Peddapally Murder: గోదావరిఖనిలోని సింగరేణి హాస్పిటల్ లో స్వీపర్‌గా పనిచేసే సాయివినయ్ అదే ప్రాంతానికి చెందిన సాయిఅంజలిని ప్రేమించాడు. అయితే అంజలికి నాలుగేళ్ళ క్రితం వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త పిల్లలు ఉండగా అంజలి సాయివినయ్ ప్రేమలో పడి నాలుగు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.
సాయి వినయ్‌ని ప్రేమ పెళ్ళి చేసుకుని ఇద్దరు 8 ఇన్ క్లైయిన్ కాలనీలో కాపురం పెట్టారు. ప్రేమ పెళ్ళిని వ్యతిరేకిస్తూ ఆగ్రహంతో ఆ జంటపై అంజలి మొదటి భర్తతో పాటు అతని సోదరుడు కక్ష పెంచుకున్నారు. 8 ఇన్ క్లైయిన్ కాలనీలో ఉన్న ప్రేమ జంటపై కత్తులతో దాడి చేశారు. అంజలి తప్పించుకోగా సాయి వినయ్ ప్రాణాలు కోల్పోయాడు.
పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టాక సాయి వినయ్ ని ప్రేమ పెళ్ళి చేసుకుని అతని ప్రాణం పోవడానికి కారణం అంజలి అంటు వినయ్ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఆమెపై దాడికి యత్నించారు. స్థానికుల సహకారంతో పోలీసులు ఆమెను ఓ రూమ్ లో దాచి పెట్టి, రహస్యంగా సెఫ్ జోన్ కు తరలించారు. పండుగ పూట యువకుడు సాయి వినయ్ హత్యతో ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రేమ పెళ్ళిని వ్యతిరేకిస్తూ కత్తులతో దాడి చేసిన వారిని పోలీసులు గుర్తించారు. అంజలి మొదటి భర్తతో పాటు ఆమె సోదరుడు హత్యకు పాల్పడినట్లు గోదావరిఖని ఏసిపి రమేష్ తెలిపారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని చట్టపరంగా శిక్ష పడేలా సాంకేతిక పరమైన ఎవిడెన్స్ కోర్టుకు సమర్పిస్తామన్నారు.
అయితే హత్యకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పండుగ పూట హత్య ఉద్రిక్తతకు దారి తీసిన నేపద్యంలో పండుగ తర్వాత అరెస్టు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)