ENG vs AUS 1st T20: ఇంగ్లాండ్ బౌలర్‌కి చుక్కలు చూపించిన ట్రావిస్ హెడ్.. ఒకే ఓవర్‌లో 4, 4, 6, 6, 6, 4
Australia vs England 1st T20: ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ శామ్ కరన్‌కి అతని సొంతగడ్డపైనే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ చుక్కలు చూపించేశాడు. టీ20లో ఒకే ఓవర్‌లో వరుసగా 4, 4, 6, 6, 6, 4 బాదేశాడు. కానీ ఆస్ట్రేలియా మరో 3 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌లో ఆలౌటైంది.
Travis Head 30 runs in an over: ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ విధ్వంసకరరీతిలో చెలరేగిపోయాడు. సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో ట్రావిస్ హెడ్.. శామ్ కరన్ వేసిన ఓవర్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 30 పరుగులు రాబట్టాడు.
వాస్తవానికి మ్యాచ్‌లో తొలి బౌండరీ కొట్టడానికి ఏడు బంతులు తీసుకున్న ట్రావిస్ హెడ్.. ఆ బౌండరీ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. మూడో ఓవర్ వేసిన ఆర్చర్ బౌలింగ్‌లో 4 బంతుల వ్యవధి మూడు బౌండరీలు కొట్టి 10 బంతుల్లో 15 పరుగులు చేశాడు. ఈ దశలో బౌలింగ్‌కి వచ్చిన శామ్ కరన్‌కి ట్రావిస్ హెడ్ చుక్కలు చూపించేశాడు.
ఇన్నింగ్స్ 5వ ఓవర్‌లో ఎడమ చేతివాటం పేసర్ శామ్ కరన్ బౌలింగ్‌కి రాగా.. ట్రావిస్ హెడ్ వరుసగా 4, 4, 6, 6, 6, 4 బాదేసి 30 పరుగులు రాబట్టాడు. బాదుడు నుంచి తప్పించుకోవడానికి శామ్ కరన్ ఆ ఓవర్‌లో చేయని ప్రయత్నం లేదు. లైన్ అండ్ లెంగ్త్ వరుసగా మార్చినా ప్రయోజనం లేకపోయింది. ఎంతలా అంటే.. తొలుత 12 బంతుల్లో 15 పరుగులే చేసిన ట్రావిస్ హెడ్.. ఆ తర్వాత 7 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోగలిగాడు.
గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో హిట్టింగ్ గురించి ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ ‘‘ప్రతిసారీ క్రీజు వెలుపలికి వెళ్లి కొట్టడాన్ని నేను ఇష్టపడతాను’’ అని చెప్పిన విషయం తెలిసిందే. ఆ ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా విజయంలో హెడ్ క్రియాశీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ కేవలం కేవలం 19 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అర్ధసెంచరీ (మొత్తం 59 పరుగులు) సాధించి ఆసీస్‌కు తిరుగులేని ఆరంభాన్ని అందించాడు. మాథ్యూ షార్ట్ (26 బంతుల్లో 41 పరుగులు), హెడ్‌ల మధ్య 86 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం లభించినా.. ఆస్ట్రేలియా టీమ్ మాత్రం 19.3 ఓవర్లలో 179 పరుగులకి ఆలౌటైంది. ఇంగ్లాండ్ బౌలర్లలో లివింగ్‌స్టోన్ మూడు, జోప్రా ఆర్చర్, షకీబ్ మహ్మద్ రెండేసి వికెట్లు తీశారు.
180 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ టీమ్ 151 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో లియామ్ లివింగ్‌స్టోన్ 27 బంతుల్లో 37 పరుగులు చేయడం మినహా.. ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. దాంతో ఇంగ్లాండ్ టీమ్ 19.2 ఓవర్లలో 151 పరుగులకి కుప్పకూలిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్ మూడు వికెట్లు, జోష్ హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య మొత్తం మూడు టీ20ల సిరీస్ జరుగుతుండగా.. తొలి టీ20లో 28 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం జరగనుంది. ఈ టీ20 సిరీస్ తర్వాత ఐదు వన్డేల సిరీస్ కూడా ఈ రెండు టీమ్స్ మధ్య జరగనుంది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ గాయం కారణంగా ఈ టీ20 సిరీస్‌కి దూరంగా ఉన్నాడు. వన్డే సిరీస్ టైమ్‌కి అతను అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.