Telugu OTT: ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు రొమాంటిక్ లవ్‌స్టోరీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?
Telugu OTT: తెలుగు రొమాంటిక్ మూవీ రవికుల రఘురామ థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సన్స్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో గౌతమ్ వర్మ, దీప్సికా ఉమాపతి హీరోహీరోయిన్లుగా నటించారు.
Telugu OTT: తెలుగు రొమాంటిక్ లవ్ డ్రామా మూవీ రవికుల రఘురామ థియేటర్లలో రిలీజైన ఎనిమిది నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. సన్ నెక్స్ట్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రవికుల రఘురామ మూవీలో గౌతమ్ వర్మ, దీప్సికా ఉమాపతి హీరోహీరోయిన్లుగా నటించారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహించాడు. ప్రమోదిని, సత్య కీలక పాత్రలో నటించారు.
మదర్ సెంటిమెంట్...
మార్చి 15న థియేటర్లలో రిలీజైన రవికుల రఘురామ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. లవ్‌స్టోరీకి మదర్ సెంటిమెంట్‌ను జోడించి దర్శకుడు చంద్రశేఖర్ ఈమూవీని తెరకెక్కించాడు. రవికుల రఘురామ మూవీతోనే గౌతమ్, దీప్సిక హీరోహీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీకి సుకుమార్ పమ్మి మ్యూజిక్ అందించాడు.
గౌతమ్, నిషా ప్రేమకథ...
గౌతమ్ (గౌతమ్ వర్మ) చెడు అలవాట్లు లేని రాముడు లాంటి మంచిబాలుడు. సీతలాంటి మంచి అమ్మాయి తన జీవితంలోకి రావాలని కలలు కంటుంటాడు. అనుకోకుండా గౌతమ్‌కు నిషాతో (దీప్సికా) ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరు ఒకరిని మరొకరు విడిచి ఉండ లేనంతగా ఇష్టపడుతుంటారు.
సాఫీగా సాగిపోతున్న లవ్‌స్టోరీలో ఓ చిన్న సంఘటన అలజడిని సృష్టిస్తుంది. గౌతమ్‌కు దూరంగా వెళ్లిపోతుంది నిషా. గౌతమ్‌కు నిషా ఎందుకు బ్రేకప్ చెప్పింది? ప్రియురాలు దూరమైన బాధలో గౌతమ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? గౌతమ్, నిషాను కలిపేందుకు గౌతమ్ తల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ప్లేబాయ్ అంటూ గౌతమ్‌పై ముద్ర వేసింది ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
ఆర్ఎక్స్ 100 తో పోలిక...
అర్జున్‌రెడ్డి, ఆర్ఎక్స్ 100 ఛాయలతో రవికుల రఘురామ మూవీ సాగిందంటూ ఆడియెన్స్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో మిగిలిన నటీనటులు కూడా చాలా మంది కొత్తవారే కనిపించారు.
రవికుల రఘురామ ట్రైలర్‌ను రిలీజ్ చేయడంతో ఈ చిన్న సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి ఏర్పడింది. టీవీ సీరియల్ ఆర్టిస్ట్ శ్రీధర్ వర్మ రవికుల రఘురామ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.