Jharkhand Assembly elections: రూ.450కే ఎల్పీజీ సిలిండర్ సహా 7 హామీలు; జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి మేనిఫెస్టో
Jharkhand Assembly elections: జార్ఖండ్ లో కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, సీపీఎంలతో కూడిన ఇండియా కూటమి మంగళవారం మేనిఫెస్టోను విడుదల చేసింది. రూ.450కే ఎల్పీజీ సిలిండర్ సహా 7 హామీలను ఈ మేనిఫెస్టోలో ప్రకటించింది.జార్ఖండ్ లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది.
Jharkhand Assembly elections: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ, సీపీఎంలతో కూడిన ఇండియా కూటమి ఏడు హామీలను ప్రకటిస్తూ ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. రాంచీలో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇస్తున్న ఏ హామీ గురించి మాట్లాడినా ప్రధాని మోదీ వెంటనే విమర్శలు చేస్తారని ఖర్గే అన్నారు. ‘‘ప్రధాని మోదీ (narendra modi) ఇక్కడికి వచ్చి తన ప్రసంగంలో నా పేరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్ హామీలకు విశ్వసనీయత లేదని అన్నారు. కాంగ్రెస్ తన హామీలన్నింటినీ నెరవేరుస్తుంది. కానీ మోదీ హామీలు ఎప్పటికీ నెరవేరవు’’ అని ఖర్గే (mallikarjun kharge) విమర్శించారు.
రెండు దశల్లో పోలింగ్
81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలను నవంబర్ 23న ప్రకటిస్తారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) 30 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించగా, భారతీయ జనతా పార్టీ 25, కాంగ్రెస్ 16 స్థానాల్లో విజయం సాధించాయి. జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం) 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో జేఎంఎం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం 43 స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ 30 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపనుంది. రాష్ట్రీయ జనతాదళ్ (RJD) ఆరు స్థానాల్లో, వామపక్షాలు మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
మేనిఫెస్టోలోని ఏడు హామీలు
- సర్నా మత నియమావళి అమలుతో పాటు 1932 నాటి ఖతియాన్ ఆధారిత విధానాన్ని తీసుకురావడం.
- 2024 డిసెంబర్ నుంచి మాయి సమ్మాన్ స్కీమ్ కింద ప్రతీ నెల రూ.2,500 అందించడం.
- వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు, మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ.
- ఒక్కో కుటుంబానికి రూ.450 కే ఎల్పీజీ సిలిండర్. ఒక్కో వ్యక్తికి ఇచ్చే రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంపు.
- 10 లక్షల మంది యువతకు ఉపాధి.. కుటుంబ ఆరోగ్య బీమా పరిమితి రూ.15 లక్షలకు పెంపు.
- ప్రతి బ్లాక్ లో డిగ్రీ కాలేజీలు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు.
- వరి మద్దతు ధరను రూ.2,400 నుంచి రూ.3,200కు పెంచడంతో పాటు ఇతర పంటల ధరలను 50 శాతం పెంపు.