Tirupati : తిరుపతిలో దారుణం.. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి అత్యాచారం.. చంపేస్తానని బెదిరింపులు
Tirupati : తిరుపతిలో దారుణం జరిగింది. చాక్లెట్లు కొనిస్తానని తీసుకెళ్లి బాలికపై ఇంటర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే అమ్మనాన్నల్ని చంపేస్తానని బెదించాడు. బాలికకు జ్వరం, కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రి తీసుకెళ్తే అసలు విషయం బయటపడింది.
తిరుపతిలో దారుణమైన ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని ఎంఆర్ పల్లికి చెందిన బాలాజీ.. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. వీరికి సమీపంలోనే బాలిక కుటుంబం నివసిస్తోంది. బాలిక అన్నతో సన్నిహితంగా ఉంటూ వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ బాలికను చూసేవాడు.
10 రోజుల కిందట బాలికకు చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బాలిక నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ అమ్మనాన్నల్ని చంపేస్తానని బెదిరించాడు. బాలిక భయంతో ఎవరికి చెప్పలేదు. అలా బెదిరిస్తూ నాలుగుసార్లు బాలికపై నిందితుడు బాలాజీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి బాలిక కొంత నలతగా ఉండేంది. శనివారం బాలికకు తీవ్ర జ్వరం, కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్యులకు అనుమానం వచ్చి పరీక్షించారు. ఆ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు గుర్తించారు. తల్లిదండ్రులు బాలికను ప్రశ్నించగా.. అప్పుడు అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిండ్రులు ఎస్‌వీ యూనివర్శిటీ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు బాలాజీని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
తిరుపతి నగరంలో నివసించే రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లో నిందితుడి అమ్మమ్మ పని చేస్తుంది. ఆయన పోలీస్ స్టేషన్‌కు వచ్చి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నించారు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు ఎదురు తిరగడంతో అక్కడ నుంచి వెనుదిరిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబ సభ్యలు డిమాండ్ చేస్తున్నారు. పోక్సో కేసు నమోదు కావడంతో.. దీన్ని డీఎస్పీ విచారణ చేస్తారని పోలీసులు వివరించారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)