Self Medication: సొంతంగా మందులు వాడుతున్నారా? ఎంత డేంజరో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో చెప్పిన డాక్టర్-expert reveals dangers of self medication also suggested cautions ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Self Medication: సొంతంగా మందులు వాడుతున్నారా? ఎంత డేంజరో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో చెప్పిన డాక్టర్

Self Medication: సొంతంగా మందులు వాడుతున్నారా? ఎంత డేంజరో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో చెప్పిన డాక్టర్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 22, 2024 08:30 AM IST

Self Medication: మందులు సొంతంగా వాడితే ఎలాంటి రిస్కులు ఉంటాయో ఓ వైద్యుడు చెప్పారు. డాక్టర్‌ను సంప్రదించకుండా మందులు తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయో వెల్లడించారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచించారు.

Self Medication: సొంతంగా మందులు వాడుతున్నారా? ఎంత డేంజరో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో చెప్పిన డాక్టర్
Self Medication: సొంతంగా మందులు వాడుతున్నారా? ఎంత డేంజరో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో చెప్పిన డాక్టర్

జలుబు, దగ్గు, స్పల్ప జ్వరం, తొలనొప్పి సహా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు చాలా మంది సొంతంగా మందులు కొని వాడుతుంటారు. చిన్న సమస్యే కదా అని వైద్యులను దగ్గరికి వెళ్లరు. ఎవరో సూచించినవో, ఇంటర్నెట్‍లో చూసినవో మెడికల్ షాప్‍కు వెళ్లి కొని వాడేస్తారు. అయితే వైద్యులను సంప్రదించకుండా మందులు వాడితే శరీరంపై దుష్ప్రభావం పడుతుందని, సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని ఓ డాక్టర్ చెప్పారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

తప్పు మందులు తీసుకునే రిస్క్

ప్రజలు సొంతంగా మందులు వాడే విషయంపై హెచ్‍టీ లైఫ్‍స్టైల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు మణిపాల్ హాస్పిటల్స్ ఇంటర్నల్ మెడిసిన్ హెచ్‍వోడీ, కన్సల్టెంట్ తపస్ కుమార్ కోలే. సొంత వైద్యం చేసుకోవడం వల్ల ఆ రోగానికి కాకుండా తప్పు మందులు వాడే ప్రమాదం కూడా ఉంటుందని చెప్పారు. “వైద్యుడిని సంప్రదించకుంటే ఆ సమస్య ఏదని పూర్తిగా తెలియదు. సంబంధం లేని దానికి వైద్యం చేసుకున్నట్టు అవుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో హాని జరిగే అవకాశం ఉంటుంది” అని తపస్ చెప్పారు.

ఈ సమస్యలు ఎక్కువగా..

వైద్యానికి ఎక్కువ ఖర్చులు కాకూడదని కొందరు డాక్టర్ల దగ్గరికి వెళ్లరు. మందులు తీసుకొని వాడుతుంటారు. అయితే దీనివల్ల కలిగే సమస్యలను తపస్ వెల్లడించారు. “సోషల్ మీడియా, ఇంటర్నెట్, సొంత అనుభవాలపై ఆధారపడి స్వల్ప లక్షణాలను సులువుగా తగ్గించుకోగలమని చాలా మంది అనుకుంటారు. అయితే చాలా మంది ఆరోగ్య సమస్యలకు ఇదే కారణం అవుతోంది. శరీరంలో యాంటీ బయోటిక్ నిరోధం, మందులకు బాగా అలవాటు పడడం లాంటివి ఎదుర్కొంటున్నారు” అని డాక్టర్ తపస్ పేర్కొన్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

ఒకవేళ వైద్యుడిని సంప్రదించకుండా మందులు వాడితే కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని తపస్ వెల్లడించారు. “మందులపై ఉన్న అన్ని వివరాలు, లేబుళ్లు స్పష్టంగా చదవాలి. సైడ్ ఎఫెక్టులు ఏమైనా వస్తాయా అని అర్థం చేసుకోవాలి. సరైన డోస్ తీసుకోవడం చాలా ముఖ్యం. రిస్క్ తగ్గేందుకు, సేఫ్టీ కోసం మందులు కొనేటప్పుడు ఫార్మసిస్ట్ వద్ద పూర్తి వివరాలు తెలుసుకోవాలి” అని తపస్ చెప్పారు.

సొంతంగా మందులు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు వైద్య వర్గాలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తపస్ అభిప్రాయపడ్డారు. సమస్య ఎక్కువ కాకుండా వైద్యులు, సంబంధిత నిపుణులను సంప్రదించేలా ప్రజలను ప్రోత్సహించాలని చెప్పారు. సొంతంగా మందులు వాడడం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. మెడికల్ షాప్‍ల్లో నేరుగా మందులు ఇవ్వడాన్ని కూడా కట్టడి చేయడం ముఖ్యమని డాక్టర్ తపస్ అభిప్రాయపడ్డారు.

Whats_app_banner