Vizag Railwayzone: సాకారం కానున్న వైజాగ్ రైల్వే జోన్‌ ...జోన్ కార్యాల‌యం ఏర్పాటుకు టెండ‌ర్లు ఆహ్వానం…-vizag railway zone to be implemented tenders invited for setting up of zone office ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Railwayzone: సాకారం కానున్న వైజాగ్ రైల్వే జోన్‌ ...జోన్ కార్యాల‌యం ఏర్పాటుకు టెండ‌ర్లు ఆహ్వానం…

Vizag Railwayzone: సాకారం కానున్న వైజాగ్ రైల్వే జోన్‌ ...జోన్ కార్యాల‌యం ఏర్పాటుకు టెండ‌ర్లు ఆహ్వానం…

HT Telugu Desk HT Telugu
Nov 25, 2024 06:17 AM IST

Vizag Railwayzone: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల ఆశ వైజాగ్ రైల్వే జోన్‌ సాకారం కానుంది. విశాఖప‌ట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాల‌యం కోసం టెండరును పిలిచారు. డిసెంబ‌ర్ 2న ప్రీ బిడ్ నిర్వ‌హిస్తారు. డిసెంబ‌ర్ 13 నుంచి బిడ్డింగ్ ప్రారంభం కానుంది.

కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌
కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Sanjay Sharma)

Vizag Railwayzone: విశాఖ రైల్వే జోన్‌ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. అన్ని అనుకూలిస్తే ఈ నెల 29న ప్రధాని రాక సందర్భంగా జోన్‌ నిర్మాణానికి శంకుస్థాపన జరగవచ్చు. ఇప్పటికే ప్రధాని షెడ్యూల్‌ ఖరారు కావడంతో రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

రైల్వే జోన్ నిర్మాణానికి రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము త‌ర‌పున ఈ టెండ‌ర్‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు తెలిపారు. బిడ్డింగ్ వేసేవారు ఒరిజిన‌ల్ డాక్యూమెంట్ల‌ను స‌మ‌ర్పించాల‌ని పేర్కొన్నారు. జోన్ కార్యాలయం నిర్మాణానికి రూ.149.16 కోట్లు అంచనా వ్యయంతో డీపీఆర్ కేంద్రానికి గతంలోనే పంపారు.

రైల్వే జోన్ నిర్మాణానికి అధ్యయనాలు పూర్తి కావడంతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం టెండర్లను రైల్వే జోన్ ప్రధాన భవన కార్యాలయ నిర్మాణానికి గానూ పిలిచారు. డిసెంబ‌ర్ 27లోపు టెండర్లను దాఖలు చేయాల్సి ఉంది. ఈనెల 29న విశాఖప‌ట్నం ఉమ్మడి జిల్లాలో ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేస్తున్న దేశ ప్రధాన‌మంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా రైల్వే జోన్‌ ఆఫీసుకు పునాదిరాయి వేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.

గతంలో ఆరిలోవ ప్రాంతంలోగల ముషిడివాడలో 'రైల్వే శాఖకు చెందిన 53 ఎకరాల్లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ భవనాన్ని నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు పంపినా ఈ స్థలాన్ని కేంద్రం ఆమోదించ‌లేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రైల్వేజోన్‌ స్థాపనకు తొలి అడుగు పడడం మంచి పరిణామంగా పలువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

అన్ని హంగులతో జోన్ భవనం

విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేషన్‌కు ఎదురుగా గల డాబాగార్డెన్స్ వద్ద వైర్‌లెస్‌ కాలనీలోని పదహారున్నర ఎకరాల రైల్వే స్థలంలోనే 11 అంతస్థుల భారీ భవన నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలోనే ఇక్కడ పాడుబడిన రైల్వే క్వార్టర్లను తొలగించి రైల్వే శాఖ చదును చేసి సిద్ధం చేసింది. 9 అంతస్థులు, రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తంగా 11 అంతస్తుల్లో దక్షిణ కోస్తా రైల్ జోనల్ మేనేజర్ కార్యాలయాన్ని నిర్మాణం చేయనున్నారు.

రూ.149.16 కోట్లు అంచనా వ్యయం

టెండర్లను సైతం పిలవడంతో డిసెంబ‌ర్ 27లోపు కొన్ని టెండర్లు దాఖలవుతాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. జోన్ కార్యాలయం కోసం రూ.149.16 కోట్లు అంచనా వ్యయం అవుతుందని కేంద్రానికి గతంలోనే డీపీఆర్ పంపించడం జరిగింది. దీన్ని రెండేళ్లలో పూర్తి చేయాలని కేంద్ర రైల్వే మంత్రి వైష్ణవ్ రైల్వేకు ఆదేశించారు. దక్షిణ కోస్తా రైల్వే జోనల్ కార్యాలయ ఎలక్ట్రికల్ ఎస్టిమేట్లను రెండు రోజుల క్రితం కేంద్రం ఆమోదించింది. సుమారు రూ.15.7 కోట్లు ఆమోదం పొందింది.

డిజైన్లు పూర్తి

జోన్ కార్యాలయానికి చెందిన ప్రతిపాదిత డిజైన్‌ను భువనేశ్వర్ 'కేంద్ర రైల్వే అధికారులు సైట్ సర్వే ప్లాస్, మాస్టర్ ప్లాన్, ఏరియల్ వ్యూ, ఫ్రంటెండ్ వ్యూ, స్ట్రీట్ వ్యూ, ఎంట్రన్స్ వ్యూ ఇలా అన్ని వైపుల నుంచీ డిజైన్‌ను తయారు చేసి వాల్తేరు రైల్వే అధికారులకు పంపిచారు. రైల్వే జోన్ భవన నిర్మాణానికి పునాది రాయితో ఆగకుండా పనులు ముందుకు సాగుతాయా? అన్నది చూడాల్సిందే.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner