిస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో యూనిట్ కు రూ.4.50 చొప్పున ఒప్పందాలు చేసుకుంటే.. జగన్ హయాంలో దానిని రూ.2.48 తగ్గించారన్నారు. బాలినేని జనసేనలో చేరాక...ఆ పార్టీ వాళ్ల మెప్పు కోసం ఇలా మాట్లాడి ఉండవచ్చన్నారు. వైఎస్ జగన్‌ను తిడితే జనసేనలో మెచ్చుకుంటారని బాలినేని మరింత దిగజారి మాట్లాడుతున్నారన్నారు. బాలినేని ఇంతలా దిగజారిపోతారని ఊహించలేదన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం బాలినేని ఇప్పటికే కోట్లు ఖర్చు పెట్టారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు.
సెకీ ఒప్పందంపై బాలినేని సంతకం పెట్టిన విషయం మర్చిపోయారా? అని చెవిరెడ్డి భాస్కరరెడ్డి దుయ్యబట్టారు. రెండుసార్లు విద్యుత్ ఒప్పందాలపై సంతకాలు పెట్టి, ఇప్పుడు పార్టీ మారడంతో అర్ధరాత్రి సంతకం పెట్టామన్నారని చెప్పటం బాధాకరమన్నారు. ఏ కుటుంబం అయితే బాలినేనికి రాజకీయంగా అవకాశం కల్పించేందో వారిపైనే విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్ పై అభాండాలు వేసి లబ్ధి పొందాలనుకుంటే అది రివర్స్ అవుతుందన్నారు.
బాలినేని కౌంటర్
చెవిరెడ్డి భాస్కరరెడ్డి విమర్శలపై జనసేన నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు. తాను విలువలతో రాజకీయాలు చేసే వ్యక్తినన్నారు. వైఎస్‌ఆర్ తనకు రాజకీయ భిక్ష పెట్టారని, తాను జనసేనలో చేరినప్పుడే చెప్పానన్నారు. హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన...చెవిరెడ్డి విమర్శలకు ఘాటుగా స్పందించారు. వైఎస్‌ఆర్ పై అభిమానంతో ఆయన మరణం తర్వాత మంత్రి, ఎమ్మెల్యే పదవులను వదులుకొని వైసీపీలో చేరానన్నారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబమంటే జగన్ ఒక్కరేనా? విజయమ్మ, షర్మిల కాదా అని బాలినేని ప్రశ్నించారు. విజయమ్మ, షర్మిలపై అసభ్య పోస్టులు పెడితే ఆ కుటుంబం కానట్లు పట్టించుకోరా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలను తిట్టిన వాళ్లకే టికెట్లు ఇస్తామనే సంప్రదాయం ఎవరు కొనసాగించారో అందరికీ తెలుసని చెవిరెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
చెవిరెడ్డికి బాలినేని సవాల్
"అదానీతో విద్యుత్ ఒప్పందాల్లో వైఎస్ జగన్ రూ.1,750 కోట్ల లంచం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో నేను విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నందున ఏం జరిగిందో చెప్పాను. సెకీతో ఒప్పందం నాకు ఏమాత్రం సంబంధం లేదు. సీఎండీ ఫైల్ నా వద్దకు రానేలేదు. చిత్తూరు జిల్లా అధ్యక్షుడికి ఒంగోలులో టికెట్ ఇస్తారా? అలా చేయడం నాకు నచ్చలేదని చెప్పా. వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చానో మొత్తం చెబుతాను. ధైర్యం ఉంటే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బహిరంగ చర్చకు రావాలి" అని బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు.
సంబంధిత కథనం