Best electric car : ఈ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు రేంజ్ పెరిగింది.. ఇంకా చాలా అప్డేట్స్ కూడా!
కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ తాజాగా ప్రదర్శించింది. ఈ 2025 కియా ఈవీ6లో చాలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం ఈవీ6 అప్డేటెడ్ వర్షెన్ లాంచ్ అయ్యింది! 2025 కియా ఈవీ6ని లాస్ ఏంజిల్స్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రదర్శించారు. ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణ కొరియాలో ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. కియా ఈవీ6 2025 అప్డేట్ డిజైన్, టెక్నాలజీ, పర్ఫార్మెన్స్ పరంగా ప్రస్తుత మోడల్ కంటే చాలా అప్గ్రేడ్స్ని తీసుకోస్తుంది. ఈ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు త్వరలో భారతదేశంలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది! ఇటీవల భారతదేశంలో ఈవీ కోసం డిజైన్ పేటెంట్‌ని దాఖలు చేయడం ఇందుకు కారణం.
2025 కియా ఈవీ6: డిజైన్..
కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్‌లో అత్యంత ముఖ్యమైన మార్పులు.. ముందు భాగంలో కనిపిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారులో సాంప్రదాయ హెడ్లైట్లు.. పదునైన ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్ ల్యాంప్లతో భర్తీ చేసింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ. ఇవి ఈవీ3, ఈవీ4 కాన్సెప్ట్‌ల నుంచి ప్రేరణ పొందాయి. ఫ్రంట్ ఫాసియాని పూర్తిగా మర్చేశారనే చెప్పుకోవాలి! ఇందులో బంపర్, లోయర్ గ్రిల్‌కు మార్పులు ఉన్నాయి. ఇది క్రాసోవర్‌కు మరింత సమకాలీన- దృఢమైన రూపాన్ని అందిస్తుంది.
19-ఇంచ్, 20-ఇంచ్ పరిమాణాల్లో అందించే సొగసైన కొత్త నలుపు, వెండి చక్రాలను జోడించడం మినహా, కియా ఈవీ6 మిగిలిన బాహ్య భాగం ఎక్కువగా దాని అసలు రూపాన్ని నిలుపుకుంటుంది. వెనుక భాగంలో ఐకానిక్ సింగిల్ ఎల్ఈడీ లైట్ బార్ ఉంది. ఇది వాహనం వెడల్పు అంతటా విస్తరించి ఉంది. ఇది ఈవీ6 సిగ్నేచర్ డిజైన్ ఫీచర్‌ని సంరక్షిస్తుంది.
2025 కియా ఈవీ6: ఇంటీరియర్..
2025 కియా ఈవీ6 ఇంటీరియర్ అనేక చెప్పుకోదగిన మార్పులనే అందిస్తోంది. క్యాబిన్ మధ్యలో కొత్తగా రూపొందించిన కర్వ్డ్ పనోరమిక్ డిస్ప్లే ఉంది. ఇది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో నిరాటంకంగా మిళితం చేస్తుంది. కియా టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను రీడిజైన్ చేసింది. ఫింగర్‌ప్రింట్ రికగ్నిషన్ ఫీచర్‌ని చేర్చింది. అధీకృత డ్రైవర్లు సాంప్రదాయ కీ లేకుండా వాహనాన్ని ప్రారంభించడానికి అనుమతిస్తుంది. అదనంగా, కియా ఈవీ6 ఎలక్ట్రిక్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో వైర్లెస్ కంపాటబిలిటీని అందిస్తుంది.
2025 కియా ఈవీ6కు ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ జోడించింది. ప్రారంభంలో నావిగేషన్‌కు మాత్రమే పరిమితమైన ఈ నవీకరణలు ఇప్పుడు గణనీయమైన ఎలక్ట్రానిక్ నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉన్నాయి! తద్వారా వాహనం జీవితకాలాన్ని మెరుగుపరుస్తాయి. ఇంటీరియర్ మెరుగుదలల్లో డిజిటల్ రేర్-వ్యూ మిర్రర్, అప్‌గ్రేడెడ్ హెడ్-అప్ డిస్ప్లే, ఆగ్మెంటెడ్ రియాలిటీ నావిగేషన్ సిస్టమ్ ఉన్నాయి.
2025 కియా ఈవీ6: స్పెసిఫికేషన్లు..
2025 కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కారులో హ్యుందాయ్ మోటార్ గ్రూప్ అధునాతన 84 కిలోవాట్ల బ్యాటరీ ఉంది. ఇది మునుపటి 77.4 కిలోవాట్ల యూనిట్‌ని భర్తీ చేస్తుంది. ఫలితంగా లేటెస్ట్ కియా ఈవీ6 రేంజ్ 494 కిలోమీటర్లకు పెరిగింది. గతంలో ఇది 475 కిలోమీటర్లుగా ఉంది. కొత్త బ్యాటరీ 350 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇది కేవలం 18 నిమిషాల్లో 10-80 శాతం ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది.
స్టాండర్డ్ రేర్ వీల్ డ్రైవ్ మోడళ్లు 225 బీహెచ్పీ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్‌ని జనరేట్ చేస్తాయి. డ్యూయెల్ మోటార్ వేరియంట్లు 320 బీహెచ్పీ పవర్, 605ఎన్ఎమ్ టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి.
సంబంధిత కథనం