Shubman Gill Century: చెపాక్ టెస్టులో సెంచరీలు బాదేసిన గిల్, పంత్.. బంగ్లా టార్గెట్ 515-india opener shubman gill smashes his 5th test century in india vs bangladesh 1st test ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Shubman Gill Century: చెపాక్ టెస్టులో సెంచరీలు బాదేసిన గిల్, పంత్.. బంగ్లా టార్గెట్ 515

Shubman Gill Century: చెపాక్ టెస్టులో సెంచరీలు బాదేసిన గిల్, పంత్.. బంగ్లా టార్గెట్ 515

Galeti Rajendra HT Telugu
Sep 21, 2024 01:40 PM IST

Rishabh Pant Century: బంగ్లాదేశ్‌పై చెపాక్ టెస్టులో రిషబ్ పంత్, శుభమన్ గిల్ సెంచరీలు బాదేశారు. మూడు గంటల పాటు బంగ్లాదేశ్ బౌలర్లని ఉతికారేసిన ఈ జోడి.. నాలుగో వికెట్‌కి 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది.

పంత్, గిల్ సెంచరీలు
పంత్, గిల్ సెంచరీలు (AP)

IND vs BAN 1st Test Live: బంగ్లాదేశ్ జట్టుతో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు రిషబ్ పంత్, శుభమన్ గిల్ సెంచరీలు బాదేశారు. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోరు 33తో బ్యాటింగ్ కొనసాగించిన శుభమన్ గిల్ 161 బంతుల్లో 100 పరుగులు చేయగా.. రిషబ్ పంత్ కేవలం 124 బంతుల్లోనే 100 పరుగుల మార్క్‌ని అందుకున్నాడు. దాంతో 81/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 287/4తో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 227 పరుగుల్ని కలిపితే.. మొత్తం 515 పరుగుల టార్గెట్ బంగ్లాదేశ్ ముందు నిలిచింది.

ధోనీ సరసన పంత్

ఈరోజు 12 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ కొనసాగించిన రిషబ్ పంత్ తొలి సెషన్ నుంచే టాప్ గేర్‌లో ఆడేశాడు. ఈ క్రమంలో 128 బంతుల్లో 13x4, 4x6 సాయంతో 109 పరుగులు చేసి టీమ్ స్కోరు 234 పరుగుల వద్ద నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు. టెస్టుల్లో రిషబ్ పంత్‌కి ఇది 6వ సెంచరీకాగా.. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ధోనీ సరసన సగర్వంగా నిలిచాడు.

ధోనీ 144 ఇన్నింగ్స్‌ల్లో 6 సెంచరీలు చేయగా.. పంత్ కేవలం 58 ఇన్నింగ్స్‌ల్లోనే ఆరు శతకాలు బాదేశాడు. ఈ ఇద్దరి తర్వాత వృద్ధిమాన్ సాహా 3 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. సెంచరీ తర్వాత మెహదీ హసన్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పంత్ ఔటయ్యాడు. కారు యాక్సిడెంట్ తర్వాత 16 నెలలు టెస్టు క్రికెట్‌కి దూరంగా ఉన్న పంత్.. రీఎంట్రీ‌లోనే సెంచరీ సాధించడం విశేషం.

మొన్న డకౌట్.. ఈరోజు 119 నాటౌట్

చెపాక్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన శుభమన్ గిల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దాంతో రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో బ్యాటింగ్ చేసిన గిల్ 176 బంతుల్లో 10x4, 4x6 సాయంతో 119 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

తొలి సెషన్‌లో పంత్‌తో కలిసి భారీ సిక్సర్లు బాదిన గిల్.. పంత్ ఔట్ తర్వాత కాస్త నెమ్మదించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ సెంచరీ తర్వాత కాసేపటికే భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ డిక్లేర్ చేశాడు. రిషబ్ పంత్ ఔట్ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 22 పరుగులు చేసి అజేయంగా క్రీజులో నిలిచాడు.

రిషబ్ పంత్, శుభమన్ గిల్ జోడి నాలుగో వికెట్‌కి 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. గురువారం చివరి సెషన్‌లో యశస్వి జైశ్వాల్ (10), కెప్టెన్ రోహిత్ శర్మ (5), విరాట్ కోహ్లీ (17) తక్కువ స్కోరుకే ఔటైపోయారు. దాంతో 67/3తో నిలిచిన భారత్ జట్టుని పంత్, గిల్ జోడి తిరుగులేని స్థితిలో నిలిపింది. బంగ్లాదేశ్ బౌలర్లకి దాదాపు మూడు గంటలు ఈరోజు చుక్కలు చూపించేసింది.

ఎంత త్వరగా ముగిస్తారో?

మ్యాచ్‌లో ఇంకా రెండన్నర రోజు ఆట మిగిలి ఉండగా.. బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల భారీ లక్ష్యం ఉంది. 10 వికెట్లు ఆ జట్టు చేతిలో ఉన్నా.. బలమైన భారత్ బౌలింగ్‌ని ఎదుర్కొని మ్యాచ్‌లో గెలవడం లేదా డ్రాగా ముగించడం దాదాపు అసాధ్యం. కాబట్టి.. భారత్ ఎంత త్వరగా మ్యాచ్‌ని గెలుపుగా ముగిస్తుందో అనేది బౌలర్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంది.