Samuthirakani: 'మిస్టర్ మాణిక్యం'గా పవన్ కల్యాణ్ డైరెక్టర్.. మానవతా విలువలకు పట్టం కట్టేలా సముద్రఖని మూవీ!
Samuthirakani Mr Manikyam Release Date: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన బ్రో మూవీ డైరెక్టర్ సముద్రఖని అలరించడానికి సిద్ధంగా ఉన్న మరో సినిమా మిస్టర్ మాణిక్యం. తాజాగా మిస్టర్ మాణిక్యం మూవీ రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ విడుదల చేశారు.
Samuthirakani Mr Manikyam Release Date: దర్శకుడిగా, నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సముద్రఖని మరో సినిమాతో అలరించేందుకు రెడీగా ఉన్నారు. నటుడిగా అన్ని భాషల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నా సముద్రఖని 'అల వైకుంఠపురములో', 'క్రాక్', 'హనుమాన్' వంటి సినిమాలతో పాపులర్ అయ్యారు.
నూరు శాతం న్యాయం చేస్తూ
ప్రతి సినిమాలోనూ తాను ధరించిన పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేస్తూ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు సముద్రఖని. ఇప్పుడు ‘మిస్టర్ మాణిక్యం’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సముద్రఖని ప్రధాన పాత్రలో నంద పెరియసామి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జీపీ రేఖా రవి కుమార్, చింతా గోపాలకృష్ణా రెడ్డి, రాజా సెంథిల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
నిర్మాత చేతులమీదుగా
'సీతారామం' ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. డిసెంబర్ 28న మిస్టర్ మాణిక్యం చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నారంగ్ చేతుల మీదుగా మిస్టర్ మాణిక్యం సినిమా ఫస్ట్ లుక్ అండ్ రిలీజ్ డేట్ పోస్టర్ ఆదివారం నాడు (నవంబర్ 24) జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు.
మంచి స్నేహితుడు
ఈ సందర్భంగా సునీల్ నారంగ్ యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. "నిర్మాతల్లో ఒకరైన రవి నాకు ఎంతోకాలం నుంచి మంచి స్నేహితుడు. అతను నిర్మించిన మొదటి సినిమా ‘మిస్టర్ మాణిక్యం’ ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ అన్నారు.
మానవతా విలువలకు పట్టం కట్టేలా
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. "నిర్మాతలు రవి, చింతా గోపాలకృష్ణారెడ్డి, రాజా సెంథిల్ నాకు సన్నిహితులు. శ్రేయోభిలాషులు. కంటెంట్‌ని నమ్మి నిర్మించిన సినిమా ఇది. మానవతా విలువలకు పట్టం కట్టే విధంగా ఈ సినిమా కథాంశం ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని, నిర్మాతలకు మంచి ఖ్యాతితోపాటు డబ్బు కూడా సంపాదించి ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని కోరారు.
మనుసులను హత్తుకునే అంశాలు
"విమానం తర్వాత నేను ప్రధానపాత్రలో నటించిన సినిమా ఇది. ‘విమానం’ సినిమా నటుడిగా నాకు మంచి పేరు తెచ్చింది. ‘మిస్టర్ మాణిక్యం’ సినిమా అంతకు మించిన మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది. మానవతా విలువలు ప్రధానాంశంగా రూపొందిన సినిమా ఇది. ప్రతి ఒక్కరి మనసులను హత్తుకునే అనేక అంశాలు ‘మిస్టర్ మాణిక్యం’లో ఉన్నాయి" అని సముద్రఖని చెప్పారు.
క్లీన్ కంటెంట్ మూవీ
"కుటుంబంతో సహా థియేటర్లకు వచ్చి చూసేంత క్లీన్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. ఈ విషయంలో ప్రేక్షకులకు నా తరఫున పూర్తి భరోసా ఇస్తున్నాను. కుటుంబ సమేతంగా మా సినిమా చూడటానికి రండి" అని సముద్రఖని తెలిపారు.