Oats Khichdi Recipe: టేస్టీగా, సింపుల్‍గా పోషకాలతో కూడిన ఓట్స్ కిచిడీ.. తయారీ విధానం ఇదే.. పిల్లలు ఇష్టంగా తింటారు!
Oats Khichdi Recipe: ఓట్స్ కిచిడీని త్వరగా చేసుకోవచ్చు. ఇది టేస్టీగానూ ఉంటుంది. బ్రేక్‍ఫాస్ట్, లంచ్ ఎప్పుడైనా ఇది తినొచ్చు. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. పోషకాలు మెండుగా ఉంటాయి
ఎప్పుడైనా సింపుల్‍గా వంట చేసుకోవాలనిపిస్తే ఈ ‘ఓట్స్ కిచిడీ’ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. సమయం ఎక్కువ లేనప్పుడు కూడా ఇది చేసుకుంటే త్వరగా అవుతుంది. మెత్తగా ఉండటంతో పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారు. టేస్ట్ బాగుండటంతో పాటు పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. సులువుగా జీర్ణం కూడా అవుతుంది.ఈ ఓట్స్ కిచిడీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
ఓట్స్ కిచిడీకి కావాల్సిన పదార్థాలు
- అర కప్పు ఓట్స్
- పాపు కప్పు పెసర పప్పు
- అర కప్పు కూరగాయల ముక్కలు (బీన్స్, బంగాళదుంప, క్యారెట్ సహా అందుబాటులో ఉన్నవి)
- ఓ ఉల్లిపాయ (తరగాలి)
- కొన్ని పచ్చి బఠానీలు
- అర టీస్పూన్ జీలకర్ర,
- అర టీస్పూన్ ఆవాలు
- 2 పచ్చిమిర్చి (సన్నగా తరగాలి)
- ఓ టేబుల్ స్పూన్ అల్లం
- 2 కప్‍ల నీరు
- ఓ టేబుల్ స్పూన్ నీరు లేదా నెయ్యి
- ఉప్పు తగినంత
- కాస్త కొత్తమీర
ఓట్స్ కిచిడీ తయారు చేసుకునే విధానం
- ముందుగా పెసరపప్పు బాగా కడగాలి. ఆ తర్వాత ఆ పాత్రలో బాగా మెత్తగా ఉడికించుకోవాలి. పక్కన పెట్టుకోవాలి.
- స్టప్‍పై ఓ ప్యాన్ పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసుకొని వేడిచేయాలి. అందులో ముందుగా ఆవాలు, జీలకర్ర వేయాలి.
- ఆవాలు చిలపటలాడాక తరిగిన ఉల్లిపాయలు, కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి.
- ఆ తర్వాత అందులో కట్ చేసుకున్న కూరగాయల ముక్కలు, పచ్చి బఠానీ వేసుకోవాలి. పసుపు, తగినంత ఉప్పు వేయాలి. మూత పెట్టి 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి.
- దాంట్లో ఉడికించుకున్న పెసరపప్పు, ఓట్స్ వేసి బాగా కలపాలి. నీరు కూడా పోయాలి.
- ఆ తర్వాత ఓట్స్ మెత్తబడే వరకు సుమారు 6 నిమిషాల పాటు మూతమూసి ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
- బాగా ఉడికిన తర్వాత దానిపై ఓ స్పూన్ నెయ్యి వేయాలి. చివర్లో కాస్త కొత్తిమీర వేయాలి. ఆ తర్వాత ప్యాన్ దించేసుకోవాలి. అంతే టేస్టీగా ఉండే ఓట్స్ కిచిడీ రెడీ అయిపోతుంది.
ఈ ఓట్స్ కిచిడీలో పోషకాలు మెండుగా ఉంటాయి. రకరకాల కూరగాయలు, పెసరపప్పు, ఓట్స్ వేయడం వల్ల దీంట్లో కీలకమైన విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. దీంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మెత్తగా ఉండటంతో సులభంగా జీర్ణం అవుతుంది. కలర్‌ఫుల్‍గా, మెత్తగా ఉండటంతో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలకు పోషకాహారం అందించేందుకు ఇది కూడా ఓ బెస్ట్ మార్గం. ఈ వంటకాన్ని పావు గంటలోనే వండుకోవచ్చు.