CM Revanth Reddy On Adani : అదానీ రూ.100 కోట్ల విరాళం తిరస్కరిస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
CM Revanth Reddy On Adani : దేశ వ్యాప్తంగా అదానీ వివాదం ముదురుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని తిరస్కరించినట్లు ప్రకటించారు. ఈ మేరకు అదానీ సంస్థకు లేఖ రాశామన్నారు.
అదానీ గ్రూప్ లంచాల ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీకి అదానీ సంస్థ కేటాయించిన రూ.100 కోట్ల విరాళాన్ని స్వీకరించడానికి నిరాకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అదానీ గ్రూప్ నకు లేఖ రాశామన్నారు.
"18.10.2024 నాటి మీ లేఖ ద్వారా అదానీ ఫౌండేషన్ తరపున యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ. 100 కోట్లు కేటాయించినందుకు మేము మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. విశ్వవిద్యాలయం సెక్షన్ 80G కింద IT మినహాయింపును పొందనందున నిధుల బదిలీ కోసం మేము ఇప్పటివరకు దాతలలో ఎవరినీ అడగలేదు. ఈ మినహాయింపు ఉత్తర్వులు ఇటీవల వచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు, తలెత్తుతున్న వివాదాలను దృష్టిలో ఉంచుకుని నిధుల బదిలీ చేయవద్దని కోరాలని ముఖ్యమంత్రి నన్ను ఆదేశించారు" అని జయేష్ రంజన్ అదానీ గ్రూప్ నకు లేఖ రాశారు.
రూ.100 కోట్ల విరాళం వద్దని చెప్పాం - సీఎం రేవంత్ రెడ్డి
ఈ విషయంపై హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్న స్కిల్స్ ఇండియా యూనివర్సిటీకి అదానీ గ్రూపు ప్రకటించిన రూ.100 కోట్ల విరాళాన్ని స్వీకరించరాదని నిర్ణయించామన్నారు. అదానీ సంస్థపై విమర్శల దృష్ట్యా విరాళాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అదానీ సంస్థ విషయంలో కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయన్నారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు స్వీకరించిందని కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. అయితే రాజ్యాంగబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు అనుమతిస్తామన్నారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రభుత్వ ప్రాజెక్టులు ఇస్తున్నామన్నారు. దేశంలో ఎవరికైనా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకొనే హక్కు ఉందన్నారు. అంబానీ, అదానీ, టాటా, ఇలా ఏ సంస్థకైనా తెలంగాణలో వ్యాపారం చేసుకొనే హక్కు ఉందన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గొప్ప సంకల్పంతో లక్షలాది మంది నిరుద్యోగులకు సాంకేతిక నైపుణ్యాలు అందించాలనే లక్ష్యంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గొప్ప ఉద్దేశంతో ప్రారంభించిన స్కిల్స్ వర్సిటీని వివాదాల్లోకి లాగడం తనకు, తన సహచర మంత్రులకు ఇష్టం లేదన్నారు. స్కిల్స్ వర్సిటీకి ఇచ్చిన విరాళాన్ని సీఎం, మంత్రులకు ఇచ్చినట్లు కొందరు వివాదం చేస్తున్నారని, వీటికి చెక్ పెట్టేందుకు సీఎస్‌ఆర్ కింద అదానీ గ్రూప్ ప్రకటించిన రూ.100 కోట్లు బదిలీ చేయొద్దని కోరామన్నారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగితే నిరుద్యోగులు నష్టపోతారన్నారు.
కేసీఆర్ ఫ్యామిలో సీఎం పంచాయితీ
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అదానీ సంస్థకు ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. అదానీతో బీఆర్‌ఎస్ నేతలు కమీషన్లు తిన్నారన్నారు. కేటీఆర్ జైలుకెళ్లాలని తహతహలాడుతున్నారన్నారు. జైలుకెళ్తే సీఎం అవుతారని భావిస్తున్నారని, అలా అయితే కేసీఆర్ కుటుంబంలో కవిత జైలుకు వెళ్లారని ముందుగా కవిత సీఎం అవుతారన్నారు. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు. తన దిల్లీ పర్యటనలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. తాను 28 సార్లు దిల్లీ వెళ్లానని విమర్శిస్తున్నారని, తాను పైరవీలు, బెయిల్ కోసమో దిల్లీ వెళ్లలేదన్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసం దిల్లీ వెళ్తున్నామన్నారు. రేపు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలపై మాట్లాడతామన్నారు.
సంబంధిత కథనం