Gowtam Adani: ఏపీలో గౌతమ్ అదానీ ప్రకంపనలు.. అమెరికా అభియోగాల్లో జగన్ ప్రస్తావన.. నో కామెంట్ అంటున్న టీడీపీ
Gowtam Adani: భారత్‌లో విద్యుత్ ఒప్పందాలకు 250 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపారనే అభియోగాలతో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావనకు రావడంతో దుమారం రేగుతోంది. అమెరికాలో నమోదైన అభియోగాల్లో వైసీపీ అధినేత జగన్ పేరు తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంపై టీడీపీ నో కామెంట్ అంటుంటే, సెకీతోనే ఒప్పందమని వైసీపీ చెబుతోంది.
Gowtam Adani: సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో ముడుపుల వ్యవహారంపై అమెరికాలో నమోదైన అభియోగాలు ఆంధ్రాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ విషయంలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీతో పాటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. భారత్‌లో విద్యుత్ ఒప్పందాలు జరిగిన రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉంది. ఏపీలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, జగన్‌ల మధ్య జరిగిన భేటీపై విమర్శలు చెలరేగాయి.
గౌతమ్ అదానీ 2021 ఆగస్టులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారని యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆరోపించింది. జగన్ పేరును నేనుగా ప్రస్తావించకపోయినా ఏపీకి చెందిన హయ్యర్ అఫిషియల్‌గా ఉటంకించడంతో, అప్పట్లో ముఖ్య స్థానంలో ఉన్న జగన్ పేరు తెరపైకి వచ్చింది.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని తొలుత కుదుర్చుకోలేదని, ఆంధ్రప్రదేశ్ అలా చేయడానికి అవసరమైన ప్రోత్సాహకాల గురించి ఈ సమావేశం జరిగిందని న్యూయార్క్ కోర్టులో దాఖలు చేసిన అభియోగ పత్రంలో పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థ సెకీ పెద్ద సోలార్ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వడంతో సహా పునరుత్పాదక ఇంధనానికి సంబంధించిన కేంద్ర పథకాలను అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది.
7,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కొనుగోలు కోసం సంబంధిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలు సెకీతో విద్యుత్ సరఫరా ఒప్పందాలు కుదుర్చుకునేలా చేయడానికి గౌతమ్ అదానీ ఆంధ్ర ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చినట్లు లేదా హామీ ఇచ్చినట్లు అభియోగాల్లో పేర్కొన్నారు.
విద్యుత్ సరఫరా ఒప్పందం కోసం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన లంచం ఒడిశా విద్యుత్ సరఫరా ఒప్పందం కంటే గణనీయంగా పెద్దదని అమెరికా మార్కెట్ రెగ్యులేటర్ ఆరోపించింది. అదానీ గ్రీన్ అంతర్గత రికార్డులకు అనుగుణంగా ఆంధ్ర ప్రభుత్వానికి లంచం చెల్లింపు సుమారు 200 మిలియన్ డాలర్లు అని అమెరికా ఎస్ఈసీ ఆరోపించింది.
అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎంతో అదానీ భేటీ, అధికారులకు లంచం ఇవ్వడం లేదా చెల్లిస్తామని హామీ ఇచ్చిన తర్వాత, అదానీ గ్రీన్, అజూర్ ఎస్ఈసీ నుంచి విద్యుత్ కొనుగోలుకు రాష్ట్రం అంగీకరించినట్లు తేలింది. ముడుపులు చెల్లించడానికి అమోదం తెలిపిన తర్వాతే ఈ ఒప్పందాలు జరిగాయని అమెరికా ఆరోపిస్తోంది.
అదానీ గ్రీన్, అజూర్ సంస్థలకు నేరుగా లబ్ధి చేకూర్చే విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని ఎస్ఈసీఐతో అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధికారులు ఆరోపించారు.
వారం రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహిరంగంగానే 'గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎస్ఈసీఐ ప్రతిపాదనను అంగీకరించాలని నిర్ణయించారు. చర్చల అనంతరం మొదటి దశలో 7 వేల మెగావాట్ల విద్యుత్ ను వినియోగించుకోవాలని రాష్ట్రం నిర్ణయించింది. అదానీ హామీ ఇచ్చిన తర్వాతే ఒప్పందాలు చకచకా నడిచినట్టు అమెరికా ఆరోపించింది.
ఆరోపణలు తోసిపుచ్చిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ అమెరికా అధికారుల ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది.
అదానీ గ్రీన్ డైరెక్టర్లపై అమెరికా న్యాయశాఖ, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వాటిని ఖండిస్తున్నామని తెలిపింది. ఈ అంశంపై అన్ని రకాల న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని తెలిపింది.
అదానీ వివాదంపై టీడీపీ మౌనం…
ఆంధ్రప్రదేశ్‌లో సౌర విద్యుత్ కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంశాన్ని పరిశీలించిన తర్వాతే ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ స్పందిస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. అదానీ వ్యవహారంపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. అదానీని కాపాడుతోందని రాహుల్ విమర్శించారు. ఏపీలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది.
ఒక నిర్ణయానికి వచ్చే ముందు నివేదికను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కొమ్మారెడ్డి పట్టాభి చెప్పారు. . దీనికి రెండు, మూడు రోజులు పడుతుందని పీటీఐ వార్తాసంస్థతో అన్నారు. భారతదేశంలో రెండవ అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా మరో ఏడుగురిపై ఖరీదైన సౌర విద్యుత్ కొనుగోలు కోసం ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన గుర్తుతెలియని అధికారులకు లంచం ఇచ్చినట్లు అమెరికా న్యాయ శాఖ ఆరోపించింది. ఈ అభియోగాలను వైసీపీ తోసిపుచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో సెకీతోనే ఒప్పందాలు జరిగాయని చెబుతోంది.