Sarangapani Jathakam: జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది.. కడుపుబ్బా నవ్విస్తున్న సారంగపాణి జాతకం టీజర్
Vijay Devarakonda Release Sarangapani Jathakam Teaser: ప్రియదర్శి నటించిన మరొ సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ సారంగపాణి జాతకం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన సారంగపాణి జాతకం టీజర్‌ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. సారంగపాణి జాతకం టీజర్ విశేషాల్లోకి వెళితే..
Sarangapani Jathakam Teaser Released: కమెడియన్ నుంచి హీరోగా మారి మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు ప్రియదర్శి. తాజాగా ప్రియదర్శి నటించిన మరో కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం సారంగపాణి జాతకం. ఈ సినిమాకు అష్టా చెమ్మా, జెంటిల్‌మెన్, సమ్మోహనం, వీ చిత్రాల డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.
మూడో చిత్రంగా
'సారంగపాణి జాతకం' సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా చేస్తే.. రూప కొడువాయూర్ హీరోయిన్‌గా జంటగా నటించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది.
విజయ్ దేవరకొండతో రిలీజ్
సారంగపాణి జాతకం సినిమాను డిసెంబర్ 20న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా నవంబర్ 21న సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా సారంగపాణి జాతకం మూవీ టీజర్‌ను విడుదల చేశారు. నిమిషం 58 సెకన్స్ పాటు సాగిన ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటూ కడుపుబ్బా నవ్వించింది.
జాతకాలను నమ్మే హీరో
'సారంగపాణి జాతకం' టీజర్ విషయానికి వస్తే.. హీరో జాతకాలను బాగా నమ్ముతాడు. 'మన జీవితం మొత్తం మన చేతిలోనే రాసి ఉంటుంది' అని చెబుతాడు. ప్రతిరోజూ ఉదయం పేపర్ చూసి అందులో రాసింది నిజం అవుతుందని నమ్మడమే కాదు, అది నిజమైన రోజు చుట్టుపక్కల ఎవరున్నారు? ఏం అవుతుంది? అనేది పట్టించుకోకుండా తన సంతోషాన్ని అందరి ముందు వ్యక్తం చేసే యువకుడు.
కీచకుడిగా తనికెళ్ల భరణి
మరి, ఆ జాతకాలపై అమితమైన నమ్మకం వల్ల అతని జీవితంలో ఎన్ని మార్పులు వచ్చాయి? ప్రేమించిన అమ్మాయిని పెళ్లికి సిద్ధమైన మండపంలో ఒకరిని సారంగపాణి ఎందుకు చంపడానికి ప్రయత్నించాడు? నరేష్‌ను ఎందుకు కత్తితో పొడిచాడు? అది నిజమా? కలా? అతని జీవితంలో కీచకుడు ఎవరు? కీచకుడిగా తనికెళ్ల భరణి ఎటువంటి క్యారెక్టర్ చేశారు?.
సుందరమ్మ మరణిస్తే
సుందరమ్మ మరణిస్తే హీరో ఎందుకు హ్యాపీగా ఫీలయ్యాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు డిసెంబర్ 20న థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాలి అని మేకర్స్ చెబుతున్నారు. శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, హర్ష చెముడు వినోదం అందర్నీ నవ్విస్తుందని టీజర్ ద్వారా తెలుస్తోంది.
ఒక్క పార్ట్ గుర్తుందా
అనంతరం సుందరమ్మ హీరో చైల్డ్‌హుడ్ గురించి చెప్పడం, టింగు టింగు అంటూ నడిచేవాడివి అని చెప్పడం కామెడీ పండించింది. 'మొత్తం మనిషిలో ఆ ఒక్క పార్ట్ గుర్తుందా ఈవిడకి', 'బీ కార్పొరేట్, నాట్ డెస్పరేట్' అని 'వెన్నెల' కిశోర్ చెప్పే డైలాగ్స్ నవ్వించాయి.
మంత్రాలు, తాయత్తులు ఉండవు
'సారంగం అని ధనుస్సు చేతిలో ఉన్నవాడు సారంగపాణి', 'నా దగ్గర విరుగుడు మంత్రాలు, పూజలు, తాయత్తులు ఉండవు' అని శ్రీనివాస్ అవసరాల, 'నాలాంటి ప్రాక్టికల్ మనిషికి ఇలాంటి జాతకాల పిచ్చోడు కొడుకుగా ఎలా పుట్టాడే' అని తండ్రి పాత్రలో వడ్లమాని శ్రీనివాస్, 'నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా ఆఫీస్' అంటూ హీరో పదేపదే చెప్పే మాట కథపై క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి.