Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా టిప్పర్ లారీ లాంటోడు.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి అశ్విన్ వార్నింగ్-veteran india spinner ravichandran ashwin blunt reply on virat kohli vs jasprit bumrah fitness debate ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా టిప్పర్ లారీ లాంటోడు.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి అశ్విన్ వార్నింగ్

Jasprit Bumrah: జస్‌ప్రీత్ బుమ్రా టిప్పర్ లారీ లాంటోడు.. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కి అశ్విన్ వార్నింగ్

Galeti Rajendra HT Telugu
Sep 24, 2024 01:52 PM IST

Virat Kohli: జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ గురించి మాట్లాడే ముందు టిప్పర్ లారీ, మెర్సిడెస్ బెంజ్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలని అశ్విన్ సూచించాడు. విరాట్ కోహ్లీ అభిమానులు ఇటీవల బుమ్రాపై విమర్శలు గుప్పించడంపై అశ్విన్ స్పందించాడు.

రోహిత్, అశ్విన్, బుమ్రా
రోహిత్, అశ్విన్, బుమ్రా (PTI)

Jasprit Bumrah Tipper Lorry: భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాని టిప్పర్ లారీతో వెటరన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ పోల్చాడు. బంగ్లాదేశ్‌తో ఇటీవల ముగిసిన తొలి టెస్టులో సెంచరీతో పాటు 6 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. టీమిండియా విజయంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. భారత్, బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా సెప్టెంబరు 27 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. దొరికిన ఈ గ్యాప్‌లో తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక వీడియో వదిలిన అశ్విన్.. అందులో జస్‌ప్రీత్ బుమ్రాని ఇబ్బంది పెట్టిన ఒక అంశం సవివరంగా మాట్లాడాడు.

బుమ్రా మాటల్లో తప్పేముంది?


బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకి ముందు చెన్నైలో ఒక కార్యక్రమానికి జస్‌ప్రీత్ బుమ్రా హాజరయ్యాడు. అక్కడ అభిమానులు ‘‘టీమిండియాలోనే ఫిట్టెస్ట్ క్రికెటర్ ఎవరు’’ అని బుమ్రాని సరదాగా ప్రశ్నించారు. దాంతో విరాట్ కోహ్లీ పేరు చెప్తాడని అభిమానులు ఆశించగా.. బుమ్రా అందరి అంచనాల్ని తలకిందుల చేస్తూ తన పేరునే చెప్పుకున్నాడు. దాంతో బుమ్రాపై సోషల్ మీడియాలో కోహ్లీ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బుమ్రా ఏం చెప్పాడంటే ‘‘మీరు ఆశిస్తున్న సమాధానం నాకు తెలుసు, కానీ నేను ఫాస్ట్ బౌలర్. కాబట్టి నా పేరు చెప్పాలనుకుంటున్నాను. కొన్నాళ్లుగా భారత్ జట్టుకి ఆడుతున్నా, ఈ వేడి వాతావరణంలో ఒక ఫాస్ట్ బౌలర్‌గా అన్ని సవాళ్లని తట్టుకుని ఇంతకాలం ఆడటానికి చాలా ఫిట్‌నెస్ కావాలి. కాబట్టి నేనెప్పుడూ ఫాస్ట్ బౌలర్‌నే ప్రోత్సహిస్తా’’ అని చెప్పుకొచ్చాడు. దాంతో బుమ్రాకి గర్వం పెరిగిపోయిందంటూ కోహ్లీ అభిమానులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

జస్‌ప్రీత్ బుమ్రాకి మద్దతుగా నిలిచిన అశ్విన్.. ఫాస్ట్ బౌలర్ ఇబ్బందుల గురించి మాట్లాడుతూ టిప్పర్ లారీతో పోల్చాడు. బుమ్రా గాయాల గురించి ప్రస్తావిస్తూ కోహ్లీ ఫ్యాన్స్ అతడ్ని ట్రోల్ చేశారు. దాంతో ఏడాది క్రితం వరకు వెన్ను గాయంతో బుమ్రా ఇబ్బందులు పడిన విషయాన్ని కూడా అశ్విన్ ప్రస్తావించాడు.

బుమ్రా ఒక టిప్పర్ లారీ

‘‘టిప్పర్ లారీకి మెర్సిడెస్‌ బెంజ్‌కి చాలా వ్యత్యాసం ఉంటుంది. మెర్సిడెస్ కారు డ్రైవర్‌తో చాలా సాప్ట్‌గా నడుస్తుంది. దాని విడిభాగాలు కూడా చాలా ఖరీదైనవి. అదే టిప్పర్ లారీ అయితే.. లోడ్‌తో నార్త్ నుంచి సౌత్‌కి వెళ్లాలి. ఒకరకంగా చెప్పాలంటే ఫాస్ట్ బౌలర్ టిప్పర్ లారీ లాంటోడు. గాయపడినప్పుడు కుప్పకూలిపోతాడు. వెన్ను గాయం నుంచి కోలుకున్న తర్వాత బుమ్రా గంటకి 145కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు’’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

జస్‌ప్రీత్ బుమ్రాని టిప్పర్ లారీతో పోల్చిన అశ్విన్.. కాసేపటికే ‘‘కోహినూర్ వజ్రంగా’’ గా అభివర్ణించాడు. ‘‘ఫిట్టెస్ట్ క్రికెటర్ విషయాన్ని ఎందుకు పెద్దది చేయాలనుకుంటున్నారు? మండే ఎండల్లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బంతులేసే బుమ్రా కోహినూర్ వజ్రం. ఆ కోహినూర్ డైమండ్‌ను ఇంగ్లాండ్ వాళ్లు తీసుకెళ్లారు. కానీ.. బుమ్రా ఇప్పుడు ఇండియన్ కోహినూర్ డైమండ్. కాబట్టి బుమ్రా ఏం చెబితే దాన్ని అంగీకరించండి’’ అని అశ్విన్ సూచించాడు.

కపిల్ తర్వాత బుమ్రానే

1983 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్‌తో బుమ్రాకి పోలికలు పెట్టి మళ్లీ అతడ్నే అభిప్రాయం అడిగి.. దుమారం రేపడం సరికాదని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ‘‘ఒక్క విషయం చెప్పండి. కపిల్ దేవ్ తర్వాత ఏ ఫాస్ట్ బౌలర్ అయినా బుమ్రా అంత పెద్దవాడయ్యాడా? బుమ్రా ఒక్కడే వచ్చి మ్యాచ్‌లను గెలిపిస్తాడు. బుమ్రాను ఒక ప్రశ్న అడిగారు, అతను మీకు సంతృప్తికరమైన సమాధానం చెప్పలేదని.. మీరే అతని సమాధానాలు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం?’’ అని అశ్విన్ మండిపడ్డాడు.

కపిల్ దేవ్, మహ్మద్ షమీ తర్వాత అన్ని ఫార్మాట్లలో 400 వికెట్లు తీసిన మూడో ఫాస్ట్ బౌలర్‌గా బుమ్రా ఇటీవల రికార్డును అందుకున్న విషయం తెలిసిందే.