Ind vs Aus 1st Test Live: టీమిండియాకు తొలి సెషన్‌లోనే పేస్ దెబ్బ.. విలవిల్లాడిన బ్యాటర్లు.. కోహ్లి కూడా చేతులెత్తేశాడు
Ind vs Aus 1st Test Live: ఆస్ట్రేలియాలో టీమిండియాకు తొలి సెషన్ లోనే పేస్ దెబ్బ గట్టిగానే తగిలింది. ఆసీస్ పేసర్లు హేజిల్‌వుడ్, స్టార్క్ దెబ్బకు టాపార్డర్ కుప్పకూలింది. లంచ్ సమయానికి ఇండియా 4 వికెట్లకు 51 పరుగులు మాత్రమే చేయగలిగింది.
Ind vs Aus 1st Test Live: టీమిండియాకు ఊహించినట్లే పెర్త్ టెస్ట్ తొలి సెషన్లో పేస్ పరీక్ష ఎదురైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ప్రారంభమైన తొలి టెస్టు తొలి సెషన్ లోనే మన బ్యాటర్లు తడబడ్డారు. ఆస్ట్రేలియా పేసర్లు హేజిల్‌వుడ్, స్టార్క్ ధాటికి వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో లంచ్ సమయానికి ఇండియా 4 వికెట్లు కోల్పోయి కేవలం 51 పరుగులు మాత్రమే చేసింది.
పెర్త్‌లో పేస్ దెబ్బ
ఆస్ట్రేలియాలో మంచి బౌన్స్ తో పేస్ బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పెర్త్ లోనే ఉంది. ఇక్కడే తొలి టెస్ట్ ఉండటంతో టీమిండియాకు పరీక్ష తప్పదని మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఊహించినట్లే తొలి సెషన్ లోనే ఆస్ట్రేలియా పేస్ దెబ్బ ఎలా ఉంటుందో ఇండియన్ బ్యాటర్లు చూశారు. ఒక్కో పరుగు కోసం తంటాలు పడటమే కాదు.. వికెట్లనూ కాపాడుకోలేకపోయారు.
ఓపెనర్లు కేఎల్ రాహుల్ (26), యశస్వి జైస్వాల్ (0), దేవదత్ పడిక్కల్ (0), విరాట్ కోహ్లి (5) ఇప్పటికే పెవిలియన్ చేరారు. ఆస్ట్రేలియా వెళ్లినప్పటి నుంచీ నెట్స్ లోనే పేస్ బౌలింగ్ లో తంటాలు పడిన ఓపెనర్ యశస్వి.. క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. స్టార్క్ బౌలింగ్ లో మూడో ఓవర్ తొలి బంతికే డకౌట్ గా వెనుదిరిగాడు.
కోహ్లి కూడా అంతే..
శుభ్‌మన్ గిల్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. క్రీజులో నిలదొక్కుకోవడానికి చాలాసేపు ప్రయత్నించినా.. చివరికి 23 బంతులు ఆడి డకౌటయ్యాడు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో అద్భుతమైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. అతడైనా జట్టును ఆదుకుంటాడని ఆశించినా.. అదీ జరగలేదు.
హేజిల్‌వుడ్ బౌలింగ్ లో అనూహ్యమైన బౌన్స్ కు కోహ్లి (5) ఔటయ్యాడు. ఇక ఓపెనర్ గా వచ్చి మొదట్లో ఇబ్బంది పడినా తర్వాత క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన కేఎల్ రాహుల్ కూడా లంచ్ లోపే పెవిలియన్ చేరాడు. రాహుల్ 74 బంతుల పాటు బ్యాటింగ్ చేసి 26 పరుగులు చేశాడు. చివరికి స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో లంచ్ సమయానికి ఇండియా 4 వికెట్లకు 51 పరుగులు మాత్రమే చేసింది.
రిషబ్ పంత్ (10), ధృవ్ జురెల్ (4) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఆప్టస్ స్టేడియం పిచ్ పై బౌన్స్ చాలా ఉండటంతో తర్వాతి సెషన్ లోనూ టీమిండియాకు పేస్ పరీక్ష తప్పదు. మరి క్రీజులో ఉన్న ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు ఎంత వరకూ ఈ పరీక్షను ఎదుర్కొంటారో చూడాలి.