CM Revanth Reddy : కేసీఆర్ ఇగ కాసుకో, తెలంగాణలో నీ పార్టీని మొలక ఎత్తనియ్య- సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్-warangal congress vijayotsava meeting cm revanth reddy fires on kcr ktr harish rao ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : కేసీఆర్ ఇగ కాసుకో, తెలంగాణలో నీ పార్టీని మొలక ఎత్తనియ్య- సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్

CM Revanth Reddy : కేసీఆర్ ఇగ కాసుకో, తెలంగాణలో నీ పార్టీని మొలక ఎత్తనియ్య- సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్

Bandaru Satyaprasad HT Telugu
Nov 19, 2024 09:49 PM IST

CM Revanth Reddy : తెలంగాణలో కేసీఆర్ పార్టీని మొలక ఎత్తనియ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు కేసీఆర్ కు దమ్ముంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తామన్నారు.

కేసీఆర్ ఇగ కాసుకో, తెలంగాణలో నీ పార్టీని మొలక ఎత్తనియ్య- సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్
కేసీఆర్ ఇగ కాసుకో, తెలంగాణలో నీ పార్టీని మొలక ఎత్తనియ్య- సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్

"బిడ్డా కేసీఆర్ ఇగ కాసుకో, ఓరుగల్లు గడ్డపై నిలబడి చెబుతున్న...నిన్ను నీ పార్టీని తెలంగాణలో మొలక ఎత్తనియ్య. నిన్ను ఓడిస్తా అన్న ఓడించిన, పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా తెప్పిస్తా అన్న గుండు సున్నా తెప్పించిన" అని సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మండిపడ్డారు.

వరంగల్ ప్రజా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు కుట్రలు చేస్తే జైల్లో పెడతామన్నారు. కేసీఆర్ తాగుబోతుల సంఘాన్ని తయారు చేశారని, ఫుల్, హాఫ్‌నకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని విమర్శించారు. కేసీఆర్ అధికారం పోతే ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఊడాయి తప్ప, రాష్ట్ర ప్రజలు ఏం నష్టంలేదన్నారు. కేసీఆర్ హాయిగా ఫామ్ హౌస్‌లో పడుకోవాలని, అవసరమైతే అక్కడే వైన్ షాప్ పెడతామన్నారు.

కేసీఆర్ కు సవాల్

వరి వేస్త ఉరే అని కేసీఆర్ అన్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ ఏం చెప్పాలనుకుంటున్నారో? అసెంబ్లీకి వచ్చి చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేశారు. ఆయన రాకుండా ఇద్దరు చిల్లరగాళ్లను పంపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు బిల్లా-రంగాలు సిద్ధమా? అని సీఎం ప్రశ్నించారు. రైతు రుణమాఫీ చేస్తే అభినందించాల్సిందిపోయి విమర్శిస్తున్నారన్నారు. కేసీఆర్ ఎప్పుడంటే అప్పుడు అసెంబ్లీ పెట్టిస్తామని, ఆయన ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలన్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రా.. చర్చిద్దామని సీఎం రేవంత్ రెడ్డి...కేసీఆర్ కు సవాల్ విసిరారు.

“అర్హులైన రైతులందరికీ రుణ మాఫీ చేసే బాధ్యత ప్రజా ప్రభుత్వానిది. ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే 22 లక్షల రైతు కుటుంబాలకు 18 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేశాం. మాట ఇస్తే మడమ తిప్పకుండా అందరికి రుణమాఫీ చేసే బాధ్యత మాది. మీ ఖాతాల్లో పొరపాట్లను సవరించుకోండి. రుణమాఫీపై తప్పుడు మాటలు నమ్మకండి. మీకు అండగా నిలబడుతా” అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

7 లక్షల కోట్ల అప్పు

రాష్ట్రానికి ప్రతి నెలా రూ.18,500 కోట్ల ఆదాయం వస్తుంటే, అందులో దాదాపు 6,500 కోట్లు జీతాలు, పెన్షన్ల కింద చెల్లిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పులపై అప్పు, వడ్డీ కింద మరో 6,500 కోట్లు పోతున్నాయని, ఇక మిగిలిన 5,500 కోట్ల ఆదాయం ఉంటే... ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ రూపాయి రూపాయి కూడబెట్టి రైతు రుణమాఫీ చేశామని చెప్పారు. ఏడాది పాలన సందర్భంగా “ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు” కార్యక్రమంలో భాగంగా ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన ఇందిర మహిళా శక్తి సభలో సీఎం పాల్గొన్నారు. ఈ వేదిక నుంచి ఒకేసారి 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలకు శంకుస్థాపన చేశారు.

రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి

మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ, బీమా చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. మహిళా సంఘాలు నిర్వహించే సౌర విద్యుత్ కొనుగోలుపై డిస్కంలు - సెర్ప్ కు మధ్య కుదిరిన ఒప్పంద పత్రాలను సీఎం సమక్షంలో మార్చుకున్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏ రాష్ట్రం పండించనంత ధాన్యం తెలంగాణ పండించిందన్నారు. 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించారన్నారు. ఈ ధాన్యానికి ఎంఎస్పీతో పాటు సన్నబియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణలో కొత్త ఎయిర్ పోర్టులు

"ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన వరంగల్ జిల్లా గత పదేండ్లలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేక నిర్లక్ష్యానికి గురైంది. అందుకే హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయాలని సంకల్పించాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే భౌగోళికంగా సగం తెలంగాణను అభివృద్ధి చేసినట్టవుతుంది. జాతీయస్థాయి పరిశ్రమలు, ఇక్కడ ఎయిర్‌పోర్టు రావడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ వర్సిటీ అభివృద్ధి పథంలో నడిపించడం ద్వారా సగం తెలంగాణ అభివృద్ధి బాట పట్టినట్టేనని భావించి ఈ బాధ్యత తీసుకుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఐదారు ఎయిర్ పోర్టులు ఉంటే... తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్‌పోర్టు ఉంది. అందుకే వరంగల్‌తో పాటు కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లలో కూడా విమానాశ్రయాలను స్థాపించి రాష్ట్రంలో పెట్టుబడులను తెచ్చి పరిశ్రమలను పెట్టుకుని తెలంగాణను అభివృద్ధి పథంవైపు నడిపించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది"- సీఎం రేవంత్ రెడ్డి

Whats_app_banner

సంబంధిత కథనం