IND vs BAN 1st Test Live: భారత్ పేసర్ల దెబ్బకి లంచ్ బ్రేక్‌కి బంగ్లా టాప్-3 బ్యాటర్లు ఔట్.. ఇంకా 350 రన్స్ దూరం
India vs Bangladesh Live Updates: చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు అశ్విన్, జడేజా నిరాశపరిచారు. దాంతో ఈరోజు తొలి సెషన్‌లో అదీ 37 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకుని భారత్ జట్టు ఆలౌటైంది.
IND vs BAN 1st Test Live Score: భారత్ ఫాస్ట్ బౌలర్ల దెబ్బకి బంగ్లాదేశ్ టీమ్ టాప్ ఆర్డర్ విలవిలలాడుతోంది. రెండో రోజైన శుక్రవారం తొలి సెషన్‌లో భారత్ జట్టు 376 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ టీమ్ లంచ్ బ్రేక్‌కి 26/3తో నిలిచింది. క్రీజులో కెప్టెన్ శాంటో (15 బ్యాటింగ్: 22 బంతుల్లో 2x4), ముష్ఫికర్ రహీమ్ (4 బ్యాటింగ్: 4 బంతుల్లో 1x4) ఉన్నారు. బంగ్లాదేశ్ టీమ్ ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 350 పరుగులు వెనుకబడి ఉంది.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్లు సద్దాం ఇస్లాం (2), జాకీర్ హసన్ (3) సింగిల్ డిజిల్ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోయారు. ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్‌లోనే ఇస్లాంను జస్‌ప్రీత్ బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో అక్షదీప్ వరుస బంతుల్లో జాకీర్, మినుమల్ హక్ (0)లను పెవిలియన్ బాట పట్టించాడు.
అంతకముందు ఓవర్ నైట్ స్కోరు 339/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 91.2 ఓవర్లలో 376 పరుగులకి కుప్పకూలిపోయింది. వెటరన్ క్రికెటర్ అశ్విన్ (113: 133 బంతుల్లో 11x4, 2x6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈరోజు తొలి సెషన్‌లో ఓవర్ నైట్ స్కోరుకి ఒక్క పరుగు కూడా జోడించకుండానే ఆరంభంలోనే రవీంద్ర జడేజా (86: 124 బంతుల్లో 10x4, 2x6) వికెట్ చేజార్చుకున్నాడు. అనంతరం వచ్చిన అక్షదీప్ (17: 30 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడే క్రమంలో ఔటైపోగా.. జస్‌ప్రీత్ బుమ్రా (7), మమ్మద్ సిరాజ్ (0 నాటౌట్) నిరాశపరిచారు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్మద్ 5 వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ మూడు, నహీద్ రాణా, మిరాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
తొలి రోజు పరువు నిలిపిన అశ్విన్, జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో వాస్తవానికి టీమిండియా బ్యాటింగ్ లైనప్ తడబడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (6), శుభమన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టగా.. రిషబ్ పంత్ (39: 52 బంతుల్లో 6x4), యశస్వి జైశ్వాల్ (56: 118 బంతుల్లో 9x4) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. అయినప్పటికీ భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 42.2 ఓవర్లు ముగిసే సమయానికి 144/6తో తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ.. రవీంద్ర జడేజా, అశ్విన్ అసాధారణ ఇన్నింగ్స్‌తో టీమిండియా పరువు నిలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్‌కి సుదీర్ఘకాలం ఆడిన జడేజాకి చెపాక్ పిచ్ కొట్టినపిండి. ఇక రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ ఓనమాలు ఆ స్టేడియంలోనే నేర్చుకున్నాడు. దాంతో ఈ ఇద్దరూ బంగ్లాదేశ్ బౌలర్లకి గురువారం చివరి సెషన్‌లో చుక్కలు చూపించేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు తడబడిన పిచ్‌పై అశ్విన్, రవీంద్ర జడేజా భారీ సిక్సర్లు కొట్టారు. దాంతో మొదటి రెండు సెషన్లలో భారత్ బ్యాటర్లని ఇబ్బందిపెట్టిన బంగ్లాదేశ్ బౌలర్లు చివరి సెషన్‌లో చేతులెత్తేశారు.
వన్డే తరహాలో హిట్టింగ్
అశ్విన్, జడేజా ఏడో వికెట్‌కి 199 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్ సెంచరీ నమోదు చేయగా.. రవీంద్ర జడేజా కూడా మంచి టచ్‌లో కనిపించాడు. గురువారం చివరి సెషన్‌లోనే ఆఖరి అరగంట ఈ జోడి వన్డే తరహాలో హిట్టింగ్ చేసింది. ఎంతలా అంటే చివరి 10 ఓవర్లలో ఏకంగా 56 పరుగుల్ని రాబట్టింది.
పిచ్‌పై పగుళ్లు వస్తే?
తొలి రోజు ఫాస్ట్ బౌలర్లకి అనుకూలించిన చెపాక్ పిచ్ ఈరోజు స్పిన్నర్లకి సహకరించే సూచనలు కనిపిస్తున్నాయి. చెన్నై వేడి వాతావరణం కారణంగా పిచ్‌పై చిన్న చిన్న పగుళ్లు వచ్చే అవకాశం ఉంది. అయితే పిచ్ మరీ పొడిబారకుండా క్యూరేటర్ జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ పిచ్‌పై పగుళ్లు వస్తే మాత్రం బంతి విపరీతంగా తిరిగే ప్రమాదం ఉంటుంది. బంగ్లాదేశ్ టీమ్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు.