Nellore : బంగారం, డబ్బు కోసం వలపు వల విసిరింది.. ఆఖరికి పోలీసులకు చిక్కింది!-police arrest girlfriend who kidnapped boyfriend ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Nellore : బంగారం, డబ్బు కోసం వలపు వల విసిరింది.. ఆఖరికి పోలీసులకు చిక్కింది!

Nellore : బంగారం, డబ్బు కోసం వలపు వల విసిరింది.. ఆఖరికి పోలీసులకు చిక్కింది!

HT Telugu Desk HT Telugu
Nov 25, 2024 04:31 PM IST

Nellore : ప్రియుడుని పిలిచి బంగారు ఆభ‌ర‌ణాలను దోచేసింది ఓ ప్రియురాలు. ఆపై ఒక హోట‌ల్‌లో బంధించి, రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది. ఏపీలోని నెల్లూరుకు చెందిన ఈ ప్రేమ జంట వ్య‌వ‌హారం బెంగ‌ళూరులో ర‌చ్చ‌కెక్కింది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.

వలపు వల
వలపు వల (istockphoto)

కోర‌మంగ‌ళ పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నెల్లూరుకు చెందిన శివ‌, మోనిక అనే యువ‌తీ, యువ‌కులు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శివ నెల్లూరులో మెడిక‌ల్ షాప్ నిర్వ‌హిస్తున్నారు. శివ వ‌ద్ద‌ బాగా డ‌బ్బు, బంగారం ఉన్న‌ట్లు భావించిన మోనికలో దుర్బుద్ధి పుట్టింది. డ‌బ్బులు, బంగారం ఎలాగైనా కొట్టేయాల‌ని భావించింది. ప్రేమికుడు శివను కిడ్నాప్ చేసి బాగా డ‌బ్బు, బంగారం వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. త‌న‌కు తెలిసినవారితో కుట్ర ప‌న్నింది.

ప్రియుడిని బంధించి..

నాలుగు రోజుల కింద‌ట శివ‌కు మోనిక ఫోన్‌చేసింది. తన స్నేహితులు శివను చూడాల‌ని అన్నారని, బంగారు న‌గ‌లు ధ‌రించి ఇన్నోవా కారులో పెనుకొండ‌కు రావాల‌ని కోరింది. మోనిక మాయ మాట‌ల‌ను న‌మ్మిన శివ 60 గ్రాముల బంగారు ఆభ‌ర‌ణాల‌తో పాటు.. ఇన్నోవా కారులో పుట్ట‌ప‌ర్తి జిల్లా పెనుకొండ‌కు వ‌చ్చాడు. అప్ప‌టికే అక్క‌డ వేచి ఉన్న‌ మోనిక, ఆరుగురు అనుచ‌రులు శివ‌ను కారులోనే కిడ్నాప్ చేశారు. బంగారు ఆభ‌ర‌ణాలు దోచుకుని పావ‌గ‌డ‌కు తీసుకెళ్లారు. పావ‌గ‌డ‌లోని హోట‌ల్‌లో బంధించారు. రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. శివ త‌న స్నేహితుల‌తో మాట్లాడి బ్యాంక్ ఖాతాలోకి రూ.5 ల‌క్ష‌లు జ‌మ చేయించాడు.

డ‌బ్బులు డ్రా చేసే స‌మ‌యంలో..

డ‌బ్బు డ్రా చేయాలంటే ఏటీఏం కార్డు లేదు. దీంతో నెల్లూరులో ఇంటి నుంచి బెంగ‌ళూరు మెజిస్టిక్ అడ్ర‌స్‌కు కొరియ‌ర్ చేయించుకున్నాడు. శ‌నివారం రాత్రి బెంగ‌ళూరులోని కోర‌మంగ‌ల‌లో న‌గ‌దు డ్రా చేయ‌డానికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో కిడ్నాప‌ర్ల మ‌ధ్య గొడ‌వ జరిగింది. గ‌స్తీ చేస్తున్న ఎస్ఐ మాదేశ్ అనుమానంతో వారిని ప‌ట్టుకున్నారు. వారిని విచారించ‌గా కిడ్నాప్ క‌థ వెలుగులోకి వ‌చ్చింది. వెంట‌నే పోలీసులు మోనిక‌, హ‌రీష్‌, హ‌రికృష్ణ‌, న‌రేష్‌, రాజ్‌కుమార్‌, న‌ర‌సింహ‌, అంజ‌నీల్ మొత్తం ఏడుగురిని అరెస్టు చేశారు.

కిడ్నాప‌ర్లు కూడా నెల్లూరుకు చెందిన‌ వారేన‌ని డీసీపీ సారా ఫాతిమా వెల్లడించారు. నిందితుల్లో ఇద్ద‌రిపై ఐదుకు పైగా కేసులు ఉన్నాయ‌ని తెలిపారు. ప్రియురాలే దోపిడి, కిడ్నాప్‌కు సూత్ర‌దారి అని స్పష్టం చేశారు. కేసు విచార‌ణ‌లో ఉంద‌ని డీసీపీ సారా ఫాతిమా వివ‌రించారు. మూడేళ్లు ప్రేమించిన ప్రియురాలే త‌న‌ను మోసం చేసింద‌ని తెలుసుకున్న ప్రియుడు శివ షాక్‌కు గుర‌య్యాడు. ఈ అమ్మాయితో మూడేళ్ల పాటు ప్రేమ‌లో ఉన్నానా? అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner