AP Cable War: విజయవాడలో పతాక స్థాయికి చేరిన కేబుల్ వార్...గొడవలు పోలీస్‌ కేసులు, కోర్టు పిటిషన్లు-cable war reaches a fever pitch in vijayawada clashes police cases court petitions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cable War: విజయవాడలో పతాక స్థాయికి చేరిన కేబుల్ వార్...గొడవలు పోలీస్‌ కేసులు, కోర్టు పిటిషన్లు

AP Cable War: విజయవాడలో పతాక స్థాయికి చేరిన కేబుల్ వార్...గొడవలు పోలీస్‌ కేసులు, కోర్టు పిటిషన్లు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 25, 2024 09:53 AM IST

AP Cable War: విజయవాడలో మరోసారి కేబుల్ వార్‌ పతాక స్థాయికి చేరింది.కేబుల్ వైర్లు కత్తిరించడం, బెదిరింపులు, దాడులతో పోలీస్‌‌కేసులు,కోర్టు పిటిషన్లు దాఖలవుతున్నాయి. కేబుల్‌ వ్యాపారం కాసులు కురిపిస్తుండటంతో దానిని దక్కించుకునే క్రమంలో ఆధిపత్యపోరు మొదలైంది.ఇది ఎక్కడకు దారి తీస్తుందోననే ఆందోళన నెలకొంది.

విజయవాడలో కేబుల్ వార్
విజయవాడలో కేబుల్ వార్

AP Cable War: ఏపీలో కేబుల్‌ వార్‌ నడుస్తోంది.కేబుల్ వ్యాపారంలో గుత్తాధిపత్యం కొనసాగిస్తున్న సంస్థలు కూడా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కేబుల్ వ్యాపారాన్ని దక్కించుకునేందుకు కొందరు పావులు కదిపారు. కోట్లు కురిపించే కేబుల్ వ్యాపారంలో కొందరికి మాత్రమే లాభాలు దక్కుతున్నాయని, కళ్లు చెదిరే ఆదాయం కేబుల్‌ వ్యాపారంలో లభిస్తోందని గుర్తించిన రాజకీయ నేతలు తమ పరిధిలో కేబుల్ వ్యాపారాన్ని దక్కించుకోడానికి పావులు కదిపారు.

ఈ క్రమంలో కొందరు రాజకీయ నాయకులకు ముఖ్యనాయకుల ఆశీస్సులు లభించడంతో విజయవాడలో కేబుల్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవడం సులువైంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న టీవీ ఛానళ్ల ప్రసారాలపై ఆంక్షలు మొదలయ్యాయి. ఈ క్రమంలో వైసీపీ సానుభూతిపరులు తమ ఆధీనంలో ఉన్న కేబుల్ వ్యాపారాలను కొద్దినెలల క్రితం విడిచిపెట్టారు. 

విజయవాడ నగరానికి చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలతో ఆయన మద్దతుదారులు రెండు కేబుల్ సంస్థలకు చెందిన 50వేలకు పై చిలుకు కనెక్షన్లను చేజిక్కుంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవిలో ఉన్న నాయకుడికి చెందిన కేబుల్‌ టీవీ సంస్థతో పాటు, విజయవాడకు చెందిన దివంగత నాయకుడి అనుచరుడికి చెందిన కేబుల్‌ వ్యాపారాన్ని వదులుకున్నట్టు ప్రచారం జరిగింది. ప్రభుత్వం మారిన నెలల వ్యవధిలోనే ఈ రెండు సంస్థల నుంచి కేబుల్ కనెక్షన్లను కొత్త వర్గం తమ ఆధీనంలోకి తీసుకుంది.

విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధి విజయవంతంగా కేబుల్ వ్యాపారాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవడంతో నగర శివార్లలోని కృష్ణాజిల్లా ఎమ్మెల్యేకు కూడా కేబుల్ వ్యాపారంపై కన్నుపడింది. ఈ ప్రాంతంలో 60వేలకు పైగా కేబుల్ కనెక్షన్లను దక్కించుకోడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ ప్రయత్నాలను కేబుల్ వ్యాపారంలో సుదీర్ఘ కాలంగా ఉన్న సంస్థ అడ్డుకునే ప్రయత్నం చేసింది. 

దీంతో వివాదాలు మొదలయ్యాయి. కొత్తగా మరో సంస్థ కేబుల్ లైన్లు ఏర్పాటు చేస్తూ పాత వైర్లను కత్తిరించడంతో పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇదంతా పక్కా ప్రణాళికతో జరుగుతోందని సిటీ కేబుల్ ఎండీ సాయిబాబు ఆరోపించారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామని చెబుతున్నారు.

కళ్లు చెదిరే ఆదాయం..

కేబుల్ ప్రసార సంస్థలకు ఏటా కోట్లలో ఆదాయం ఉంటుంది. ఫ్రీ టూ ఎయిర్‌ ఛానళ్లతో పాటు పే ఛానళ్లను ప్రేక్షకులకు అందించాలంటే అయా సంస్థలు క్యారియర్ ఫీజులను చెల్లిస్తాయి. దీంతో పాటు ప్రసారాలను అందుకున్నందుకు వినియోగదారులు ప్రతి నెల చెల్లిస్తుంటారు. ప్రస్తుతం సెటాప్‌ బాక్సుల ద్వారా కేబుల్ ప్రసారాలు అందుతున్నాయి. మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్ల నుంచి స్థానికంగా ఉండే కేబుల్ ఆపరేటర్లు ఇంటింటికి కేబుల్ వైర్ల ద్వారా ప్రసారాలను అందిస్తుంటారు.

ప్రస్తుతం విజయవాడలో ఎమ్మెస్వోలు మొదలుకుని ఆపరేటర్ల వరకు నయానోభయానో లొంగదీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరైనా మాట వినకపోతే వారిని రకరకాల ప్రయత్నాలతో దారికి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇలా కేబుల్ వ్యాపారాన్ని కావాల్సిన వారికి కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేబుల్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ ట్రాయ్‌ ఆధ్వర్యంలో ప్రతి వినియోగదారుడి లెక్కను CASలో లెక్క చూపాల్సి ఉన్నా చాలామంది  కనెక్షన్లను తగ్గించి చూపిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా కూడా భారీగా  ఆదాయం దక్కుతోంది. 

భారీగా కమిషన్…

ప్రస్తుతం ఓ వినియోగదారుడు ఆపరేటర్‌కు చెల్లించే నెలవారీ ఛార్జీలతో సగటున రూ.100-150 వరకు లాభం ఉంటుంది. ఎమ్మెస్వోల నుంచి అందే సిగ్నల్‌కు కొంత మొత్తాన్ని చెల్లించినా ఆపరేటర్లకు ప్రతి నెల గణనీయంగా ఆదాయం సమకూరుతోంది. ఈ క్రమంలో కేబుల్ వ్యాపారంలో కొత్తవారిని ప్రవేశపెట్టడంతో పాటు రాజకీయంగా పట్టు సాధించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు విజయవాడలో ప్రచారం జరుగుతోంది. కేబుల్ వ్యాపారంలో పట్టు సాధించే క్రమంలో అనైతికంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిగ్నల్ మార్చే క్రమంలో కేబుల్‌ కనెక్షన్ల మీద అదనపు కమిషన్ ఆఫర్ చేస్తున్నట్టు చెబుతున్నారు. 

బలమైన అండదండలతోనే..

విజయవాడలో జరుగుతున్న కేబుల్‌ వార్‌కు రాజకీయంగా బలమైన వ్యక్తుల అండదండలు పుష్కలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఫలితంగా పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేబుల్ లైన్లు కత్తిరించిన చోట రిపేర్లు జరక్కుండా విద్యుత్ సిబ్బంది, పోలీసులు అడ్డుకుంటున్నారని, లాభాల్లో వాటాలు ఇవ్వడమో వ్యాపారాన్ని వదులుకోవడమో చేయాలని బెదిరింపులకు దిగుతున్నట్టు కేబుల్ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలో కేబుల్‌ వ్యాపారం అంశం కొలిక్కి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు ఇది పాకుతుందనే ఆందోళన పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

కేబుల్ ప్రసారాల్లో నాణ్యత, ఆపరేటర్ల మధ్య వివాదాలతో ప్రసారాలు నిలచిపోతుండటంతో ప్రేక్షకులు కూడా ప్రత్యామ్నయాలు చూసుకుంటున్నారు. డిటిహెచ్‌ కనెక్షన్లనో, ఫైబర్‌  నెట్‌ సిగ్నల్‌ను ఆశ్రయిస్తున్నారు.ఇలాంటి కనెక్షన్లు తిరిగి కేబుల్ వైపుకు వచ్చే అవకాశం  ఉండదని ఆపరేటర్లు చెబుతున్నారు. 

Whats_app_banner