TG Assembly Session: డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఆలోపే మంత్రి వర్గ విస్తరణ!
TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 9 నుంచి శీతాకాల సమావేశాలను నిర్వహించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతోంది. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతోంది.
TG Assembly Session: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. డిసెంబరు 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ జరగొచ్చని మంత్రి పొంగు లేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడుస్తుండటంతో సమావేశాల నిర్వహణ వాడీవేడిగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావే శాల్లో నూతన రెవెన్యూ చట్ట బిల్లును ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి పొంగులేటి తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగు తల్లి విగ్రహావిష్కరణ ఉంటుందని చెప్పారు. అదే రోజు సోనియా గాంధీ జన్మదిన వేడుకల్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 7వ తేదీతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రబుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతోంది.
తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా కొత్త చట్టాన్ని సిద్ధం చేస్తున్నట్టు పొంగులేటివ చెప్పారు. పాత చట్టంలో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకొచ్చేందుకు బిల్లును సభలో పెట్టనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో బీఆర్‌ఎస్ తీసుకొచ్చిన ధరణి చట్టాన్ని ఆసరాగా చేసుకుని గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పొంగులేటి అన్నారు. రంగనాయక సాగర్ భూసేకరణ నోటిఫికేషన్ పేరుతో రైతులను మోసం చేశారని, మాజీ మంత్రి హరీశ్‌రావు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వీటిపై విచారణ జరిపిస్తామని పొంగులేటి చెప్పారు.
హరీశ్ రావు నిబంధనల ప్రకారం కొనుగోలు చేశారో లేదో విచారణలో తేలుతుందని చెప్పారు. రంగనాయక సాగర్ భూములపై సమగ్ర విచారణ జరుగుతోందని, తొందరపడాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. ఒక్కసారి నోటిఫికేషన్ జారీ చేశాక రద్దు చేయడం అంత సులువు కాదని, వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్పుడు గోపనపల్లి భూములను భూసేకరణ నోటిఫికేషన్ ద్వారా సేకరించినా, అవి ఇప్పటికీ ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయన్నారు.
డిసెంబరు 7లోపు మంత్రివర్గ విస్తరణ
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలతో పాటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి డిసెంబరు ఏడు నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ లోపు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
శాసనసభ సమావేశాల్లో విద్యుత్ కమిషన్ నివేదిక, గతంలో జరిగిన ఒప్పందాలపై చర్చతో పాటు ఈ-కార్ అంశాలపై చర్చ ఉంటుందని, రైతు, కులగణన సర్వేలు చర్చకు వచ్చే అవకాశాలు ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు.
ఆసరా, రైతు భరోసాపై స్పష్టత…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆసరా పింఛన్లు, రైతు భరోసా అమలుకు సన్నాహాలు చేస్తున్నట్టు పొంగులేటి చెప్పారు.తెలంగాణ మంత్రి వర్గంలో తాను కూడా మంత్రినేనని ఎవరి మంత్రి పదవులు ఇప్పించే స్థాయిలో లేనని పొంగులేటి చెప్పారు. మంత్రి వర్గంలో తాను 11వ స్థానంలో ఉన్నానని నంబర్ 2గా భట్టి విక్రమార్క ఉన్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గత ఏడాది కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 9నే మొదలయ్యాయి.