Mulugu Maoist Murders: ఇన్ఫార్మర్ నెపంతో అన్నదమ్ముల దారుణ హత్య.. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం-brutal murder of brothers on the pretext of being informers maoist attack in mulugu district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mulugu Maoist Murders: ఇన్ఫార్మర్ నెపంతో అన్నదమ్ముల దారుణ హత్య.. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

Mulugu Maoist Murders: ఇన్ఫార్మర్ నెపంతో అన్నదమ్ముల దారుణ హత్య.. ములుగు జిల్లాలో మావోయిస్టుల ఘాతుకం

HT Telugu Desk HT Telugu
Nov 22, 2024 08:43 AM IST

Mulugu Maoist Murders: ములుగు జిల్లా మరోసారి ఉలిక్కిపడింది. ఇన్ ఫార్మర్ల నెపంతో మావోయిస్టులు ఇద్దరు అన్నదమ్ములను దారుణ హత్య చేశారు. వాళ్లిద్దరినీ గొడ్డళ్లతో నరికి చంపడంతో పాటు సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం– వాజేండు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరున లేఖ కూడా రిలీజ్ చేశారు.

ములుగులో మావోయిస్టులు హత్య చేసిన విఆర్‌ఓ రమేష్‌
ములుగులో మావోయిస్టులు హత్య చేసిన విఆర్‌ఓ రమేష్‌

Mulugu Maoist Murders: ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్‌ఫార్మర్‌ల పేరుతో అన్నదమ్ములను నరికి చంపారు. అన్నదమ్ములు ఇద్దరినీ దారుణంగా హతమార్చడంతో ములుగు జిల్లాలో ఒక్కసారిగా భీకర వాతావరణం నెలకొంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీలో ఉంటున్న ఉయిక రమేశ్ పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుండేవాడు.

అతని తమ్ముడు ఉయిక అర్జున్ స్థానికంగా పశువులను మేపుకుంటూ ఉండేవాడు. కాగా ఉయిక అర్జున్ కొద్దిరోజులుగా ఇన్ ఫార్మర్ గా మారి పోలీసులకు సమాచారం చేర వేస్తున్నట్లు మావోయిస్టులు అనుమానించారు. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి కొంతమంది మావోయిస్టులు గ్రామంలోకి చొరబడి ఉయిక రమేష్ తో పాటు ఉయిక అర్జన్ ను వేట గొడ్డళ్లతో దారుణంగా హత్య చేశారు. దీంతో ములుగు జిల్లాలో కలకలం చెల రేగింది. విషయం తెలుసుకున్న పోలీసు వర్గాల్లో కూడా అలజడి మొదలైంది.

లేఖ విడుదల చేసిన మావోలు

అన్నదమ్ములను హత్య చేసిన అనంతరం భారత కమ్యూనిస్ట్ మావోయిస్ట్ పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరున లేఖ కూడా రిలీజ్ చేశారు. దాని సారాంశం ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామానికి చెందిన ఉయికె అర్జున్ గ్రామంలో ఉంటూ పోలీస్ ఇన్ ఫార్మర్ గా మారాడు. అతను వాజేడు మండలంలో ఉంటున్నాడు.

అతను షికారు పేరుతో చేపల వేటతో పాటు పశువులను మేపే పేరుతో అడవికి వెళ్లి అంతా తిరిగేవాడు. అక్కడ మావోయిస్టుల దళం మకాంలు, కదలికలు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇస్తున్నట్టు మావోయిస్టు పార్టీ నేతలకు అనుమానం కలిగింది. దీంతో పద్ధతి మార్చుకోవాల్సిందిగా చెప్పినా వినడం లేదని పేర్కొంటూ.. అదే కారణంతో ఉయికె అర్జున్ ను ఖతం చేస్తున్నాం అంటూ లేఖలో పేర్కొన్నారు.

ఉలిక్కిపడిన ములుగు

ఉయికె అర్జున్ ను హతమార్చేందుకు మావోయిస్టులు అతడిని తీసుకెళ్లగా.. అడ్డుకునేందుకు వెళ్లిన అన్న రమేష్ ను కూడా మావోలు గొడ్డలి వేటుతో హత మార్చారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఇద్దరు అన్నదమ్ముల హత్యతో ములుగు జిల్లా మరోసారి ఉలిక్కిపడగా.. పోలీసులు అలర్ట్ అయ్యారు. గ్రామంలో పోలీసులు మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్థానికులు ఎవరూ భయాందోళనకు గురి కావొద్దని సూచిస్తున్నారు.

కాగా జిల్లాలో కొద్దిరోజులుగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందగా.. ఇప్పటికే నిఘా పెంచారు. అయినా గురువారం అర్ధ రాత్రి అన్న దమ్ముల హత్య జరగడంతో రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి ఉనికి చాటుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచిస్తున్నారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner