Warangal : భూకైలాస్.. ఎకరం రూ.50 కోట్లు, ఈ ప్రాంతాల్లో భూములున్న వారికి డబ్బులే డబ్బులు!
Warangal : వరంగల్ జిల్లాలో మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తబ్దుగా ఉంది. భూ క్రయవిక్రయాలు పెద్దగా లేవు. కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదు. కానీ.. సడెన్‌గా వరంగల్ చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలోచ్చాయి. పలు చోట్ల ఎకరం రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు పలుకుతోంది.
వరంగల్ నగరం చుట్టుపక్కల భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గజానికి ఏకంగా రూ.5 నుంచి రూ.10 వేలు పెంచేశారు. నగర శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా మామునూరు ఎయిర్‌పోర్ట్ ఏరియాలో ఏకరం రూ.50 కోట్ల కంటే ఎక్కువే పలుకుతోంది. హైదరాబాద్- వరంగల్ హైవే చుట్టుపక్కల కూడా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇన్నాళ్లు డల్‌గా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవడంతో.. ప్రముఖ కంపెనీలు వరంగల్ వైపు చూస్తున్నాయి.
కారణం ఏంటీ..
వరంగల్‌ను తెలంగాణ రెండో రాజధానిగా చేస్తామని రేవంత్ సర్కారు చెబుతోంది. కేవలం చెప్పడమే కాకుండా వేల కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో వరంగల్ నగర అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్‌లో మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తున్నారు. దీంతో నగరం వేగంగా అభివృద్ధి చెందబోతోందనే నమ్మకం కలుగుతోంది. ఈ నేపథ్యంలో.. భూముల ధరలు పెరిగాయి.
మరోవైపు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే డివిజన్ కేంద్రాన్ని ప్రకటించడంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఇదే సమయంలో మామునూరు ఎయిర్ పోర్ట్ పునః ప్రారంభం, ఔటర్ రింగ్ రోడ్డు భూ సేకరణకు నిధులు ఇవ్వడం, ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి నిధుల మంజూరు చేయడం, వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం తెలపడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో నమమ్కం పెరిగింది. పలు రోడ్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కూడా ధరలు భారీగా పెరుగుతున్నాయి.
20 కిలో మీటర్ల మేర..
కేవలం నగరంలోనే కాదు.. వరంగల్‌కు 20 కిలోమీటర్ల దూరంలో భూములకు ధరలు పెరిగాయి. వరంగల్- నర్సంపేట రహదారిలో మచ్చాపూర్ వరకు, వరంగల్- ములుగు రోడ్డులో ఆత్మకూరు వరకు ఖమ్మం రోడ్డులో వర్దన్నపేట వరకు, కరీంనగర్ రోడ్డులో ఎల్కతుర్తి వరకు భూముల ధరలు పెరుగుతున్నాయి. ధరలు ఒక్కసారిగా పెరగడంతో.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యూచర్ సిటీ..
వరంగల్ నగరం కచ్చితంగా ఫ్యూచర్ సిటీ అవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఏ నగరానికి అయినా ఓ స్థాయి వరకే ప్రభుత్వాల ప్రోత్సాహం, మద్దతు అవసరం ఉంటుందని.. ఆ తర్వాత అభివృద్ధిని అవే నగరాలు సంపాదించుకుంటాయని అంటున్నారు. ప్రస్తుతం వరంగల్‌కు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తోందని.. భవిష్యత్తులో ఏ అవసరం లేకున్నా నగరం అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు.