Kaal Bhairav Ashtami: నేడే కాలాష్టమి - మద్యం నైవేద్యంగా పెడితే కోరిన కోరికలన్నీ నెరవేరతాయట
Kaal Bhairav Ashtami: శివుడి ఉగ్రరూపావతారమైన కాల భైరవుని మెప్పిస్తే భయం, చెడుకాలం, ప్రతికూల శక్తులు దూరమవుతాయి. నవంబర్ 22 శుక్రవారం కాలాష్టమి సందర్భంగా కాల భైరవుని మెప్పించేందుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పరమేశ్వరుడి ఉగ్రరూపమైన కాల భైరవుడి అవతారమెత్తిన రోజును కాల భైరవ జయంతిగా జరుపుకుంటారు. దీనినే కాలాష్టమి అని కూడా పిలుస్తారు. ఈ రోజున కాలా భైరవ రూపంలో ఉన్న శివున్ని ప్రసన్నం చేసుకుంటే మనల్ని పట్టిపీడిస్తున్న భయం, బాధలు తొలగిపోతాయి. దుష్ట శక్తులు, ప్రతికూల ప్రభావాలు నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మిక. ఈ రోజు కాల భైరవుని అనుగ్రహం పొందేందుకు ప్రత్యేక పూజలతో పాటు నైవేద్యంగా మద్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల కాల భైరవుని ప్రసన్నమై కోరిన కోరికలు తీరుస్తాడని నమ్ముతారు.
కాల భైరవ అష్టమి 2024 (పూజా సమయం):
హిందూ క్యాలెండర్ ప్రకారం, 2024 నవంబర్ 22 శుక్రవారం సాయంత్రం 06గంటల 07 నిమిషాలకు కాల భైరవ అష్టమి తిథి ప్రారంభమవుతుంది. మరుసటి రోజు 2024 నవంబర్ 23న రాత్రి 07గంటల 56 నిమిషాలకు సమాప్తమవుతుంది. ఈ సమయంలో కాల భైరవుని భక్తి శ్రద్ధలతో ఆరాధించి నైవేద్యంగా మద్యాన్ని సమర్పించాలి.
నైవేద్యంగా మద్యం ఎందుకు సమర్పించాలంటే:
పురాణాల ప్రకారం, కాల భైరవుడు తాంత్రిక పూజలకు ప్రధాన దేవుడు. ఈ సంప్రదాయంలో మద్యానికి ప్రాముఖ్యత ఎక్కువ. స్వీయ నియంత్రణ, ప్రాపంచిక అనుబంధాల నుంచి స్వేచ్ఛకు మద్యం చిహ్నంగా తాంత్రిక శాస్త్రం చెబుతుంది. కనుక కాల భైరవుని శాంతింపజేసేందుకు కాలాష్టమి రోజున ఆయనకు ప్రీతికరమైన మద్యాన్ని సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ప్రాపంచిక సుఖాలు, ఆధ్మాత్మికతను సమభావంతో చూసినట్లుగా అవుతుందని ఆయన భక్తులు విశ్వసిస్తారు.
సాధారణంగా ఆల్కహాల్‌ను అశుద్దంగా లేదా చెడు పానీయంగా భావిస్తారు. కానీ, కాల భైరవుని దీనిని సమర్పించడం అంటే మన సకల పాపాలు, అజ్ఞానం ఆయన ముందుంచినట్లు అవుతుంది. వాటిని స్వీకరించిన ఆయన మనకు స్వచ్ఛతను, జ్ఞానాన్ని అందిస్తాడని నమ్ముతారు. మనలోని భయాన్ని, అభద్రతా భావాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసంతో జీవించేందుకు అనుగ్రహిస్తాడని చెబుతారు.
పూజ చేయాల్సిన పద్ధతి:
* ఉదయాన్నే లేచి పవిత్ర స్నానం చేయడం.
* ఉపవాస దీక్షను చేపట్టి రోజంతా మహిమాన్వితమైన "హ్రీం ఉన్మత్ భైరవాయ నమ:" అనే మంత్రాన్ని జపించడం.
* ఇంటిని, ముఖ్యంగా పూజా గదిని శుభ్రం చేయడం.
* పూజ గదిలో కాల భైరవ విగ్రహాన్ని లేదా కాల భైరవ యంత్రాన్ని ఉంచాలి.
* ఆవాల నూనెతో దీపం వెలిగించి, దండ, స్వీట్లు పెట్టాలి.
* కాల భైరవ అష్టకం పఠిస్తూ ప్రార్థనలు చేస్తారు.
* ఆ తర్వాత నలు దిక్కులా ఆవాల నూనెతో నాలుగు వైపులా దీపం వెలిగించాలి.
* కాల భైరవుడికి మద్యాన్ని, పాలను సమర్పిస్తారు.
* సాయంత్రం వేళల్లో నాలుగు వైపులా దీపాలు వెలిగించి అర్ధరాత్రి వరకూ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు.
* ఉదయం నుంచి కఠిక ఉపవాసం నిర్వహించి ఉపవాస విరమణ తర్వాత నల్ల కుక్కకు తియ్యటి రోటీలు తినిపించడం వల్ల అదనపు ప్రయోజనాలు అందుతాయని విశ్వసిస్తారు.
నిష్టతో ఈ సంప్రదాయాలు ఆచరించి ఆ కాలభైరవుని ఆశీస్సులు, రక్షణ, మార్గదర్శకత్వం కోసం కోరుకుంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.