Dy CM Bhatti Vikramarka : దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ, ఖమ్మంలో "లోగో" ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి
Dy CM Bhatti Vikramarka : మహిళలు పాడి పరిశ్రమలపై దృష్టి సారించి ఆదాయం సంపాదించేలా స్వశక్తి మహిళా సంఘాలచే పాడి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మధిరలో ఇందిరా మహిళా డెయిరీ లోగోను ఆవిష్కరించారు.
దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ విజయం సాధించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన మధిర మండల కేంద్రం, సిరిపురంలో పర్యటించారు. సిరిపురంలో రూ.26 కోట్ల అంచనా వ్యయంతో సిరిపురం నుంచి నెమలి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ, పటిష్ట పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం సిరిపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పాతబడి శిథిలావస్థలో ఉన్న కళాశాల గదులను, లైబ్రరీ, ప్రిన్సిపాల్ రూంలలోకి వెళ్లి పరిశీలించారు. ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకు ఫోన్ చేసి మాట్లాడి వెంటనే కళాశాలను సందర్శించి కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. మధిర రెడ్డి గార్డెన్స్ లో ఇందిరా మహిళా డెయిరీ లోగో ఆవిష్కరించి మహిళా సంఘాల సభ్యులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. మధిర అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి మహిళల చేత పాల వ్యాపారం చేయించేందుకు ఇందిరా మహిళా డెయిరీ సంస్థను ఏర్పాటు చేయాలనే తన ఆకాంక్ష నేడు నెరవేరుతుందని అన్నారు.
గతంలో ఆహార ధాన్యాలు దొరకకపోవడం వల్ల దేశంలో కోట్ల మంది ప్రజలు ఆకలితో మరణించారని, దీనిని గమనించిన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించారని గుర్తు చేశారు. ఆయన వేసిన పునాదులతో అనేక నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించు కున్నామని, దీని వల్ల నేడు మనకు సరిపోయే ఆహార ధాన్యాలే కాకుండా ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి మన దేశం ఎదిగిందని తెలిపారు. నాగార్జున సాగర్ బహుళ సార్థక ప్రాజెక్టు ద్వారా మధిర నియోజక వర్గం పరిసర ప్రాంతాల్లో ఆయకట్టు నీరు రావడం వల్ల పంటలు పండిస్తూ, పిల్లలను చదివిస్తున్నారని అన్నారు. వ్యవసాయ ఆదాయానికి తోడు పాడి రైతుల ఆదాయం జత చేస్తే కుటుంబాలు మరింత నిలదొక్కుకుంటాయనే ఆలోచనతో ఇందిరా మహిళా డెయిరీని 2013 లో రూపకల్పన చేయడం జరిగిందని పేర్కొన్నారు. మధిర ప్రాంతం పరిధిలో వ్యవసాయాధారిత జీవనం తప్ప మరో దారి లేదని, దీనిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నాగార్జున సాగర్ తో పాటు కట్టలేరుపై, మున్నేరుపై ఆనకట్ట నిర్మించుకుని సాధ్యమైనంత వరకు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకున్నామని, డ్రిప్ ఇరిగేషన్ కూడా తయారు చేసుకున్నామని అన్నారు.
పాడి పరిశ్రమపై దృష్టి..
మహిళలు పాడి పరిశ్రమలపై దృష్టి సారించి ఆదాయం సంపాదించేలా స్వశక్తి మహిళా సంఘాలచే పాడి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. కుటుంబంలో తండ్రి వ్యవసాయం ద్వారా ఆదాయం సమకూరిస్తే, తల్లి పాడి పశువుల ద్వారా కొంత ఆదాయం సంపాదించి కుటుంబం మెరుగైన జీవనం సాగించేందుకు సహాయపడుతుందని, ఇటువంటి అనేక ఉదాహరణలు మనందరికీ తెలుసని వివరించారు. కుటుంబం దగ్గర డబ్బులు ఉంటే పిల్లలను మంచి చదువులు చదివిస్తారని, చదువుకున్న పిల్లలు కుటుంబాల స్థితిగతులను పూర్తిగా మారుస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మహిళలకే పాడి పశువులు అందించి, పాల సేకరణ నుంచి ప్యాకింగ్, బై ప్రోడక్ట్ (వెన్నె, మజ్జిగ, పెరుగు, నెయ్యి, స్వీట్స్) ఉత్పత్తి, మార్కెటింగ్ చేసి లాభాలు పొంది మహిళలు పంచుకోవాలనే కలతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు కోసం 9.5 ఎకరాల స్థలం సేకరించి భూమి పూజ కూడా చేశామని, ప్రత్యేక రాష్ట్ర విభజన ఉద్యమాలు, గత ప్రభుత్వం మహిళల పట్ల ఆలోచన లేకుండా ఈ డెయిరీని పక్కన పడేసిందని అన్నారు.
మహిళలు ఇచ్చిన డిపాజిట్ సొమ్ము ఎవరు కొట్టేయకుండా జాగ్రత్తగా కాపు కాయడం జరిగిందన్నారు. నేడు దాదాపు 40 లక్షల రూపాయలు అందుబాటులో ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే మొదటి సమావేశం ఇందిరా మహిళా డెయిరీ పైనే నిర్వహించామని అన్నారు. 20 వేల మహిళలు ఇందిరా మహిళా డెయిరీలో సభ్యులుగా ఉన్నారని, వీరికి తలా రెండు పాడి పశువులు అందిస్తామని, దీని ద్వారా రోజూ దాదాపు 2 లక్షల 40 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుందన్నారు. నెలకు 25 కోట్లకు పైగా మహిళలు సంపాదించే అవకాశం ఉందని అన్నారు. పాలు మాత్రమే కాకుండా మజ్జిగ, నెయ్యి, వెన్న, స్వీట్స్ అమ్మకాలు కూడా కలిపితే సంవత్సరానికి ఇందిరా మహిళా డెయిరీ టర్నోవర్ 500 కోట్లు దాటుతుందని అన్నారు. దేశం మొత్తం ఇందిర మహిళా డెయిరీ వైపు చూసేలా అభివృద్ధి సాధించాలని, ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డ చదువుకోవాలని, కుటుంబ అవసరాల కోసం ఎవరి దిక్కు చూసే పరిస్థితి రావద్దని పేర్కొన్నారు. ఇతరులకు సాయం చేసే దిశగా కుటుంబాలు ఎదగాలని, ఆ దిశగా ఇందిరా మహిళా డైరీ విజయం సాధించాలని ఉప ముఖ్యమంత్రి కోరారు.
గత ప్రభుత్వం అప్పుల భారం మోపింది
ప్రజల ఆశీర్వాదంతో గత ప్రభుత్వం పెట్టిన ఆర్థిక ఇబ్బందులను సైతం అధిగమిస్తున్నామని, గతంలో చేసిన అప్పుల భారం ప్రస్తుత ప్రభుత్వంపై పడిందని, ఈ భారం అధికంగా ఉన్నప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు పోతున్నామని భట్టి పేర్కొన్నారు. దసరా నాడు బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ ను ప్రారంభించామని, దీపావళి సందర్భంగా ఇందిరా మహిళా డెయిరీ లోగో ఆవిష్కరణ చేశామని తెలిపారు. దేశంలో మరే డెయిరీ సాధించని లక్ష్యాలను ఇందిరా మహిళా డెయిరీ సాధించిందన్నారు. అమూల్ డైరీ, విజయ డెయిరీ, హెరిటేజ్ డెయిరీలను మించి మనం వ్యాపారం చేయాలని, ఆ రోజు కూడా వస్తుందని అన్నారు. ఇందిరా మహిళా డెయిరీలో పాల ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మహిళలే ఉండేలా కార్యాచరణ తయారు చేశామని అన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశామని, 5 మండలాల్లోని నిరుద్యోగ యువతకు పశువుల దాణా తయారీ, ప్యాకింగ్ సరఫరా యూనిట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. పశువులకు అవసరమైన దాన, పచ్చి గడ్డి ఇంటి దగ్గరికి వచ్చే విధంగా ఆలోచన చేస్తున్నామని అన్నారు. పశువుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.
మూడు నెలల్లోనే గ్రౌండింగ్..
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ తాను కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉప ముఖ్యమంత్రి ఇందిరా మహిళా డెయిరీ గురించే మొదట మాట్లాడారని, వారి నిరంతర పర్యవేక్షణ ఫలితంగా 3 నెలల కాలంలో గ్రౌండ్ చేయడం జరిగిందని అన్నారు. ఇంటిలో పాడి పశువుల కారణంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడం, మన పిల్లలను మెరుగైన చదువులు చదివించడం, మెరుగైన జీవనం సాగించడం సాధ్యమవుతుందని అన్నారు. మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని 5 మండలాల్లోని అన్ని గ్రామాలలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటున్నామని, అవసరమైన యంత్రాలు ప్రొక్యూర్ చేస్తున్నామని అన్నారు. ప్రతి పాల సేకరణ కేంద్రం నుంచి మండల కేంద్రంలో ఉన్న బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ కు పాలు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రతి మండల కేంద్రంలో బల్క్ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని, అవి పూర్తయిన తర్వాత ప్రతి మండలం నుంచి దాదాపు 5 వేల లీటర్ల పాల సేకరణ జరుగుతుందని అన్నారు.
48 గంటల వ్యవధిలో పాడి రైతుల ఖాతాలలో నగదు బదిలీ జరిగేలా కార్యాచరణ తయారు చేస్తున్నామని అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు భవిష్యత్తులో ఇందిరా మహిళా డెయిరీ బ్రాండ్ పేరుతో పాలు విక్రయించేందుకు అవసరమైన ప్లాంట్ నిర్మాణానికి స్థలం ఎంపిక ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం మండల స్థాయిలో చేయాల్సిన ఏర్పాట్లను కలెక్టర్ గా తాను పర్యవేక్షిస్తున్నారని, త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చి మహిళ డెయిరికి అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తారని అన్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.
సంబంధిత కథనం