TTD Temple: కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికై బీఆర్‌ఎస్ నేతల వినతి, సానుకూలంగా స్పందించిన ఛైర్మన్
TTD Temple: కరీంనగర్ లో కలియుగ ప్రత్యక్ష దైవం కొలువుదీరనున్నారుజ జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం చేపట్టాలని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలు టీటీడీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు.
TTD Temple: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కరీంనగర్ లో నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడి ని ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ నేతలు కలిసి వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికే భూమి పూజ జరిగిన నేపథ్యంలో నిధులు కెటాయించి నిర్మాణ పనులు చేపట్టాలని కోరడంతో టిటిడి చైర్మన్ సానుకూలంగా స్పందించారు.
కరీంనగర్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ ప్రజలకు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని దర్శనం చేరువ చేయడానికి గత ప్రభుత్వంలో గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో 10 ఎకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు.
స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఇతర బీఆర్‌ఎస్ నాయకుల కృషితో కరీంనగర్ వాసులకు ఆ వెంకటేశ్వరుని దర్శన కళ సాకారం చేసేందుకు గాను 2023 మే 31 వేదమంత్రోచ్ఛారణలతో టీటీడీ ఆలయ భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం అత్యంత అట్టహాసంగా జరిగింది. అదే ప్రాంగణంలో అదే రోజు సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణోత్సవం కనుల పండుగలా జరిగింది.
అప్పుడు అనాటి టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేతులమీదుగా నిర్మాణ పత్రాలు అందుకున్నారు. రూ. 20 కోట్ల వ్యయంతో టిటిడి ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి అనాడే అన్నీ ఏర్పాట్లు జరిగాయి. ఆ తదుపరి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాకుండా అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నిజానికి గుడి నిర్మాణానికి అన్నీ హంగులు పూర్తిచేసిన సమయంలో.కాంగ్రెస్ ప్రభుత్వం లేదా ఆ పార్టీ నాయకులు కొంచెం శ్రద్ధ చూపిస్తే..ఈపాటికి పనులు ప్రారంభం అయ్యేవి. కానీ.. ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.
గుడి నిర్మాణ బాధ్యత భుజాన వేసుకున్న గంగుల
బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో గుడి నిర్మాణంలో ఆలస్యం జరిగింది. దీంతో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గుడి నిర్మాణ బాధ్యతను భుజాన వేసుకున్నారు. అందులో భాగంగా గురువారం మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించారు.
గుడి నిర్మాణం కోసం కేసిఆర్ తీసుకున్న చొరవ 10 ఎకరాల భూమి కేటాయింపు విషయాన్ని వివరించారు. అలాగే.. టీడీడీ బోర్డు రూ.20 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని వివరించారు. కరీంనగర్‌లో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రజల చిరకాల వాంఛ అని.. తప్పకుండా నిర్మాణం వెంటనే చేపట్టాలని, ఇందుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందిస్తామని నాయుడుకు వివరించారు.
సానుకూలంగా స్పందించిన టిటిడి ఛైర్మన్
కరీంనగర్ లో భూమి కెటాయించి నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో త్వరలోనే దేవాలయం నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు హామి ఇచ్చారు. నిర్మాణం విషయాన్ని ప్రథమ ప్రాధాన్యత కింద తీసుకుంటామని, అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని నాయుడు తెలిపినట్లుగా గంగుల చెప్పారు.
తమ విజ్ఞప్తిపై ఛైర్మన్ అత్యంత సానుకూలంగా స్పందించారని తెలిపారు. కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ అయిన శ్రీవెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి సానుకూలంగా చైర్మన్ స్పందించడంతో కరీంనగర్ వాసుల అశలు చిగురించినట్లు అయింది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)