IND vs AUS 1st Test Live: పెర్త్ టెస్టులో గెలుపు ముంగిట భారత్.. సొంతగడ్డపై ఓటమికి ఎదురీదుతున్న ఆస్ట్రేలియా
IND vs AUS 1st Test Day 4 Highlights: పెర్త్ టెస్టులో ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసేసిన భారత్ జట్టు.. విజయాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం మిచెల్ మార్ష్ క్రీజులో పోరాడుతున్నా.. ఆస్ట్రేలియా గెలవడం అసాధ్యంగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గెలుపు ముంగిట భారత్ ఉంది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో.. 534 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా టీమ్ సోమవారం ఉదయం నుంచి ఓటమికి ఎదురీదుతోంది. భారత్ జట్టు విజయానికి 4 వికెట్లు మాత్రమే అవసరంకాగా.. సొంతగడ్డపై ఓటమి ఖాయమైనా పరువు దక్కించుకునేందుకు ఆస్ట్రేలియాకి తిప్పలు తప్పడం లేదు.
ట్రావిస్ హెడ్ ఒంటరి పోరాటం
మ్యాచ్‌లో నాలుగో రోజైన సోమవారం 12/3తో ఛేదనను కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో ట్రావిస్ హెడ్ (89: 101 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఓపెనర్లు నాథన్ (0), ఉస్మాన్ ఖవాజా (4), నైట్ వాచ్‌మెన్ పాట్ కమిన్స్ (2), మార్కస్ లబుషేన్ (3), స్టీవ్‌స్మిత్ (17) విఫలమైన పిచ్‌పై ట్రావిస్ హెడ్ అసాధారణ పోరాట పటమని కనబర్చాడు.
మిచెల్ మార్ష్ (39 బ్యాటింగ్: 61 బంతుల్లో 2x4, 2x6)తో కలిసి ఆరో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ట్రావిస్ హెడ్.. టీమ్ స్కోరు 161 వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రా భారత్ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. ప్రస్తుతం మార్ష్‌తో పాటు క్రీజులో అలెక్స్ క్యారీ (1 బ్యాటింగ్) ఉన్నాడు.
ఆస్ట్రేలియా గెలుపు అసాధ్యం
ఆస్ట్రేలియా 176/6తో కొనసాగుతుండగా.. ఆ జట్టు విజయానికి ఇంకా 358 పరుగులు చేయాల్సి ఉంది. పిచ్ బౌలర్లకి అనుకూలిస్తున్న ఈ తరుణంలో.. టాప్ ఆర్డర్ మొత్తం ఇప్పటికే పెవిలియన్ చేరిపోయి ఉండటంతో ఆస్ట్రేలియా ఓటమి లాంఛనమే.
శుక్రవారం నుంచి జరుగుతున్న ఈ పెర్త్ టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే ఆలౌటవడంతో.. భారత్ జట్టుకి 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను 487/6తో డిక్లేర్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని 534 టార్గెట్‌ను కంగారూల ముందు నిలిపింది.
ఫైనల్ చేరాలంటే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టులు జరగనున్నాయి. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి చేరాలంటే.. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్ జట్టు ఓడిపోకూడదు. గత రెండు పర్యాయాలూ.. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ జట్టు గెలిచిన విషయం తెలిసిందే.