Personal Loan tips : వడ్డీ తక్కువే- కానీ 'ఛార్జీల' మోత ఎక్కువ! పర్సనల్ లోన్ విషయంలో ఇవి తెలియకపోతే మీకే నష్టం!
Personal Loan tips : పర్సనల్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే వడ్డీ రేట్ల కన్నా ముందు, మీరు వివిధ సంస్థలు వేసే ‘ఛార్జీల’ వివరాలను తెలుసుకోవాలి. లేకపోతే మీకే నష్టం!
డబ్బు అవసరం ఉన్నప్పుడు చాలా మంది పర్సనల్ లోన్ తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. దీని కోసం తక్కువ వడ్డీకి పర్సనల్ లోన్ ఇచ్చే సంస్థ కోసం చూస్తుంటారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ, ఈ మధ్య కాలంలో పోటీ కారణంగా దాదాపు అన్ని సంస్థలు ఇంచుమించు ఒకే విధంగా వడ్డీని వసూలు చేస్తున్నాయి. అందుకే ‘ఛార్జీల’ పేరుతో వివిధ రూపాల్లో కస్టమర్స్ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ ఛార్జీలు ఒక్కో కంపెనీకి ఒక్కో విధంగా ఉంటాయి. ఎందులో తక్కువ ఉందో చూసుకోవడం మన బాధ్యత! ఇవి తెలియకపోతే మనకే నష్టం జరుగుతుంది! అందుకే.. పర్సనల్ లోన్ తీసుకునే ముందు దాని చుట్టూ ఉండే ఛార్జీలు, ఫీజులు వంటి పూర్తి లిస్ట్‌ని ఇక్కడ తెలుసుకోండి! ఈ సమాచారం మీకు ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.
పర్సనల్ లోన్‌పై వేసే ఛార్జీలు ఇలా..
1. ప్రాసెసింగ్ ఫీజు: ప్రాసెసింగ్ ఫీజు అనేది మీ రుణ దరఖాస్తును హ్యాండిల్ చేసేందుకు రుణదాత వసూలు చేసే ఛార్జీలు. సాధారణంగా, ఈ రుసుములు రుణం ఇచ్చే మొత్తంలో 0.5% నుంచి 2.5% మధ్య ఉంటాయి. ఈ రుసుము సాధారణంగా రుణం మంజూరు చేసిన తేదీ నాటికి ముందుగా తీసుకుంటారు.
2. వెరిఫికేషన్ ఛార్జీలు: రుణదాతలు సాధారణంగా మీ పర్సనల్ లోన్ విడుదల చేయడానికి ముందు మీ మొత్తం సమాచారం, క్రెడిట్ స్కోరు, రీపేమెంట్ హిస్టరీతో పాటు అనేక వివరాలను సేకరించేందుకు థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కంపెనీలతో కనెక్ట్ అవుతాయి. ఈ ప్రక్రియ కోసం అయిన ఖర్చును వెరిఫికేషన్ ఫీజు ద్వారా మనకి వేస్తారు.
3. జీఎస్టీ : ఒక పర్సనల్ లోన్ అప్లికేషన్, రీపేమెంట్ ప్రాసెస్ల్లో ఉండే చాలా సేవలపై జీఎస్టీ ఉంటుంది. ఈ రుసుమును తప్పనిసరిగా వసూలు చేస్తారు. రుణ వ్యయాన్ని పెంచడం మినహా వేరే మార్గం లేదు!
4. డిఫాల్ట్‌లపై పెనాల్టీ: ఈఎంఐ చెల్లింపు చేయడంలో విఫలమైన వ్యక్తి కంపెనీ పెనాల్టీ ఎదుర్కోవలసి ఉంటుంది. అదే పునరావృతమైతే ఈ జరిమానాలు పెరుగుతాయి. పర్సనల్ లోన్ తీసుకునేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సకాలంలో డబ్బులు చెల్లించాలి.
5. ముందస్తు చెల్లింపు లేదా జప్తు పెనాల్టీ: చాలా సందర్భాల్లో, మీరు మీ రుణాన్ని గడువుకు ముందే చెల్లించాలని నిర్ణయించుకుంటే, లోన్ ఇచ్చే సంస్థ.. మీ నుంచి ప్రీ-పేమెంట్ ఛార్జీలు వసూలు చేస్తుంది. ఈ రుసుము రుణదాతను వడ్డీ ఆదాయం తప్పిపోయిన సందర్భంలో నష్టపరిహారం పొందే స్థితిలో ఉంచుతుంది.
6. డూప్లికేట్ స్టేట్మెంట్ ఫీజులు: లోన్ స్టేట్ మెంట్లు అదనపు కాపీలు అవసరమైనప్పుడల్లా రుణదాతలు అటువంటి పత్రాలను తయారు చేయడానికి చిన్న రుసుమును వసూలు చేయవచ్చు. ఎంత శాతం అనేది సంస్థను బట్టి మారుతూ ఉంటుంది.
7. డాక్యుమెంటేషన్ ఛార్జీలు: కొంతమంది రుణదాతలు వడ్డీ రూపంలో ఛార్జీలు అడగనప్పటికీ, రుణగ్రహీత సంతకం చేసే రుణ పత్రాలను తయారు చేయడానికి, ప్రాసెస్ చేయడానికి అయ్యే ఖర్చును.. ఫీజుల రూపంలో అడగవచ్చు. చాలా సందర్భాలలో చిన్నవిగా ఉండే ఈ రుసుములు మొత్తం రుణ వ్యయాన్ని పెంచుతాయి.
సంబంధిత కథనం