IND vs BAN 1st Test Day 3: పటిష్ట స్థితిలో భారత్.. పంత్, గిల్ అదిరే శతకాలు.. తిప్పేసిన అశ్విన్.. కష్టాల్లో బంగ్లాదేశ్
IND vs BAN 1st Test Day 3: బంగ్లాదేశ్‍తో తొలి టెస్టు టెస్టులో భారత్ గెలిచే స్థితికి చేరుకుంది. శుభ్‍మన్ గిల్, రిషబ్ పంత్ శతకాలతో దుమ్మురేపారు. అశ్విన్ బంతితో రాణించాడు. దీంతో లక్ష్యఛేదనలో బంగ్లా చిక్కుల్లో ఉంది.
బంగ్లాదేశ్‍తో తొలి టెస్టులో భారత్ విజృభిస్తోంది. అన్ని విభాగాల్లో అదిరే ఆటతో బంగ్లాను బెంబేలెత్తిస్తోంది. మూడో రోజు ముగిసే సరికి విజయం సాధించే దిశగా పటిష్ట స్థితిలో నిలిచింది. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజైన నేడు (సెప్టెంబర్ 21) భారత్ యంగ్ స్టార్లు శుభ్‍మన్ గిల్, రిషబ్ పంత్ శకతాలతో చెలరేగారు. రెండో ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్ చేయగా.. భారీ లక్ష్యఛేదనలో మంచి ఆరంభాన్ని అందుకున్న బంగ్లాను టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బకొట్టాడు. వెలుతురు సరిగా లేని కారణంగా సుమారు గంటన్నర ముందుగానే నేటి ఆట ముగిసింది.
515 పరుగుల కొండంత లక్ష్యఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంతో (60 బంతుల్లో 51 పరుగులు నాటౌట్), సీనియర్ ప్లేయర్ షకీబల్ హసన్ (5 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్ గెలువాలంటే బంగ్లా ఇంకా 357 పరుగులు చేయాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని బంగ్లా ఛేదించడం కష్టమే. మూడో రోజు ఎలా సాగిందంటే..
పంత్, గిల్ సెంచరీల ధమాకా
3 వికెట్లకు 81 పరుగుల వద్ద మూడో రోజు ఆటను భారత్ ఆరంభించింది. రిషబ్ పంత్ (128 బంతుల్లో 109 పరుగులు), శుభ్‍మన్ గిల్ (176 బంతుల్లో 119 పరుగులు; నౌటౌట్) ఆరంభం నుంచే ధనాధన్ ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లను చితకబాదారు. బౌండరీల మోత మోగించారు. అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. లంచ్ వరకు మరో వికెట్ పడకుండా అదే జోరుతో బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత 124 బంతుల్లోనే పంత్ శకతం పూర్తి చేసుకున్నాడు. దాదాపు 21 నెలల తర్వాత టెస్టు ఆడిన అతడు సెంచరీతో దుమ్మురేపాడు. ఆరో టెస్టు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక టెస్టు శతకాలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఎంఎస్ ధోనీ రికార్డును పంత్ సమం చేశాడు.
కాసేపటికే శుభ్‍మన్ గిల్ కూడా 161 బంతుల్లో సెంచరీ చేరాడు. పంత్ ఔటైనా గిల్ నిలకడగా ఆడాడు. అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 22 పరుగులు) ధీటుగా ఆడాడు. 287 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. దీంతో బంగ్లాదేశ్‍కు 515 పరుగుల కొండంత టార్గెట్ ఇచ్చింది భారత్.
ధాటిగా మొదలుపెట్టిన బంగ్లా
భారీ లక్ష్యఛేదనను బంగ్లాదేశ్ బాగా ఆరంభించింది. ఓపెనర్లు షాద్మన్ ఇస్లాం (68 బంతుల్లో 35 పరుగులు), జకీర్ హసన్ (47 బంతుల్లో 33 పరుగులు) ధాటిగా ఆడారు. ముఖ్యంగా జకీర్ వేగంగా పరుగులు చేశాడు. తొలి వికెట్‍కు వీరు 62 పరుగులు జోడించారు. ఈ తరుణంలో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా జకీర్‌ను ఔట్ చేసి.. టీమిండియాకు ఈ ఇన్నింగ్స్‌లో ఫస్ట్ బ్రేక్ ఇచ్చాడు.
అదరగొట్టిన అశ్విన్
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‍తో శకతంతో దుమ్మురేపిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లో బంతితో రాణించాడు. నిలకడగా ఆడుతున్న బంగ్లా ఓపెనర్ షద్మన్ ఇస్లాంను అశ్విన్ ఔట్ చేసి దెబ్బకొట్టాడు. జోరు మీద ఉన్న బంగ్లాకు బ్రేకులు వేశాడు. మరో ఎండ్‍లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో వేగంగా పరుగులు రాబట్టాడు.
ఆ తర్వాత కాసేపటికి మోమినుల్ హక్ (13)ను భారత స్టార్ అశ్విన్ బౌల్డ్ చేసేశాడు. నాలుగు ఓవర్ల తర్వాత బంగ్లా సీనియర్ స్టార్ ముష్పికర్ రహీమ్ (13)ను పెవిలియన్‍కు పంపాడు అశ్విన్. దీంతో బంగ్లాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అర్ధ శకతంతో జోరు మీద ఉన్న నజ్ముల్‍కు షకీబ్ తోడయ్యాడు. అయితే, ఆ తర్వాత వెలుతురు సరిగా లేకపోవటంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు. సుమారు గంటన్నర ముందుగానే మూడో రోజు ఆట ముగిసింది.
బంగ్లాకు కష్టమే!
అశ్విన్ మూడు వికెట్లతో అదగొట్టాడు. కీలక వికెట్లు తీసి భారత్‍ను మరింత పటిష్ట స్థితిలో నిలిపాడు. బుమ్రాకు ఓ వికెట్ దక్కింది. నాలుగో రోజు ఆటను 4 వికెట్లకు 158 వద్ద బంగ్లా రేపు కొనసాగించనుంది. నజ్ముల్, షకీబ్ బ్యాటింగ్ కంటిన్యూ చేస్తారు. ఈ తొలి టెస్టులో ఇంకా రెండు రోజుల ఆట ఉంది. బంగ్లా చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉండగా.. గెలువాలంటే ఇంకా 357 పరుగులు చేయాలి. అయితే, ఈ స్కోరు చేయడం బంగ్లాకు తలకు మించిన పనే. టీమిండియానే విజయం సాధించే పటిష్టమైన స్థితిలో ఉంది. నాలుగో రోజే భారత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.