Crime News: అనంతపురంలో చెల్లెల్ని గర్భవతిని చేసిన అన్న.. నెల్లూరులో భర్త చేతిలో హత్యకు గురైన భార్య-older brother who got his sister pregnant in anantapur wife was killed by her husband in nellore ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Crime News: అనంతపురంలో చెల్లెల్ని గర్భవతిని చేసిన అన్న.. నెల్లూరులో భర్త చేతిలో హత్యకు గురైన భార్య

Crime News: అనంతపురంలో చెల్లెల్ని గర్భవతిని చేసిన అన్న.. నెల్లూరులో భర్త చేతిలో హత్యకు గురైన భార్య

HT Telugu Desk HT Telugu
Sep 11, 2024 09:21 AM IST

Crime News: అనంత‌పురం జిల్లాలో ఘోరం జరిగింది.మాయ మాట‌ల‌ల‌తో న‌మ్మ‌బ‌లికి బాలిక‌పై వరుసకు సోదరుడు అత్యాచారం చేశాడు. బాలిక గ‌ర్భం దాల్చ‌డంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో నెల్లూరులో భార్యను కత్తితో గొంతుకోసి హతమార్చిన భర్త, అనంత‌రం పోలీస్‌స్టేష‌న్‌లో లొంగిపోయాడు

అనంతపురంలో సోదరి వరుసయ్యే బాలికపై అత్యాచారం
అనంతపురంలో సోదరి వరుసయ్యే బాలికపై అత్యాచారం (HT_PRINT)

Crime News: అనంతపురం జిల్లాలో ఘోర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మాయ మాట‌ల‌ల‌తో న‌మ్మ‌బ‌లికి బాలిక‌పై అన్నయ్య వరుసయ్యే వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆ బాలిక గ‌ర్భం దాల్చ‌డంతో ఈ అమాన‌వీయ ఘ‌ట‌న‌ వెలుగులోకి వ‌చ్చింది. అభం శుభం తెలియ‌ని బాలిక‌పై ప‌లుమార్లు అత్యాచారం చేశాడు.

అనంతపురం జిల్లా శింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఒక గ్రామంలో చెల్లెలిని చెర‌బ‌ట్టిన ఉదంతం వెలుగులోకి వ‌చ్చింది. 14 ఏళ్ల బాలిక ఆర్థిక ప‌రిస్థితి బాగోలేక‌ ఐదో త‌ర‌గ‌తితో చ‌దువు మానేసి ఇంటి వ‌ద్దే ఉంటుంది. కూలి ప‌నుల‌కు వెళ్తూ త‌ల్లిదండ్రుల‌కు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే సొంత పెద‌నాన్న కొడుకు బాలిక‌పై క‌న్నేశాడు. వావివ‌ర‌స‌లు మ‌రిచి మాయ‌మాట‌లతో లోబ‌రుచుకున్నాడు.

నిందితుడికి అప్ప‌టికే పెళ్లై, పిల్ల‌లు ఉన్నారు. ఆ విష‌యం మ‌రిచి ఇంటి వ‌ద్ద ఎవ‌రూ లేని స‌మంయ‌లో బాలిక‌పై పలుమార్లు అత్యాచారం చేశారు. కుటుంబ స‌భ్యుల‌కు విష‌యం చెప్పొద్దంటూ బెదిరిస్తూ వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో బాలిక గ‌ర్భం దాల్చింది. ఈ విష‌యం వారి కుటుంబంలో తెలియ‌డంతో గొడ‌వ‌లు జ‌రిగాయి. ఇదే స‌మ‌యంలో నాలుగు రోజులు కింద‌ట ఉన్న‌ఫ‌ళంగా బాలిక అనారోగ్యం పాలైంది.

బాలిక‌ను ఈనెల 8న కుటుంబ స‌భ్యులు అనంత‌పురంలోని ఓ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. విష‌యం బ‌య‌ట‌కు పొక్కుతుంద‌ని ఆమె కుటుంబ స‌భ్యులు ర‌హ‌స్యంగా చికిత్స చేయించాల‌నుకున్నారు. అయితే గ‌ర్భ‌స్రావ‌మై ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉండ‌టంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌కు పొక్కింది. నిందితుడు కుటుంబ స‌భ్యుడే కావ‌డంతో బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డానికి ముందుకు రాలేదు.

ఆసుప‌త్రిలో ఆ బాలిక‌ను ప్ర‌సూతి వార్డులో ఉంచారు. ఐసీడీఎస్ అధికారుల దృష్టికి ఈ విష‌యం తీసుకెళ్లారు. దీనికి స్పందించిన ఐసీడీఎస్ పీడీ శ్రీ‌దేవి న‌గ‌రంలోని స‌ఖి వ‌న్ స్టాప్ సెంట‌ర్ మేనేజ‌ర్ శాంతామ‌న‌ణి, సిబ్బందిని రంగంలోకి దింపారు. అనంత‌పురం, బాలిక సొంత మండలానికి చెందిన పోలీసులు బాధిత త‌ల్లదండ్రులు, కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి వివ‌రాలు న‌మోదు చేసుకున్నారు. నిందితుడిని వ‌దిలిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని, పోక్సో కేసు న‌మోదు చేస్తామ‌ని ఐసీడీఎస్ పీడీ శ్రీ‌దేవి అన్నారు.

నెల్లూరు జిల్లాలో ఘోరం…

నెల్లూరు జిల్లాలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను కత్తితో గొంతుకోసి భర్త హతమార్చాడు. అనంత‌రం భ‌ర్త పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోయాడు. నెల్లూరు జిల్లా సైదాపురం మండ‌లంలోని గంగ‌దేవిప‌ల్లిలో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. క్ష‌ణాకావేశంలో భార్య‌ను కిరాతకంగా భ‌ర్త గొంతుకోసి హ‌త్య చేశాడు. గంగదేవిప‌ల్లికి చెందిన మ‌హేంద్ర‌కు అదే గ్రామానికి చెందిన లావ‌ణ్య (30)కు ప‌దేళ్ల క్రితం వివాహ‌మైంది. వీరికి ఇద్ద‌రు సంతానం ఉన్నారు. ఏడాదిగా వీరిద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ వివాదాలు జ‌రుగుతున్నాయి.

ప‌లుమార్లు గ్రామ పెద్ద‌లు, కుటుంబ పెద్ద‌లు వారిద్ద‌రితో మాట్లాడి స‌ర్ధి చెప్పారు. అయిన‌ప్ప‌టికీ వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వులు త‌గ్గ‌లేదు. త‌ర‌చూ గొడ‌వులు జ‌రుగుతూనేవి. ఈ క్ర‌మంలోనే సోమ‌వారం అర్థ‌రాత్రి భార్య భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. ఇద్ద‌రి మ‌ధ్య మాట‌మాట పెరిగింది. దీంతో భార్య లావ‌ణ్య‌పై మ‌హేంద్ర చేయి చేసుకున్నాడు. ఆ త‌రువాత ఈ గొడ‌వ తారాస్థాయికి వెళ్లింది. దీంతో క్ష‌ణికావేశంలో మ‌హేంద్ర ప‌క్క‌నే ఉన్న క‌త్తి తీసి, భార్య లావ‌ణ్య గొంతుకోసి హ‌త్య చేశాడు.

అనంత‌రం మంగళవారం పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని విచారించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు. అనంత‌రం ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు సీఐ విజ‌య‌కృష్ణ, ఎస్ఐ కాంతికుమార్‌ తెలిపారు. లావ‌ణ్య హ‌త్యతో ఆ గ్రామంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. కుమార్తె హ‌త్య‌తో త‌ల్లిదండ్రులు రోద‌న‌లు మిన్నంటాయి. బంధువులు క‌న్నీరుమున్నీరు అయ్యారు. త‌ల్లిదండ్రుల మ‌ధ్య జ‌రిగే గొడ‌వులు హ‌త్యకు దారితీయ‌డంతో ప‌దేళ్ల లోపు ఇద్ద‌రు చిన్నారులు అనాథ‌ల‌య్యారు.